మాఫియాగా ‘రియల్టర్లు’ | land grabbing in distict | Sakshi
Sakshi News home page

మాఫియాగా ‘రియల్టర్లు’

Published Wed, Jun 29 2016 8:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

మాఫియాగా ‘రియల్టర్లు’

మాఫియాగా ‘రియల్టర్లు’

నిజామాబాద్-హైదరాబాద్ హైవే చుట్టూ లే అవుట్లు
భిక్కనూర్ శివారులో ‘చుక్క’లు చూపుతున్నారు
దోమకొండ, సదాశివనగర్ ఏరియాలో అక్రమం
పంటపొలాల్లో వెలుస్తున్న వెంచర్లు
అక్రమ లేఅవుట్లపై కదలని యంత్రాంగం
రూ.కోట్లలో సర్కారు ఆదాయానికి గండి
మాఫియాగా ‘రియల్టర్లు’

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎప్పటి నుంచో కాచుకుని ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త జిల్లాల ఏర్పాటు వరంగా మారింది. కామారెడ్డి చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ప్లాట్ల వ్యాపారం జోరందుకుంది. నాగపూర్ - హైదరాబాద్  జాతీయ రహదారి చుట్టూ పంటపొలాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. సదాశివనగర్ నుంచి మెదక్ జిల్లా రామాయంపేట్ జాతీయ రహదారి చుట్టూ రియల్ ఎస్టేట్ ‘మాఫియా’ ఇష్టారాజ్యంగా ఆక్రమ భూదందా చేస్తోంది.

కామారెడ్డి కేంద్రంగా కొత్తగా జిల్లా ఏర్పడుతుందన్న ప్రచారంతో ఒక్కసారిగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం  జోరుగా సాగుతోంది. కొంత పెట్టుబడి.. నేతల అండ ఉంటే చాలు ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు నివేశన స్థలాలుగా మారిపోతున్నాయి. వ్యవసాయ పొలాలను నివేశన స్థలాలను మారుస్తున్నా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది చేయి తడిపి రూ.లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండికొడ్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారు కామారెడ్డి, ఎల్లారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, సదాశివనగర్‌ల శివార్లలో ప్లాట్లు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.

రియల్టర్లకు అధికారుల అండదండలు
కామారెడ్డి జిల్లా కేంద్రం కానున్న తరుణంలో ఒక్కసారిగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో స్థిరాస్తి వ్యాపారం సాగుతోం ది. విచ్చలవిడిగా అక్రమ లే అవుట్‌లు వెలుస్తున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారుల నుంచి కనీస చర్యలు లేవు. ఈ ప్రాంతంలో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న భూదందా.. కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి-హైదరాబాద్ మధ్యన ఉన్న ఒక్కసారిగా ఊపందుకుంది. కామారెడ్డితో పాటు కామారెడ్డి-హైదరాబాద్‌ల మధ్యన జాతీయ రహదారి పొడువునా మండల కేంద్రా లు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నచోట కూడా లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు.

కామారెడ్డి పట్టణంలో నెల వ్యవధిలో ఏడు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు పెట్టాయి. ఎల్లారెడ్డిలో ఇప్పటికే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తోంది. చెరువును ఆక్రమించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వివాదాస్పదంగా మారినా.. విక్రయాలు సాగి స్తున్నారు. ‘సూర్యనగర్’ పేరుతో మరో వెంచర్ కూడా మళ్లీ విక్రయాలు సాగిస్తుండగా.. ఈ రెండు వెంచర్ల వెనుక కామారెడ్డికి చెందిన రియల్టర్లే ఉన్నారు. భిక్కనూర్, సదాశివనగర్, కామారెడ్డి శివార్లలో కామారెడ్డికి చెందిన కొందరు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ప్లాట్లను విక్రయిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. కామారెడ్డి జిల్లా తెరపైకి వచ్చాక నెల రోజుల వ్యవధిలో చుట్టూ పక్కల 42 చోట్ల స్థిరాస్తి వ్యాపారం కోసం అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేయగా పంచాయతీ, నగర/పట్టణ పాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

 లే-అవుట్ల నిబంధనలు..
జిల్లాలో స్థిరాస్తి వ్యాపారంలో వేస్తున్న లే అవుట్‌లు అధికశాతం నిబంధనలు పాటిం చడం లేదు. ఫలితంగా కొనుగోలు దారు లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

లే అవుట్ వేసేందుకు ముందుగా పంచాయతీ ఆమోదం పొందాలి. నగరాలు, పట్టణాల్లో మున్సిపాల్టీ తీర్మానం చేయాలి.

లే అవుట్ వేస్తున్న భూమిని భూ మార్పిడి కింద(వ్యవసాయేతర వినియోగం) రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇందుకు భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం సొమ్ము రుసుము కింద చెల్లించాలి.

పదెకరాల్లో లే అవుట్ వేస్తే దాని రిజిస్ట్రేషన్ విలువను బట్టి 10 శాతం రుసుము ఉంటుంది. ఉదాహరణకు ఎకరా రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తే.. రూ.3 లక్షలు రుసుముగా చెల్లించాలి.

లే అవుట్‌కు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని అనుమతి పొందాలి.

లే అవుట్ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజోపయోగానికి వదిలివేయాలి. గ్రామ పంచాయతీ అయితే పంచాయతీకి, పట్టణాల్లో అయితే మున్సిపాల్టిలకు రిజిస్ట్రేషన్ చేయించాలి.

అనుమతి పొందిన లే అవుట్‌లో ప్రణాళికా విభాగం సూచించిన స్థలాన్నే ప్రజోపయోగానికి వదిలి వే యాలి. ఈ స్థలాల్లో సామాజిక భవనం, పాఠశాలలు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టే వీలుంటుంది.

రూ.కోట్లలో ఎగవేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
కామారెడ్డి ప్రాంతంలో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా లే అవుట్‌లు వేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గత ఆరు నెలల్లో దాదాపు 100కు పైగా లే అవుట్‌లు వెలిశాయి. ఈ భూమి సగటున ఎకరాకు కనీసం రూ.30 లక్షల వంతున విలువ రూ.300 కోట్లు. ఇందులో 10 శాతం రుసుము ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే వ్యాపారులు, అధికారులు కూడ బలుక్కొని రూ.30 కోట్లు ఎగవేశారు. లే అవుట్‌లో 10 శాతం స్థలాన్ని కూడా వదల్లేదు. కొన్నింటికీ గ్రామ పంచాయతీల తీర్మానాలు, ఆమోదం లేవు.

కామారెడ్డితోపాటు పట్టణ శివారులో జాతీ య రహదారికి ఇరువైపులా లే అవుట్‌లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అటు మున్సిపాలిటీ, ఇటు సంబంధిత పంచాయతీ ఆమోదం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్న ఒకే ఒక కారణంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది.

ఎల్లారెడ్డిలో రెండు చోట్ల భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. ఆ రెండు లే-అవుట్లకు కూడా చట్టబద్ధత లేకపోగా.. వ్యవసాయ క్షేత్రాలను ప్లాట్లుగా మార్చారు. కొనుగోలుదారులు ఇప్పటికే సంశయిస్తుండగా.. అధికారుల మౌనం చర్చనీయాంశం అవుతోంది.

నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారి పక్కన సదాశివనగర్‌లో ఏడాది క్రితం కొత్తగా వెంచర్ ఏర్పడింది. అయితే వారు ఆశించిన రేటు రాక కొంతకాలంగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఇటీవల కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఊపందుకుంది. అయితే  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని ఈ వెంచర్ నిర్వాహకులు చెబుతున్నా అందుకు సంబంధించిన పత్రాలు చూపడం లేదు. ఓ రైసుమిల్లుకు అతి సమీపంలో వెలసిన ఈ వెంచర్‌పై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు.

దోమకొండ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్‌లు లేకుండానే వెంచర్లు వెలిశాయి. దోమకొండ శివారులో సబ్‌స్టేషన్ వె నకాల ఉమాబాగ్‌లో సర్వే నంబర్ 60,61 లో ఇటీవల ప్లాట్లను విక్రయిస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం ఎలాంటి లేఅవుట్ లేకుండా దానిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. డీటీసీపీ లే అవుట్ పర్మిషన్ లేకుండా వారు ప్లాట్లను విక్రయిస్తున్నారు. దాదాపు   5 ఎకరాల 35 గుంటల స్థలంలో 121 ప్లాట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీరు విక్రయిస్తున్నారు. వెంచర్‌కు హద్దులో సర్వే నంబర్ 23లో 2 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ శిఖం భూమి ఉంది.

కామారెడ్డి శివారు జాతీయ రహదారి వెంట ఉన్న బస్వాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, నర్సన్నపల్లి, సరంపల్లి, క్యాసంపల్లి, రామేశ్వర్‌పల్లి, అడ్లూర్, ఇల్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, పద్మాజివాడీ ఎక్స్‌రోడ్, పద్మాజీవాడీ తదితర గ్రామాల పరిధిలో రియల్ దందా పరుగులు పెడుతోంది. కాదు రియల్టర్లు దందాను పరుగులు పెట్టిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసైన్డ్, శిఖం భూములను కూడా తమ వెంచర్లలో కలిపేసుకుంటున్నారు. ఇల్చిపూర్, అడ్లూర్, రామేశ్వర్‌పల్లి గ్రామాల శివారులో అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున రియల్ వ్యాపారుల ఆధీనంలో ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement