రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తాం
రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తాం
Published Sun, Feb 19 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం
రాధేయపాలెంలో రంగా విగ్రహావిష్కరణ
రాజానగరం : కాపులకు బీసీ రిజర్వేషన్ సదుపాయం కల్పించే వరకు తాము చేపట్టిన ఉద్యమం ఆగదని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రాణం ఉన్నంతవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపులంతా సమైక్యతతో ముందుకు వచ్చి ఉద్యమంలో పాలుపంచుకుంటేనే భావితరాల భవిషత్తు బాగుంటుందన్నారు. రాజానగరం మండలం రాధేయపాలెంలో రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్మించిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ముద్రగడ ఆదివారం విష్కరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలకుల దగాకు గురై నిద్రపోతున్న కాపుజాతిని తాను అధికారంలోకి వస్తే బీసీల్లో చేరుస్తానంటూ మేలుకొలిపిన చంద్రబాబును తాను ఇచ్చిన మాటను నెరవేర్చమని కోరుతున్నామన్నారు. అంతేగానీ తాము నేరాలు, ఘోరాలు చేయడం లేదన్నారు. రిజర్వేషన్ల సాధనకు వెనుకడుగు వేసేది లేదని, మున్ముందు రోజుల్లో కూడా ఈ పోరాట పటిమను ఇలాగే కొనసాగిస్తూ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో మీకు నిరంతరం అండగా నిలుస్తున్న జక్కంపూడి కుటుంబానికి కూడా మీరెప్పుడూ అండగా ఉండాలని కోరుతున్నానన్నారు. కులమతాలకు అతీతంగా పేదలందరికీ అండగా నిలిచి వారి పాలిట పెన్నిధిగా నిలిచిన వంగవీటి మోహనరంగా అని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు కాపు ఉద్యమం ఆగదని కాపు ఉద్యమ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. ఇక్కడ జరుగుతున్న కాపు ఉద్యమ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుందన్నారు. కాపుల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచిన రంగా విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రంగా, జక్కంపూడి రామ్మోహనరావు వంటి వారు జనంలో ఏనాడూ చిరంజీవులుగానే ఉంటారన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కాపు ఉద్యమ నాయకులు ఏసుదాసు, కలవకొలను తాతాజీ, జక్కంపూడి గణేష్, అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, ద్వారంపూడి నాగమునేశ్వర్రావు, గండి నానిబాబు, ఉండమట్ల రాజబాబు, దేశాల శ్రీను, జక్కంపూడి జగపతిరావు, ప్రగడ చక్రి, అబ్బిరెడ్డి వెంకటేశ్వర్రావు, బీసీ సంఘాల నాయకులు వాసంశెట్టి పెద్దవెంకన్న, గోసాల చిన్న, రంగమిత్ర మండలి అధ్యక్షుడు సాపిరెడ్డి దుర్గారావు, సభ్యులు పాల్గొన్నారు.
నేతల విగ్రహాల సంరక్షణ కూడా చూడాలి
విగ్రహాలను ఏర్పాటుచేయడంతోనే పని అయిపోయిందనుకోవద్దని, వాటిని దుమ్ముధూళి, మలినాల నుంచి కాపాడుతుండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇందుకు తాము బాధ్యత తీసుకుంటామని కాపు నాయకులు ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్ మాట ఇచ్చిన తరువాతనే తాను ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు.
Advertisement
Advertisement