రంగురాళ్ల కోసం కొండపై బ్లాస్టింగ్
-
మైదాన ప్రాంత వాసుల తవ్వకాలు
-
భగ్నం చేసిన పోలీసు, అటవీశాఖల అధికారులు
-
గుప్త నిధుల కోసమే అంటున్న స్థానికులు
వై.రామవరం :
రంగురాళ్ల కోసం మైదాన ప్రాంతానికి చెందిన ఓ ముఠా మండలంలోని అటవీ ప్రాంంతంలో అన్వేషణ చేపట్టగా, విషయం తెలుసుకున్న అటవీ, పోలీసు శాఖల అధికారులు ఆ ప్రయత్నాలను భగ్నం చేశారు. మండలంలోని యార్లగడ్డ పంచాయతీ, గురమంద విశ్వనాథుని ఆలయం ఎదురుగా ఉన్న కొండమీది సొరంగంపై ఉన్న రాళ్లను కొందరు వ్యక్తులు బుధవారం సాయంత్రం బ్లాస్టింగ్ చేసి పగలగొట్టారు. వారక్కడ క్షుద్ర పూజలు నిర్వహించి, గొయ్యి తవ్వకం పనులు ప్రారంభించారు. నరబలి వేశారనే వదంతులు కూడా వ్యాపించాయి.ఈ ప్రాంతం వై.రామవరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఎ న్.సతీష్‌బాబు, అటవీశాఖ డిప్యూటీ రేంజి అధికారి పద్మావతి తమ తమ సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. వారి రాకను ముందుగానే పసిగట్టిన ఆ ముఠా సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో లభ్యమైన గోతులు తవ్వే పనిముట్లను, కొండకింద లభ్యమైన మూడు బైక్‌లను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. విజయవాడ, నర్సాపురం, కాకినాడ, ఏలేశ్వరాలకు చెందిన వ్యక్తులు అక్కడకు సమీపంలోని చీడిపాకలు గ్రామంలోని ఒక ఇంటి వద్ద బస ఏర్పాటు చేసుకుని తవ్వకాలు సాగించినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.
ఇద్దరిపై కేసు నమోదు :
ఈ తవ్వకాలు, బ్లాస్టింగ్‌పై ఆప్రాంత వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడకు చెందిన భద్రరావు , నర్సాపురానికి చెందిన రాజు అనే వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌సై సతీష్‌బాబు తెలిపారు. వారికి సహాయం చేసిన మరి కొంతమంది కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు తెలిపారు. రంగురాళ్ల తవ్వకం కోసమే వారు బ్లాస్టింగ్ చేశారని, నిందితులు క్షుద్రపూజలు కూడా నిర్వహించారని తెలిపారు. కాగా మైదాన ప్రాంత వాసులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు.