పెళ్లి చెడగొట్టాడనే హత్య
ముద్దాయి అరెస్టు
ఐ.పోలవరం : కేశనకుర్రు గ్రామంలో ఈనెల 13వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తనకు పెళ్లి సంబంధాలు రాకపోవడానికి కారకుడని భావించి ఒకప్పటి తన మిత్రుడిని హత్య చేశాడు. పాత ఇంజరం పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఎల్.అంకయ్య గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కేశనకుర్రు గ్రామ పరిధి పెద్ద చెరువు గట్టు ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, అంగాడి సత్తిరాజు (26), చింతాప్రసాద్ స్నేహితులు. ఈ ముగ్గురూ చెడు అలవాట్లకు బానిసలయ్యారు. ఆ నేపథ్యంలో సత్తిరాజుకు వెంకటేశ్వర్లుకు మధ్య మనస్పర్థలు పెరి గాయి. 2011 నుంచి తనకు వచ్చిన పెళ్లి సంబంధాలు తప్పిపోడానికి సత్తిరాజే కారకుడని వెంకటేశ్వర్లు తెలుసుకున్నాడు. దాంతో అతనిపై కక్ష పెంచుకొని అతనిని చంపాలని సమయం కోసం వేచిచూస్తున్నాడు. చింతా ప్రసాద్‌కు పెళ్లికావడంతో అతను అత్తవారి ఊరైన గొర్రెపూడి వెళ్లిపోయాడు. ఈనెల 11వ తేదీన చింతా ప్రసాద్ ఊరిలోకి వచ్చాడు. అతన్ని కచ్చితంగా సత్తిరాజు కలుస్తాడని వెంకటేశ్వర్లు భావించాడు. అదే విధంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో చింతా ప్రసాద్, అంగాడి సత్తిరాజు, పి. రాంబాబు గోదావరి ఒడ్డుకు వెళ్లారు. ఆవిషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కత్తిలాంటి చాకుతో వారు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. నీతో మాట్లాడాలి రమ్మనమని సత్తిరాజును పిలిచాడు. దానికి అతను తిరస్కరించడంతో తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో అతని ఛాతిపై పొడిచాడు. గాయపడిన సత్తిరాజు పరుగుతీస్తూ గోదావరి గట్టు ఎక్కి అక్కడ పడిపోయాడు. స్థానికులు అతన్ని మోటారు సైకిల్‌పై తొలుత మురమళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడ నుంచి అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లేసరికి సత్తిరాజు చనిపోయాడు. డీఎస్పీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన సీఐ రమణరావు ఈనెల 20వ తేదీన వెంకటేశ్వర్లును అతని ఇంటి వద్ద అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు చింతా వెంకటేశ్వర్లును గురువారం కోర్టుకు హాజరు పరిచారు.