‘కొద్దిలో మిస్సయ్యాడు.. నేనైతే వేసేసేవాడిని’ | loose talks leads Man murder in hyderabad | Sakshi
Sakshi News home page

‘కొద్దిలో మిస్సయ్యాడు.. నేనైతే వేసేసేవాడిని’

Published Sat, Jan 14 2017 8:37 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

‘కొద్దిలో మిస్సయ్యాడు.. నేనైతే వేసేసేవాడిని’ - Sakshi

‘కొద్దిలో మిస్సయ్యాడు.. నేనైతే వేసేసేవాడిని’

కుత్బుల్లాపూర్‌: కాల్పుల ఘటనలో సూత్రధారి నోటి దురుసు వల్లే హత్యకు గురయ్యాడని పోలీసులు వెల్లడించారు. పేట్‌ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రియల్టర్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏసీపీ అందె శ్రీనివాస్‌ రావు వెల్లడించిన వివరాలు.. కుత్బుల్లాపూర్‌ పద్మానగర్‌కు చెందిన శైలేందర్‌ కుమార్‌ అలియాస్‌ చక్రవర్తికి బాపూనగర్‌కు చెందిన మందాడి నాగేందర్‌రెడ్డికి మధ్య రియల్‌ ఎస్టేట్ రంగంలో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2016 నవంబర్‌ 16న చక్రవర్తి అతని అనుచరుడు సాయి ప్రభు అలియాస్‌ తేజ కలిసి తుపాకితో నాగేందర్‌ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డారు. తృటిలో ప్రాణాప్రాయం నుంచి నాగేందర్‌ రెడ్డి తప్పించుకోగా సాయి ప్రభు పట్టుబడ్డాడు. దీంతో సూత్రధారి చక్రవర్తి పరారీలో ఉండగా పోలీసులు పట్టుకుని డిసెంబర్‌ 22వ తేదిన రిమాండ్‌కు తరలించారు.

బెయిల్‌పై బయటకు వచ్చిన చక్రవర్తి నాగేందర్‌రెడ్డిని వదిలేది లేదంటూ బహిరంగంగానే సవాల్‌ విసిరుతూ వస్తున్నాడు. ఇది తెలుసుకున్న నాగేందర్‌రెడ్డికి ప్రాణ భయం పట్టుకుంది. దీంతో వాజ్‌పాయ్‌ నగర్‌కు చెందిన కట్ట నాగయ్య(24), కుంట రవి(29)లకు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకుని చక్రవర్తిని చంపేందుకు సిద్దమయ్యారు. అదను కోసం వేచి చూస్తుండగా శుక్రవారం రాత్రి పద్మానగర్‌ చాయిస్‌ ఫ్యాక్టరీ దగ్గర ఓ ప్లాట్‌ విషయంలో ముగ్గురితో మాట్లాడుతున్న చక్రవర్తిని గుర్తించి రాడ్డు, కత్తులతో దాడి చేసి హతమార్చారు.

మధ్యాహ్నమే కౌన్సిలింగ్‌..అంతలోనే హత్య..
బెయిల్‌పై విడుదలై వచ్చినప్పటి నుంచి చక్రవర్తి ‘కొద్దిలో నాగేందర్‌రెడ్డి మిస్‌ అయ్యాడు.. నేనైతే వేసేసే వాడిని’ అంటూ పబ్లిక్‌గా చెప్పుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి నేనే డాన్‌ అంటూ చెప్పుకుంటున్న చక్రవర్తి.. నాగేందర్‌రెడ్డి తన నుంచి తప్పించుకోలేడంటూ, ఎదురు తిరిగితే ఊరుకోనంటూ పద్మానగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద బెదిరింపులకు దిగుతున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. చక్రవర్తి కదలికలపై కట్ట నాగయ్య, కుంట రవి కన్నేసి ఉంచారు. సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌ వద్దే ఉన్న వారిద్దరూ.. స్టేషన్‌ నుంచి చక్రవర్తి బయటకు రాగానే హత్య చేసేందుకు పథకం పన్నారు. అయితే, వారి కళ్లుగప్పి చక్రవర్తి వెళ్లిపోయాడు.

దీంతో అతని ఆచూకీని కనిపెడుతూ వస్తున్న నాగేందర్‌రెడ్డి తన అనుచరులకు ఒంటరిగా ఉన్న చక్రవర్తి కనిపించాడు. వెంటనే క్షణాల్లో అతనిపై దాడి చేసి విచక్షణా రహితంగా రాడ్డుతో కొట్టి కత్తుల పొడిచి ఘటన స్థలంలో సుమారు 45 నిమిషాలు ఎవరిని రాకుండా పోలీసులు వచ్చేంత వరకు ఉండి లొంగిపోయారు. రాబోయే రోజుల్లో ఈ గ్రూపు తగాదాలు ఎంత వరకు దారి తీస్తాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement