మరుగుదొడ్ల లక్ష్యం చేరాలి
Published Fri, Sep 16 2016 12:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెలాఖరులోగా వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) ప్రాంతంగా ప్రకటించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 24,193 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకాగా.. ఇప్పటివరకు 20 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని ఈ నెలలోపు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు తమ ఆధీనంలోని సిబ్బందిని ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. మేస్త్రీల కొరత ఉంటే ఇతర మండలాల నుంచి రప్పించాలని, నిర్మాణాలు పూర్తయిన వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. మండల, గ్రామస్థాయి అధికారులు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి పనులు పర్యవేక్షించాలని సూచించారు. 15 రోజులు కష్టపడితే వందశాతం చేరుకోవచ్చన్నారు. గ్రామ, మండల అధికారులు స్వచ్ఛ్ హుజూరాబాద్ గ్రూప్ పేరిట వాట్సప్ ప్రారంభించాలని సూచించారు. ఐఎస్‌ఎల్ నిర్మాణాల ప్రగతిని అందులో ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తుండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, డిఆర్‌డిఎ పీడి అరుణశ్రీ, డ్వామా పీడి వెంకటేశ్వర్లు, జిల్లా విధ్యాధికారి శ్రీనివాసాచారి, వయోజన విద్యాశాఖ డీడీ జైశంకర్, ప్రత్యేకాధికారి కిషన్‌స్వామి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement