మన దేశానికి చెందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి... బాలికల చదువుకునే హక్కు కోసం పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో ఉగ్రవాదులతో పోరాడి మృత్యువు అంచులవరకూ వెళ్లొచ్చిన మలాలా యూసఫ్‌జాయ్‌లను ప్రపంచ శాంతి బహుమతికి ఎంపికచేసి ఈసారి నోబెల్ కమిటీ అందరి మన్ననలనూ పొందింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతూ ఉద్రిక్త వాతావరణం అలుముకొని ఉండగా ఈ శాంతి బహుమతిని రెండు దేశాలకూ చెందిన ఇద్దరికి ప్రకటించడం యాదృచ్ఛికమే కావొచ్చుగానీ ఆసక్తికరమైన అంశం. వీరిలో ఒకరు హిందూ, మరొకరు ముస్లిం. ఒకరు భారతీయుడు, ఇంకొకరు పాకిస్థానీ. ఒకరు అనుభవంతో తలపండిన 60 యేళ్ల వ్యక్తి. మరొకరు టీనేజ్ ఇంకా దాటని పదిహేడేళ్ల బాలిక. ఇద్దరినీ ఒకటిగా చూసే అంశాలూ ఉన్నాయి. ఇద్దరికిద్దరూ అసాధారణ వ్యక్తులు. గతంలోనే నోబెల్ శాంతి బహుమతి పరిశీలనకొచ్చినవారు.
ఇద్దరూ భారత ఉపఖండం పౌరులు. కొన్ని దశాబ్దాలక్రితం ఒకే దేశంగా మనుగడ సాగించిన గడ్డపై జన్మించినవారు. అంతేకాదు... తాము నమ్మిన సత్యం కోసం పట్టుదలతో, దృఢ చిత్తంతో పోరాడిన వారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రాణాలకే ముప్పు ముంచుకొచ్చినా వాటన్నిటినీ తృణప్రాయంగా భావించి అధిగమించినవారు. పిల్లలనూ, చదువుకోవడానికి వారికుండే హక్కునూ అణిచేస్తున్న ధోరణులపై ఇద్దరూ అలుపెరగని పోరాటం చేశారని నోబెల్ కమిటీ చెప్పిన ప్రశంసావాక్యాలు అక్షర సత్యాలు. అయితే, ఇద్దరూ తమ తమ దేశాల్లోని పాలకులనుంచి ఇంత వరకూ ఎలాంటి గుర్తింపూ పొందనివారు. సత్యార్థికి ఇంతవరకూ పద్మశ్రీ కూడా రాలేదు.
మలాలా అయితే అక్కడివారి దృష్టిలో విద్రోహి!
కైలాస్ సత్యార్థి మూడు దశాబ్దాలక్రితం బచ్‌పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) సంస్థను స్థాపించి అత్యంత అమానుషమైన, దుర్మార్గమైన పని పరిస్థితుల్లో బతుకులీడుస్తున్న వేలాది మంది బాలబాలికలను కాపాడిన అరుదైన వ్యక్తి. చదివింది ఇంజనీరింగే అయినా ప్రపంచం మొత్తంలో అంతవరకూ ఎవరికీ పట్టని బాల కార్మిక వ్యవస్థపై దృష్టిసారించాడాయన. అదే తన కార్యక్షేత్రమనుకున్నాడు. అది రణరంగమని తెలిసినా, అక్కడ తన పోరాటానికి ఆసరాగా నిలబడేవారు అరుదని అర్ధమైనా... కావాలని ఏరికోరి ఎంచుకున్నాడు. ఆరేళ్ల లేలేత ప్రాయం లోని పిల్లలతో కూడా గంటల తరబడి పనులు చేయిస్తూ వారి రెక్కల కష్టాన్ని దిగమింగి తెగబలుస్తున్న రాబందులపై శరసంధానం చేశాడు. మైకా గనుల్లో, రగ్గుల తయారీ, జరీ పరిశ్రమల్లో...ఇంకా అనేకానేక కర్మాగారాల్లో వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న వేలాదిమంది జీవితాలకు వెలుగుపంచాడు. వారితో పలకా బలపం పట్టించాడు. వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారుచేసి చూపాడు. పేదరికంవల్ల మాత్రమే పిల్లలు కార్మికులుగా మారవలసి వస్తున్నదన్న వాదనలోని డొల్లతనాన్ని ఎత్తిచూపాడు. నిజానికి బాల్యం వెట్టిచాకిరీలో మగ్గుతున్న కారణంగా మాత్రమే పేదరికం తరంనుంచి తరానికి వారసత్వంగా వస్తున్నదని, అది వారిని పీల్చిపిప్పి చేస్తున్నదని ఎలుగెత్తిచాటాడు. ప్రపంచాన 17 కోట్లమంది బాలలు వెట్టిచాకిరీలో మగ్గుతుంటే...పని చేయగలిగే సత్తా ఉన్న 20 కోట్లమంది అర్హులైన యువతీ యువకులకు ఉపాధి దొరకడంలేదని గణాంకాలతో వివరించాడు. దేశంలో 5 కోట్లమంది బాలకార్మికుల శ్రమతో ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయల నల్లధనం పోగుపడుతున్నదని హెచ్చరించాడు. బాలల శ్రమతో తయారయ్యే ఉత్పత్తులను విక్రయించబోమని, వినియోగించబోమని ప్రకటించే చైతన్యాన్ని కలిగించాడు. ఇంతవరకూ 80,000 మంది పిల్లలను వెట్టిచాకిరీనుంచి, దాంతోపాటు లైంగిక వేధింపులనుంచి కూడా రక్షించాడు. ఆ క్రమంలో బీబీఏ కార్యకర్తలిద్దరిని దుండగులు పొట్టనబెట్టుకున్నారు.
స్వాత్ లోయ అంతటా బాలికా విద్యను నిషేధించి, బడికొస్తే కాల్చేస్తామని ఉగ్రవాదులు రెచ్చిపోతున్న వేళ ‘నా చదువును చిదిమేందుకు మీరెవర’ని నిలబడిన ధీర మలాలా. చిత్రమేమంటే తనకు నోబెల్ ప్రకటించారని తెలిశాక ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన మీడియాకు కూడా తన తొలి ప్రాధాన్యం చదువేనని చాటింది. ‘స్కూల్ అయ్యాకే మీతో మాట్లాడతాన’ని కబురంపింది. తుపాకుల భాష తప్ప మరేమీ రాని క్షుద్ర మూకకు భయపడొద్దని తోటి బాలికలకు ధైర్యం నూరిపోసి, వారితోపాటు స్కూల్ బస్సులో వెళ్తుండగా మలాలా 2009లో ఉగ్రవాదుల దాడికి లోనైంది. ‘మలాలా ఎవరు?’ అన్న ప్రశ్నకు నేనేనని జవాబివ్వబోతుండగానే తుపాకి గుళ్లు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. అప్పటికామె వయసు పన్నెండేళ్లు. రోజుల తరబడి ఆస్పత్రిలో కోమాలో ఉండి కోలుకున్నా ఆమెలోని దృఢ సంకల్పం చెదిరిపోలేదు. తనను ఆరోజు మాట్లాడనివ్వని ఉగ్రవా దులకు జవాబుగా ‘అవును... నేనే మలాలా’ అంటూ గ్రంథం వెలువరించింది. వేర్వేరు రూపాల్లోనే కావొచ్చుగానీ... చదువుకునేందుకు నిత్యం ఎన్నెన్నో అవరోధా లను ఎదుర్కొంటున్న లక్షలమంది బాలికలకు ఆమె స్ఫూర్తి ప్రదాత. ఉగ్రవాదుల గురించి అంతర్జాతీయ వేదికలపై ఎంతో మాట్లాడిన మలాలా... పాక్-అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో ద్రోన్ దాడులతో మారణకాండ సాగిస్తున్న పాశ్చాత్య దేశాల ఆగడాలను ప్రశ్నించదేమని కొందరు అంటున్నారు. కానీ, ఆ వయసు బాలిక నుంచి ఇంత పెద్ద బాధ్యతను ఆశించడం కూడా సరైనది కాదు. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ద్వారా మలాలా, సత్యార్థి చేసిన పోరాటాలకూ, ఆ క్రమంలో వారు పెంపొందించిన విలువలకూ అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఇప్పటికీ అధ్వాన్నస్థితిలో మగ్గుతున్న లక్షలమంది బాలబాలికలపై అందరి దృష్టీ పడటానికి, వారిని కాపాడటానికి ఇది నిస్సందేహంగా తోడ్పడు తుంది. ఈ ప్రకటన ద్వారా నోబెల్ కమిటీ తన స్థాయిని పెంచుకుంది.
‘శాంతి’ సార్థకం!
Published Fri, Oct 10 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement