శిథిలావస్థలో రుమలయ్యస్వామి ఆలయం
- ‘అద్భుత కాన్వాస్’పై చర్చ
- సాక్షి కథనాన్ని ఆసక్తిగా చదివిన ప్రజలు
శివ్వంపేట: రత్నాపూర్ పంచాయతీ పరిధిలో వేల సంవత్సరాలుగా తిరుమలయ్య బండ ఆనవాళ్ళు ఉన్నాయి. పురాతన వర్ణ చిత్రాల గురించి ఆదివారం సాక్షి ప్రధాన సంచికలో ‘ఇదో అద్భుత కాన్వాస్’ కథనం ప్రచురితమైంది. తిరుమలయ్య బండ విశేషాలు, ఆదిమానవుల జీవితచరిత్ర తదితర ఆనవాళ్ళ గురించి కథనం ప్రచురితం కావడంతో రత్నాపూర్ గ్రామంతో పాటు మండల ప్రజలు సాక్షి కథనాన్ని ఆసక్తిగా చదివారు.
ఘనమైన చరిత్ర
తిరుమలయ్యబండకు ఘనమైన చరిత్ర ఉంది. 24 ఎకరాల విస్తీర్ణంతో తిరుమలయ్యబండ ఉంది. పక్కనే మరో 24 ఎకరాల్లో పాండురాజులబండ కూడా ఉంది. బండపై తిరుమలయ్యస్వామి ఆలయంతోపాటు మూడుదిక్కుల ఆంజనేయస్వామి విగ్రహాలు కొలువై ఉన్నాయి. తిరుమలయ్య ఆలయ గుడిపై ఔషధ గుణాలు కలిగిన పుటికజమ్మడి చెట్టు ఉంది.
చెట్టు ద్వారా వచ్చే పాలను గజ్జి, తామర, తదితర వ్యాధులకు మంచి ఔషధమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. తిరుమలయ్యబండకు సంబంధించి గ్రామపరిధిలో ఇనాంభూమి సైతం ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బండను ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి పరచాలని స్థానికులు కోరుతున్నారు.