సిరుల కల్ప‘తరువు’
సిరుల కల్ప‘తరువు’
Published Thu, Oct 13 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
సిరిమాను తయారీలో వడ్రంగుల స్వచ్ఛంద సేవ
ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ
విజయనగరం టౌన్ : పైడితల్లి అమ్మవారి దర్శనం అదష్టం. సిరిమానోత్సవం అద్భుతం. ఏళ్ల తరబడి నిర్విఘ్నంగా సాగుతున్న సిరిమానోత్సవంలో సిరిమానుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సిరిమాను గుర్తించడం, తయారీలో ఎందరో వడ్రంగుల భాగస్వామ్యం ఉంటుంది. ఏ పనులున్నా.. ఎక్కడున్నా ఏటా సిరిమానోత్సవానికల్లా వారంతా పట్టణానికి చేరుకుంటారు. భక్తిశ్రద్ధలతో సిరిమానును తయారు చేస్తారు. ఈ ఏడాది కూడా వీరి చేతుల్లో ఊపిరి పోసుకుంటున్న సిరిమాను, గిలక, పీటల తయారీ పూర్తి కావొచ్చింది.
అమ్మవారి చూపిన బాటలో..
సిరిమాను తయారీకి చింతమానునే ప్రధానంగా పైడితల్లి కోరుకుంటుంది. ఏటా అమ్మవారు పూజారి కలలో కనిపించి సిరిమానుకు దారి చూపించడం ఆనవాయితీ. ఆ దిశలో పూజారి, ఆలయ సిబ్బంది వెళ్లి అన్వేషిస్తారు. అమ్మవారి సిరిమానుగా సాక్షాత్కరించిన చింతమాను సిరిమానుగా నిర్ణయించి అమ్మవారికి పూజాదికాలను నిర్వహిస్తారు. సిరిమాను సాక్షాత్కరించిన గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది. పైడితల్లి తమ గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు ఉప్పొంగిపోతారు. భాజా భజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. పదివేలమందికి పైగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది ధర్మపురి ప్రాంతంలో అమ్మవారు సాక్షాత్కారించిన చింతచెట్టుకు పూజలు నిర్వహించి హుకుంపేటలోని పూజారి ఇంటì వద్దకు తరలించారు. సిరిమాను తయారీలో కొన్ని కుటుంబాల వడ్రంగులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సిరిమాను బాధ్యతలను తలా పంచుకుంటారు. సిరిమాను, గిలకలు, పూజారి పీట, ఇరుసుమాను, రథాలను తయారు చేసి వాటికి రంగులు అద్దడంలో తలమునకలయ్యారు.
తాత, తండ్రుల నుంచి భాగస్వామ్యం–కనిమెళ్ల సత్యం
చిన్నప్పటి నుంచి మా నాన్నతో కలిసి సిరిమాను చెక్కడానికి వచ్చేవాడిని. ఎంతో పవిత్రమైన చింతమానును చెక్కుతుంటే చెప్పలేనంత ఆనందం కలిగేది. మా తాత తర్వాత నాన్న.. ఇప్పుడు నేను సిరిమాను చెక్కుతున్నా. ఆ తల్లి దయతో నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది.
రెండ్రోజుల్లో పనులు పూర్తి––తాళ్లపూడి సోమునాయుడు
ఎంతో కష్టపడి తల్లికోసం చెక్కే సిరిమానుపై అమ్మవారు ఆకాశవీధుల్లో విహరిస్తూ దీవెనలందించడం మాకెంతో ఆనందకరం. ఒక్కొక్క రథం వెళ్తుంటే అప్పటి వరకు పడినన కష్టం మరిచిపోతాం. కష్టం మరిచి, ఎంతో ఉత్సాహంగా పండగ చేసుకుంటాం. రెండ్రోజుల్లో పనులు పూర్తవుతాయి.
నా అదష్టం–కనిమెళ్ల రమణ
పైడితల్లి జాతర నిర్వహణకు ఎంతో కష్టపడతాం. రాత్రనక, పగలనక పనుల్లో నిమగ్నమవుతాం. వడ్రంగుల సమష్టి కషితోనే ఇది విజయవంతమవుతుంది. హుకుంపేటలో నెలరోజులూ పండగ వాతావరణం ఉంటుంది. సిరిమాను తయారీలో భాగస్వామిని కావడం నా అదష్టం
భక్తిప్రపత్తులతో తయారీ–పైడిరాజు
సిరిమాను సహా గిలకలు, పూజారి కూర్చొనే పీటను తయారు చేస్తాం. పెద్ద పెద్ద తాళ్లతో కట్లు కడతాం. రోజూ స్నానపానాదులు పూర్తిచేసుకుని భక్తితో సిరిమానుకు మొక్కి బొట్టు పెట్టాకే పనులు ప్రారంభిస్తాం. సిరిమాను సిద్ధమైంది. ఇరుసుమాను పనులు జరుగుతున్నాయి.
ఎన్ని పనులున్నా వస్తా–కొండబాబు
ఇరవయ్యేళ్లుగా అమ్మ సేవలోనే ఉన్నాను. ఆ తల్లి కరుణా కటాక్షాలు మాపై ఉంటాయి. అందుకే ఏ ఊర్లో పనులకు వెళ్లినా పండగ సమయానికి ఊరొచ్చి వారం రోజులపాటు సిరిమాను తయారీలో పాల్గొంటాను. భోజన, వసతి సదుపాయాలు నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు.
ఇది నా భాగ్యం–వసంత సూరి
తల్లిసేవలో 30 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ఏడాది త్వరితగతిన పనులు పూర్తయ్యాయి. స్వచ్ఛందంగానే మేమంతా కలసి పని చేస్తాం. తరతరాల నుంచి వస్తున్న ఆచారం.
12విజెడ్‌జి 171 : సిరిమానును చెక్కుతున్న వడ్రంగులు
\
Advertisement