పేట్రేగుతున్న ఇసుక దందా
Published Fri, May 5 2017 2:29 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
ఆచంట : గోదావరి తీరంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుతూ కోట్లాది రూపాయల్ని లూటీ చేస్తోంది. ప్రైవేటు సైన్యాన్ని నడుపుతూ అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతోంది. అధికారులు, ఫిర్యాదుదారులతోపాటు విలేకరులపైనా దాడులు చేయిస్తోంది. ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో సాగుతున్న అక్రమాలపై అధికారులకు తరచూ ఫిర్యాదు చేస్తున్నాడనే కారణంగా అదే గ్రామానికి చెందిన నాగమునేంద్రరావుపై 2014 మార్చిలో ఇసుక మాఫియాకు చెందిన ప్రైవేటు సైన్యం దాడి చేసింది. మునేంద్రరావు ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించడంతోపాటు అతనిని తీవ్రంగా గాయపర్చింది. తాజాగా.. ఇసుక మాఫియా ఆగడాలపై న్యూస్ చానల్‌లో కథనం ప్రసారం కావడంతో ఆ చానల్ ఆచంట విలేకరి నల్లమిల్లి రామారెడ్డి ఇంటికి వెళ్లిన దుండగులు బుధవారం
అర్ధరాత్రి అతడిపై హత్యాయత్నం చేశారు.
మాఫియాకు అడ్డాగా సిద్ధాంతం ర్యాంపు
జిల్లాలోని అతి పెద్ద ర్యాంపుల్లో సిద్ధాతం ర్యాంపు ఒకటి. ఇది కొంతకాలంగా అక్రమార్కులకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఈ ర్యాంపు నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించినప్పుడు మాఫియాకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున అక్రమంగా ఇసుక తరలించి జేబులు నింపుకున్న విషయం విదితమే. అప్పట్లో దీనికి కూతవేటు దూరంలోనే అనధికార ర్యాంపు ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు. తర్వాత ఆ ర్యాంపును కూడా ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు అదే ర్యాంపు నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా పెద్దఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అనుతించిన ర్యాంపుల్లోనూ అక్రమ తవ్వకాలు
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ర్యాంపుల్లోనూ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకార.. ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. ఇసుకను యంత్రాల ద్వారా తవ్వి వాహనంలో లోడింగ్ చేసినందుకు యూనిట్‌కు రూ.175కు మించి వసూలు చేయకూడదు. అయితే ర్యాంపు నిర్వహణ, దారి ఏర్పాటు పేరుతో యూనిట్‌కు రూ.800 వరకూ వసూలు చేస్తున్నారు. ర్యాంపు నుంచి ఇప్పటివరకూ దాదాపు 60 వేల యూనిట్లకు పైగా ఇసుకను ఇలా అమ్మకాలు జరిపినట్టు సమాచారం. అధిక వసూళ్లు, అడ్డగోలు తవ్వకాలు సాగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది.
మట్టి పేరుతో తరలించుకుపోతున్నారు
అక్రమ వ్యాపారులు పథకం ప్రకారం ఇసుకను కొల్లగొడుతున్నారు. నదీగర్భంలో నిర్మించే గ్రోయిన్లు, రివిట్‌మెంట్, రేవుల నిర్మాణం, మేటల తొలగింపు తదితర పనులను అక్రమార్కులు తమ దందాకు ఎంచుకుంటున్నారు. ఆ పనుల ముసుగులో ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలెంలో ఏటిగట్టు రివిట్‌మెంట్ నిర్మాణం ముసుగులో పెద్దఎత్తున ఇసుక తరలిపోగా అక్రమార్కుల్ని గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించారు. అయితే, అధికారులు స్వల్ప మొత్తంలో జరిమానా విధించి వదిలిపెట్టారు. తాజాగా పెనుగొండలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాల పూడిక పనులు చేపట్టారు. ఈ ముసుగులో ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. ఇందుకు సిద్ధాంతం సమీపంలోని ర్యాంపును ఎంచుకున్నారు. స్థలాల పూడికకు మట్టి అందుబాటులో లేదనే సాకుతో గోదావరి తీరంలోని మట్టి (బొండు ఇసుక) తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతులు పొందారు. అయితే మట్టిపేరుతో పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇందుకు గాను అధికార పార్టీ నేతల నుంచి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పెద్దఎత్తున నజరానాలు అందుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
కాలువ గట్లనూ వదలడం లేదు
పెరవలి : ఇసుకతోపాటు మట్టిని సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం లేదు. ప్రజాప్రతినిధుల అండదండలతో కాలువ గట్లను సైతం తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెరవలి మండలంలోని బ్యాంక్ కెనాల్ గట్టును యథేచ్ఛగా తవ్వి మట్టి అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో ఈ దందా సాగుతోందనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదేమని ఎవరైనా అడిగితే దాడులు చేయటం, రాజకీయంగా ఇబ్బందులు సృష్టించటం, కేసులు పెట్టించటం వంటి పనులు చేస్తున్నారు. ఎక్కడ మట్టి తవ్వాలన్నా.. మెరక చేయాలన్నా మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. ఖండవల్లి నుంచి కాకరపర్రు వరకు కాలువ కుడి గట్టును ఎక్కడికక్కడ పొక్లెయిన్ల సాయంతో 3 నుంచి 5 అడుగుల మేర తవ్వుతూ మట్టిని తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.600 నుంచి రూ.800కు విక్రయిస్తున్నారు. పెరవలి మండలంలోని కాకరపర్రు, ముక్కామల, ఉమ్మిడివారి పాలెం, ముత్యాలవారి పాలెం, ఖండవల్లి గ్రామాల వద్ద తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కాలువ గట్టు నుంచి నిత్యం సుమారు వెయ్యి ట్రాక్టర్లకు పైగా మట్టి తరలిపోతోంది.
Advertisement
Advertisement