భర్త ఇంటి ముందు పోరాటం
గుంటూరు(పిడుగురాళ్ల టౌన్):
తనను వదిలేస్తే వదిలేశాడు.. కనీసం కట్నం సొమ్ము, తామిచ్చిన సామాన్లు అయినా ఇవ్వాలి.. అని ఓ భార్య తన కుటుంబసభ్యులతో భర్త ఇంటిముందు పడిగాపులు కాస్తున్న ఘటన పట్టణంలోని పిల్లలగడ్డ మదర్సా సమీపంలో వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడెంకు చెందిన షేక్ జానీబేగంకు పిడుగురాళ్లకు చెందిన మస్తాన్ షరీఫ్‌తో 2010లో వివాహం జరిగింది. ఆ సందర్భంగా మస్తాన్‌షరీఫ్‌కు రూ.3 లక్షల కట్నంతోపాటు, సామాన్లు, ఎనిమిదిన్నర సవర్ల బంగారం ఇచ్చారు.
రెండేళ్ల తర్వాత వీరి మధ్య సఖ్యత లేకపోవటంతో ఇద్దరూ దూరమయ్యారు. అయితే కొన్నేళ్లకు షరీఫ్ మరో వివాహం చేసుకున్నాడు. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని జానీబేగం తెలిపింది. అంతేకాక కొద్దిరోజులకు పిడుగురాళ్ల ప్రభుత్వ ఖాజీ ద్వారా విడాకుల పత్రం పంపించాడని ఆమె తెలిపింది. తాను విడాకులు ఇవ్వకుండానే విడాకుల పత్రం ఎలా పంపిస్తారని, దీనికి ప్రభుత్వ ఖాజీ సమాధానం ఇవ్వాలని మండిపడింది. మరో అమ్మాయికి అన్యాయం జరగకూడదని భావించి మేమిచ్చిన కట్నం, సామాన్లు, బంగారం ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోవట్లేదని చెప్పింది.
ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తమ కుటుంబసభ్యులతో సోమవారం నుంచి భర్త ఇంటిముందు బైటాయించినా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోయింది. సమస్యను స్థానిక వార్డు సభ్యుడు షేక్ ఫరీద్‌మేస్త్రి దృష్టికి తీసుకెళ్లటంతో రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరడంతో తిరుగుముఖం పట్టారు. ఈ విషయమై భర్త మస్తాన్ షరీఫ్‌ను ప్రశ్నించగా ఆ అమ్మాయికి ఎప్పుడో విడాకులిచ్చాను తనకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.