కొలిక్కి వచ్చిన హత్యకేసు దర్యాప్తు
Published Sun, Jul 24 2016 8:37 PM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
పొదలకూరు : నెల్లూరు నగరంలో నివాసం ఉంటున్న పీవీఆర్ చికెన్స్ దుకాణం కలెక్షన్ ఏజెంట్ చక్రం గోవర్ధన్ హత్య కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలిసింది. హత్యలో ఆరుగురు వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ హత్య కేసును పొదలకూరు సీఐ ఏ శివరామకృష్ణారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. కేసులో త్వరితగతిన పురోగతి సాధించారు. ఈ నెల 14వ తేదీన గోవర్ధన్ హత్యకు గురై, మృతదేహాన్ని మండలంలోని బ్రాహ్మణపల్లి శ్మశానానికి సమీపంలో గుర్తించిన విషయం తెలిసిందే. 11వ తేదీన గోవర్ధన్ అదృశ్యమైనట్టు గూడూరు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హతుడు భార్య పొదలకూరు స్టేషన్‌కు వచ్చి ప్రాథమిక సమాచారం అందించారు. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు హంతకులను గుర్తించారు. మైపాడు ప్రాంతానికి చెందిన యువకుడు హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గోవర్ధన్‌కు నిందితుడికి గతంలో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో హతుడి కదలికలపై నిఘా పెట్టిన హంతకుడు తన స్నేహితులను కలుపుకుని హత్య చేసినట్టుగా తెలిసింది. హత్యకు జార్ఖాండ్ నుంచి తీసుకువచ్చిన పిస్టల్‌ను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. గోవర్ధన్‌ను హత్య చేసి బ్రాహ్మణపల్లి సమీపంలోని శ్మశానం వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లారు. హత్య జరిగిన సమయంలో గోవర్ధన్ వద్ద కలెక్షన్ నగదు కూడా ఉన్నట్టు తెలిసింది. మృతుడి వద్ద ఏ మేరకు నగదు ఉన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కొలిక్కి వచ్చిన హత్య కేసు నిందితులను త్వరలో అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.
Advertisement
Advertisement