నిద్రిస్తుండగా వచ్చి.. గొంతు కోసి..
నిద్రిస్తుండగా వచ్చి.. గొంతు కోసి..
Published Fri, Sep 2 2016 8:44 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM
* నిందితుల పరార్
* ఎవరు, ఎందుకు చేశారో అంతుబట్టని వైనం
రుద్రవరం (అచ్చంపేట): ఇంటిముందు మంచంపై నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి దాడిచేసి కత్తితో గొంతు కోసి పరారైన సంఘటన మండలంలోని రుద్రవరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 75 సంవత్సరాల గడ్డం రామకోటయ్య తన ఇంటి ముందు మంచం వేసుకుని నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి దోమతెరను పైకి లేపి కత్తి చూపించాడని, లేవబోయే సమయంలో గొంతు కోసి పరారయ్యాడని చెప్పారు. తనకు శతృవులు ఎవరూ లేరని, గ్రామంలో అందరూ తనతో బాగానే ఉంటారని, ఆస్తి తగాదాలు ఏమీ లేవని చెప్పాడు. వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశాడనేది తెలియవలసి ఉంది. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్‌ఐ గుడి రాజేశ్వరరావు సందర్శించి కేసు నమోదు చేసి చుట్టు ప్రక్కల వారిని విచారించారు. బాధితుడిని గుంటూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కాగా, గతంలో క్రోసూరు మండలం గుడిపాడులో కూడా ఇదే విధంగా కొందరు వ్యక్తులు వృద్ధ దంపతులపై దాడి చేసి హతమార్చారు. అప్పట్లో సైకో ఈ పని చేశాడని అందరూ చెప్పుకున్నారు. ఇంతవరకు హంతకులు ఎవరన్నది పోలీసులకు కూడా అంతు బట్టలేదు. అదే తరహాలోనే రామకోటయ్యపై కూడా దాడి జరిగింది. బాధితునికి నలుగురు సంతానం, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. మగపిల్లలలో పెద్దబ్బాయి వేల్పూరులో మీసేవా కేంద్రాన్ని నడుపుతున్నాడు. భార్యలేదు.
Advertisement
Advertisement