సౌభాగ్య ప్రదం..వరలక్ష్మీ వ్రతం
సౌభాగ్య ప్రదం..వరలక్ష్మీ వ్రతం
Published Thu, Aug 11 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
సర్వశుభాలను,సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో ముత్తయిదువులంతా భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ. ఈ సందర్భంగా నోము నోచేందుకు మహిళలంతా సిద్ధమయ్యారు. మార్కెట్లన్నీ శ్రావణ కళతో సందడిగా మారాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పూజా సామగ్రీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏడాదికి ఒకసారి వరాలిచ్చే శ్రావణ లక్ష్మి కోసం ధర ఎక్కువైనా పూజలాచరించడం ఆనవాయితీగానే మారింది.
డాబాగార్డెన్స్/ఎంవీపీకాలనీ/సీతంపేట :
హైందవ సంప్రదాయంలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్న పుణ్య దినాల్లో వరలక్ష్మీవ్రతం ఒకటి. తమ కుటుంబం ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం ఏ లోటూ లేకుండా ఆధ్యంతం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శ్రావణ శోభతో పూర్ణామార్కెట్ కిటకిటలాడింది. ఆషాఢ మాసంలో బోసిపోయిన వ్యాపారాలు శ్రావణ మాసంతో ఊపందుకున్న నేపథ్యంలో గురువారం పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజ్ డౌన్‌రోడ్డు, కురుపాం మార్కెట్ ప్రాంతాలు జనంతో కిక్కిరిశాయి. వరలక్ష్మి వ్రతం పూజకు అవసరమైన సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి. వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించే ఇతర సామగ్రి ధరల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మకాలు జోరుగా సాగాయి.
పూర్ణామార్కెట్ రోడ్డు క్లోజ్..
కొనుగోలు దారులు పెద్ద ఎత్తున రావడంతో పూర్ణామార్కెట్ నుంచి దుర్గాలమ్మ గుడికి వెళ్లే రోడ్డును మూసివేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా పోలీసులు స్టాపర్లు ఏర్పాటు చేశారు. టర్నర్ చౌల్ట్రీ నుంచి టౌన్‌కొత్తరోడ్డు, కురుపాం మార్కెట్ వరకు రోడ్డు కిరువైపులా తోపుడు బండ్ల వర్తకుల వ్యాపారాలు బాగా సాగాయి.
పోటెత్తిన పందుంపుల్లల సందు..
వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూర్ణామార్కెట్ పందుంపుల్లల సందు కొనుగోలుదార్లతో పోటెత్తింది. వరలక్ష్మి అమ్మవారికి కొత్త చీర, జాకెట్టు కొనుగోలు చేసేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ మహిళలతో కిటకిటలాడాయి.
మార్కెట్లు కిటకిట..
శ్రావణమాసం రెండో శుక్రవారం (వరలక్ష్మీవ్రతం) కావడంతో బట్టల దుకాణాలు కిక్కిరిశాయి. వస్త్ర వ్యాపారులు దేశంలోని పలు నగరాలు, పట్టణాల నుంచి లేటెస్ట్ వెరైటీలు అందుబాటులో ఉంచడంతో పండగ సదర్భంగా ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతో షారూమ్‌లు కళకళలాడాయి. జగదాంబ జంక్షన్, కురుపాం మార్కెట్‌లోని బంగారం దుకాణాలు కళకళలాడాయి. వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమని మహిళలు భావించే లక్ష్మీకాసులు, జాతిరాళ్ల ఆభరణాలు, పచ్చలు, కెంపులు అతివలను ఆకట్టుకునే రీతిలో అందుబాటులోకి తేవడంతో ఆయా దుకాణాల్లో సందడి నెలకొంది. వరలక్ష్మి వ్రతం రోజు కొంత బంగారమైనా ధరించాలన్న నమ్మకంతో యువతులు, మహిళలు బంగారం దుకాణాలకు క్యూ కట్టారు. ఇవేకాక ఫుట్‌వేర్, ఫర్నిచర్ దుకాణాలు పండగ సందడితో నిండుగా కనిపించాయి.
శ్రావణ సందడితో ఎంవీపీ రైతుబజార్ కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళల తాకిడి ఎక్కువగా కనిపించింది. పువ్వుల దుకాణాల వద్ద మహిళలు బారులు తీరారు. నరసింహనగర్ రైతుబజారు, రామటాకీస్, సీతంపేట, అక్కయ్యపాలెం బజార్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి.
ధరలు పెరిగిపోతున్నాయి
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఒకవైపు పండుగలు, మరొక వైపు పెళ్లిళ్లు. దీంతో పువ్వులు, పండ్లు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రెండో శుక్రవారం మరీ ఎక్కువగా ఉంటున్నాయి. 5 రకాలపండ్లు, 5రకాల పువ్వులు, 5రకాల పిండివంటలు, చీర , జాకెట్టు, లక్ష్మీరూపుతో పూజ చేస్తే సుమారు ఏడెనిమిది వేలు ఖర్చు అవుతోంది. ఇలా ధరలు పెరుగుతూపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి.
– బి. శ్రీఅనిత, అక్కయ్యపాలెం
Advertisement
Advertisement