అసమానత..అమానవీయం
అసమానత..అమానవీయం
Published Tue, Mar 7 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
- వివక్ష తొలిగితేనే అభివృద్ధి
- ఇంటి నుంచే మార్పు రావాలి
- మహిళల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
‘‘సామాజిక రుగ్మతలన్నింటికీ మూల కారణం అసమానతే. దీనిని రూపుమాపనంత వరకు సమాజానికి శాంతి ఉండదు. అలజడి, ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. వివక్ష..మహిళల జీవితాలను వికసించకుండా చేస్తోంది. నారీమణుల అభివృద్ధికి ఆటంకంగా మారింది. స్త్రీలను గౌరవించే మన సంప్రదాయంలో తరుణీమణులకు తగినంత స్వేచ్ఛ దొరకడం లేదు. వారి అభిరుచులకు..ఆలోచనలకు ప్రాధాన్యం లభించడం లేదు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే అవకాశాలను అందిపుచ్చుకొని అబలలు..భళా అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ప్రోత్సాహంఅంతటా ఉండాలి. సమాజంలో మార్పు రావాలి. అసమానత ఎక్కడున్నా అది అమానవీయమే’’
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్జి జి. అనుపమ చక్రవర్తి
కర్నూలు(లీగల్): మహిళలు ఎందులోనూ తీసిపోరు..ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి అన్నారు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి. అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేదని ఏమీ లేదని చెప్పారు ఆమె. కుటుంబ ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి వచ్చినట్లు వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ‘సాక్షి’ తో ఆమె మాట్లాడారు. ఆమె మాటల్లోనే..
‘‘ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నేను ఎలాంటి ఒత్తిడికీ గురికాను. ఇంట్లో వివిధ రకాల పనులు ఏ విధంగా చేసుకుంటామో నా కార్యాలయ పనిని కూడా అదే రీతిలో నిర్వహిస్తాను. కుటుంబంలో మహిళ.. భార్య, తల్లి, చెల్లి, అమ్మ, వదిన లాంటి పాత్రలను పోషించినట్లే జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నేను నా పనిని సమర్థంగా నిర్వహిస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉండొచ్చు..దానిని అధిగమించేందుకు మన వంతు కృషి చేయాలి. కష్టపడి పనిచేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంటే వివక్షలుండవు.
ఇంటికి వెళ్తే ఇల్లాలినే..
జిల్లా జడ్జిగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి కేటాయించాల్సిన సమయం కేటాయిస్తాను. సాధ్యమైనంతవరకు కార్యాలయ పనిని కార్యాలయంలోనే పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. కోర్టులో ఉన్నంతసేపు జిల్లా జడ్జిని, ఇంటికి వెళ్తే ఇల్లాలినే. తీరిక సమయంలో ఇంటి పని చేస్తుంటాను. మా కుమారుడు కొన్ని సందేహాలు అడుతుంటాడు.. వాటిని తీర్చడంతోపాటు వాడికి మంచి చెడ్డలు చెబుతుంటాను. అలాగే చదువు విషయాలు తెలుసుకుంటాను.
మరచిపోలేని ఘటన..
నా జీవితంలో మరచిపోలేని ఘటన ఏదైనా ఉందంటే అది మా నాన్న నన్ను విడిచి వెళ్లడమే. మా నాన్న లేకపోవడం నాకు ఇప్పటికీ పెద్ద లోటే. నాలో ఇప్పటికీ ధైర్యం ఉందంటే అది నాన్న నింపిందే. వైద్య వృత్తిలో ఉన్న నాన్న నాకు ఎన్నో విషయాలు నేర్పారు. ఇప్పటికీ మా నాయన నా చుట్టూ ఉన్నట్లుగా భావిస్తాను. మా మామ గారు వ్యవసాయం చేసేవారు. నా భర్త లక్ష్మణ్‌రావు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.
ధైర్యం వీడకూడదు..
మహిళలు ఏదైనా సాధించాలంటే అందుకు తగిన కృషి చేసి విజయం సాధించాలి. అడ్డంకులు వస్తే ధైర్యం వీడకూడదు. అబలలమన్న భావన లేకుండా అన్ని రంగాల్లో రాణించాలి. మహిళల ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయం ఇంటి నుంచే ప్రారంభం కావాలి.
Advertisement
Advertisement