లింగాపురంలో వ్యక్తి దారుణహత్య
Published Fri, Jan 6 2017 12:10 AM | Last Updated on Wed, Sep 5 2018 2:14 PM
- కుటుంబ కలహాలతో పెళ్లి సంబంధం చూసిన వ్యక్తిని చంపేసిన యువకుడు
ఎం.లింగాపురం (కొత్తపల్లి): తెలిసిన యువకుడు, యువతి ఉంటే వారికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయడం పెద్దలకు పరిపాటి. ఆ జంట అన్యోన్యంగా ఉంటే వారిని కలిపిన పెద్దలను చిరకాలం గుర్తు పెట్టుకుంటారు. కుటుంబ కలహాలు వస్తే సంబంధం చూసిన వారిని తిట్టుకుంటారు. ఇక్కడ ఓ యువకుడు మాత్రం ఏకంగా ప్రాణం తీశాడు. నిత్యం తగువు పడే యువతితో పెళ్లి చేశాడని ఓ వ్యక్తిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మూల ప్రసాద్‌కు అదే గ్రామానికి చెందిన చిమ్మెగోపన్న(50) తెలంగాణ ప్రాంతంలో తనకు తెలిసిన బంధువుల అమ్మాయి బేబీని ఇప్పించి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ప్రసాద్, బేబీ కుటుంబ కలహాలతో నిత్యం ఘర్షణ పడేవారు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరు తగాదా పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ తనకు సరిపోని అమ్మాయిని ఇప్పించి వివాహం జరిపించిన చిమ్మెగోపన్నపై కసి పెంచుకున్నాడు. ఆవేశంతో ఇంట్లోని రోకలిబండను తీసుకొని దూరంగా ఉన్న అతనికి ఇంటికెళ్లాడు. మంచంపై కూర్చొన్న గోపన్న తలపై బాదటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన మృతుడి భార్య, పిల్లలపై దాడిచేసేందుకు యత్నించటంతో వారు భయంతో పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకునేలోగా నిందితుడు పరారయ్యాడు. మృతుడికి భార్య బుచ్చమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పాములపాడు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement