నవ నాగరికంగా మెరిసిపోయే నగరాల్లో ఎంత అమానుషం దాగున్నదో మరో సారి వెల్లడైంది. బెంగళూరులో ఆదివారం నల్ల జాతీయులపై గుంపు దాడి చేయ డంతోపాటు వారిలోని ఒక యువతిని వివస్త్రను చేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని తగులబెట్టారు. నడిరోడ్డుపై ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ వారించడానికి ప్రయత్నించలేదు. అక్కడికి సమీపంలో ఉన్న పోలీసులు సైతం మౌనసాక్షుల్లా ఉండిపోయారు. అంతకన్నా ఘోరమేమంటే...కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర దీన్ని ఏదో సాధారణ ఉదంతంలా భావించి మాట్లాడటం.
నిజానికి ఇందులో జాత్యహంకార ముద్ర, ఆడవాళ్లంటే చులకనభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐటీలో ముందంజలో ఉన్న బెంగళూరు నగరానికి సిలికాన్ వ్యాలీ అన్న పేరుంది. ఎంతో ప్రశాంతమైన నగరమన్న ముద్ర ఉంది. కానీ ‘భిన్నంగా’ కనబడేవాళ్లకు మాత్రం అది నరకమని అనేక ఉదంతాలు రుజువుచేశాయి. ఈశాన్య ప్రాంతంనుంచి చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వచ్చినవారిపై గతంలో దాడులు జరిగాయి.
నల్లజాతీయులపై కూడా అడపా దడపా అలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇదే నగరంలో తొమ్మిది నెలలక్రితం నలుగురు ఆఫ్రికన్లను దారుణంగా కొట్టారు. నిరుడు అక్టోబర్‌లో కన్నడ భాష మాట్లాడలేదని ఈశాన్యప్రాంతంనుంచి వచ్చిన ఒక యువకుణ్ణి చావబాదారు.
అదే ప్రాంతానికి చెందిన నగర మాజీ పోలీస్ కమిషనర్ సాంగ్లియానా కుమార్తెను ‘చైనాకు వెళ్లిపో’ అంటూ ఒక సూపర్ మార్కెట్‌లో గేలిచేశారు. ఇద్దరు మణిపూర్ యువతులకు సైతం ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి. నాలుగేళ్లక్రితం ఈశాన్యప్రాంతం వారిని దూషిస్తూ ప్రచారంలోకొచ్చిన ఎస్సెమ్మెస్‌లకు జడిసి వేలాదిమంది స్వస్థలాలకు ఆదరాబాదరాగా వెళ్లిపోవడం ఎవరూ మర్చిపోలేదు.
విచక్షణాజ్ఞానం లోపించినప్పుడు ఉన్మాదం రాజ్యమేలుతుంది. అలాంటి సమ యాల్లో ఎవరో ఒకరైనా దృఢంగా వ్యవహరించగలిగితే, చొరవ ప్రదర్శించి అదుపు చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితి కాస్తయినా సర్దుకుంటుంది. కానీ మన నగరాల్లో రాను రాను అలాంటి ధోరణి కరువవుతోంది. ఆ విషయంలో పల్లెటూళ్లే కాస్త నయం. బెంగళూరులాంటి నగరంలో పౌరుల మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంద నుకుంటాం. అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చింది గనుక పోలీసులకు వెనువెంటనే విషయం తెలియడం పెద్ద కష్టం కాదనుకుంటాం.
సకాలంలో వారు వచ్చి పరిస్థితిని అదుపులోనికి తెస్తారనుకుంటాం. కానీ జరిగిందంతా అందుకు భిన్నం. ఒక ఆఫ్రికన్ జాతీయుడు వాహనం నడుపుతూ ఒకరి మరణానికి కారకుడయ్యాడు. కాసేపటికి అదే దారిలో వేరొక వాహనంలో వచ్చిన నలుగురు యువకులనూ, యువతినీ ఆపి అక్కడ గుమిగూడిన జనం దాడి చేశారు. తన దుస్తుల్ని సైతం లాగేస్తున్న జనం నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఆగి ఉన్న సిటీ బస్‌ను ఎక్కడానికి యువతి ప్రయత్నిస్తే అందులోకి సైతం జొరబడి గుంపు దాడి చేసింది.
ఆమెను, ఆమెతోపాటు ఆ బస్సు ఎక్కిన యువకుణ్ణి బయటకీడ్చి ఆమెను వివస్త్రను చేశారు. దేశం కాని దేశంలో వారిని రక్షించగలిగిందెవరు? విజ్ఞత కలిగిన పౌరులు, కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావలసిన పోలీసులు. కానీ అందరికందరూ చేష్టలుడిగి ఉండిపోయారు. ఈ ఉదంతం తర్వాత పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు ఇవ్వడానికి ఆ యువతి ప్రయత్నిస్తే... ప్రమాదానికి కారణమై పరారీలో ఉన్న యువకుణ్ణి తీసుకొచ్చి అప్పగించమని అక్కడి అధికారి సలహా ఇచ్చాడు. అంతవరకూ కేసు నమోదు చేయడం కుదరదని చెప్పాడు.
వీరందరిదీ ఆఫ్రికా ఖండం కావడం మినహా ప్రమాదానికి కారణమైన యువకుడికీ, ఈ నలుగురుకీ నిజానికి సంబంధం లేదు. వీరందరిదీ టాంజానియా కాగా, ఆ యువకుడు సూడాన్ జాతీయుడు. ఈ సంగతి సాధారణ పౌరులకు అవగాహన కాలేదంటే అర్ధం చేసుకోవచ్చు. పోలీసులు సైతం మూర్ఖంగా ప్రవర్తించడం, అతన్ని తీసుకొచ్చి అప్పగించాలనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన శాఖ ఇంత అధ్వాన్నంగా పనిచేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన హోంమంత్రి పరమేశ్వర ఈ దాడిలో జాత్యహంకార జాడలేదని తర్కించడం మరింత వింత గొలుపుతుంది.
కేవలం కారు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంవల్ల జనం ఆగ్రహించారని ఆయన వాదిస్తున్నారు. నిజానికి ఇలాంటి ధోరణులే సమాజంలో వివక్షను మరింత పెంచుతున్నాయి. ఒక అమానుషాన్ని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం, ఫిర్యాదు చేయడానికెళ్తే వారినే దోషులుగా పరిగణించి మాట్లాడటం తప్పని ఆయనగారికి తోచలేదు. తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్ల పరువుపోయేలా ఉన్నదని భావించి కాంగ్రెస్ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవడంతో ముగ్గురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు.
బెంగళూరు నగరంలో చదువుకోవడానికి వివిధ దేశాలనుంచి విద్యార్థులు వస్తుంటారు. ప్రస్తుతం అలాంటి విద్యార్థులు 12,000మంది ఉంటారని అంచనా. అమెరికా, యూరప్‌లతో పోలిస్తే భారత్‌లో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య లభిస్తుందన్న భావన ఆఫ్రికన్ దేశాల పౌరుల్లో ఉంది. కానీ వారికి ఉండటానికి ఇళ్లు దొరకవు. అడుగడుగునా అవమానాలు, దాడులు ఎదురవుతాయి. మార్కెట్ కెళ్తే మోసాలు. ఏదైనా ఘటన జరిగినప్పుడు స్థానికులకూ, ఆఫ్రికన్లకూ మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అవగాహన కల్పించడానికి ప్రయత్ని స్తున్నారు. కానీ అదొక నిరంతర ప్రక్రియగా కొనసాగితే తప్ప పరిస్థితి చక్కబడదు. అంతకన్నా ముందు మన సమాజంలో కుల వివక్ష, లింగ వివక్ష ఉన్నట్టే జాత్య హంకార ధోరణులున్నాయని గుర్తించడం అవసరం. రోగం ఉన్నదని గుర్తిస్తేనే సరైన మందు ఇవ్వడం సాధ్యమవుతుంది.
జరుగుతున్న ఘటనలను నేరస్వభావం గల కొందరు వ్యక్తుల ఆగడాలుగా పరిగణించి, వాటిని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడటంవల్లా, ఆ పరిమితుల్లోనే ఆలోచించడంవల్లా అవి పునరావృత మవుతున్నాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు మేల్కొనాలి. కారకులపై కఠిన చర్యలుంటాయన్న సందేశం పంపడంతోపాటు, వెనువెంటనే స్పందించేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కదిద్దాలి. లేనట్టయితే ‘మేకిన్ ఇండియా’ వంటి పిలుపులు, భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ఆహ్వానాలు నగుబాటు పాలవుతాయి.