ఇద్దరు బాలనేరస్తులు అరెస్ట్
-
రూ.1.10 లక్షల సొత్తు స్వాధీనం
-
నగర డీఎస్పీ జి. వెంకటరాముడు
నెల్లూరు (క్రైమ్) : ఇంటి దొంగతనం కేసులో ఇద్దరు బాల నేరస్తులను పోలీసులు శుక్రవారం పెన్నానది సమీపంలోని తిక్కన పార్కు వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.10 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మూడో నగర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జి. వెంకటరాముడు నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరంలోని మన్సూర్‌నగర్, జెండావీధి, చిత్తూరు, రాజమండ్రికి చెందిన నలుగురు బాలలు దొంగతనం కేసులో తిరుపతిలోని బాలనేరస్తుల సంరక్షణ గృహంలో ఉన్నారు. వారు ఈ నెల 8వ తేదీన అక్కడ నుంచి తప్పించుకుని నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు నగరంలో తిరుగుతూ ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి సంతపేట బీఈడీ కళాశాల సమీపంలో నివాసముంటున్న విశ్రాంత ఉద్యోగి నావూరి ఈశ్వరయ్య ఇంట్లో దొంగతనం చేశారు. బీరువాలో ఉన్న 66 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌లను అపహరించుకుని వెళ్లారు. వారు కదలికలపై మూడో నగర ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అబ్దుల్‌కరీం తమ సిబ్బందితో కలిసి నిందితుల్లో ఇద్దరు బాలనేరస్తులను శుక్రవారం అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తోన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు గతంలో నెల్లూరు నగరంలో ఒకటో నగరం, మూడో నగర పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషి చేసిన మూడో నగర ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అబ్దుల్‌కరీం, ఒకటి, మూడో నగర ఎస్‌ఐలు గిరిబాబు, పి. రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్స్ ఎస్‌కే షమీర్, రఫి, కానిస్టేబుల్స్ కె. శివప్రసాద్, ఏడుకొండలు, ఎస్‌కే అల్లాభక్షు, టి. వేణు, పి. శ్రీనివాసులు, సుధాకర్‌సింగ్‌ను డీఎస్పీ అభినందించారు. ఎస్పీ విశాల్‌గున్నీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అబ్దుల్‌కరీం, ఎస్‌ఐ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.