టి-20 ప్రపంచ చాంపియన్ శ్రీలంక
Published Thu, Apr 10 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
ఆకేపాటి
శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
అంతర్జాతీయం
రష్యాకు సహకారం నిలిపేసిన నాటో దేశాలు క్రిమియా సంక్షోభం నేపథ్యంలో రష్యాకు అన్ని రకాల పౌర సహకారాన్ని రద్దు చేసేందుకు నాటో విదేశాంగ మంత్రులు ఏప్రిల్ 1న నిర్ణయించారు. తాజా నిర్ణయం వల్ల రష్యాతో ఎటువంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. బ్రసేల్స్‌లో సమావేశమైన నాటో బ్లాక్‌కు చెందిన 28 సభ్యదేశాల విదేశాంగ మంత్రులు. క్రిమియాను రష్యా విలీనం చేయడం చట్ట విరుద్ధమని తీవ్రంగా తప్పుబట్టారు.
చిలీ తీరంలో భూకంపం, సునామీ
చిలీకి ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏప్రిల్1న భారీ భూకంపం, సునామీ సంభవించాయి. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. ఆరుగురు మరణించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2గా నమోదైంది. లక్షలాది మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2010లో చిలీలో భారీ భూకంపం, సునామీ సంభవించడంతో 500 మంది మరణించారు. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది.
వాతావరణ మార్పులతో ఆహారభద్రతకు ముప్పు వాతావరణ మార్పుల వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పునకు చెందిన అంతర ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) హెచ్చరించింది. మార్చి 30న విడుదల చేసిన ‘వాతావరణ మార్పు-
2014 ప్రభావాలు’ అనే కొత్త నివేదికలో అన్ని ఖండాలు, సముద్రాలు వాతావరణ ప్రభావానికి గురవుతున్నాయని పేర్కొంది. వాతావరణం దెబ్బతినడం వల్ల వరదలు, వేడివల్ల మరణాలు, కరువులు, ఆహార కొరత సంభవిస్తాయని నివేదిక తెలిపింది.
మాల్టా అధ్యక్షురాలిగా కొలీరో ప్రెకా
మాల్టా దేశానికి తొమ్మిదో అధ్యక్షురాలిగా మేరీ లూసీ కొలీరో ప్రెకా ఏప్రిల్ 4న ప్రమాణ స్వీకారం చేశా రు. ప్రధానమంత్రి ఆమె పేరును సూచించగా, పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 55 ఏళ్ల కొలీరో ప్రెకా మాల్టా దేశానికి రెండో మహిళా అధ్యక్షురాలు. ఆమె 2013 మార్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వంలో సోషల్ పాలసీ మంత్రిగా పనిచేశారు.
క్రీడలు
టి-20 ప్రపంచ చాంపియన్ శ్రీలంక
బంగ్లాదేశ్‌లో జరిగిన టి-20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్లో భారత్‌ను ఓడించింది. దీంతో 1996 తర్వాత ఐసీసీ నిర్వహించిన పోటీలో శ్రీలంక విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన శ్రీలంకకు 11 లక్షల డాలర్లు (రూ.6.6 కోట్లు), రన్నరప్ భారత్‌కు 3.3 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్‌కోహ్లికి దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇదే టోర్నీకి సమాంతంగా జరిగిన టి-20 మహిళల ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇప్పటివరకు నాలుగుసార్లు టి-20 ప్రపంచకప్ పో టీలు జరగ్గా... ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా 2010, 2012, 2014లలో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ సాధించింది.
అంజూబాబీకి స్వర్ణం- ఐఏఏఎఫ్ ప్రకటన
2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ స్వర్ణపతకం గెలుచుకున్నట్లుగా ఏప్రిల్ 1న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అంజూ చరిత్ర సృష్టించింది. మొనాకోలో జరిగిన 2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో రష్యా క్రీడాకారిణి తత్యనా కోటోవా ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం సాధించింది. అయితే ఆమెపై అనర్హత వేటుపడిన కారణంగా రెండో స్థానంలో నిలిచిన అంజూ స్వర్ణ పతకం గెలిచినట్లు దృవీకరించారు.
ధోనికి 2014-ఆసియా అవార్డు
టీమిండియా క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్‌ధోనికి 2014 ఆసియా అవార్డు వరించింది. క్రీడా రంగంలో అద్వితీయ ప్రతిభను కనబరిచినందుకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అవార్డు ఎంపిక కమిటీ పేర్కొంది.
మార్టినా హింగిస్ జోడికి సోనీ ఓపెన్ టైటిల్
మార్టినా హింగిస్, సబినా లిసికి జోడి సోనీ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకుంది. మియామిలో మార్చి 31న జరిగిన ఫైనల్లో ఎక్టెరినా మకరోవా, ఎవెనా వెస్నినా జంటను హింగిస్ జంట ఓడించింది.
భారత బాక్సింగ్ సమాఖ్య గుర్తింపును
రద్దుచేసిన క్రీడా మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించేందుకు తిరస్కరించిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్) గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న రద్దుచేసింది.
మార్చి 4న ఇదే సమాఖ్యపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) సస్పెన్షన్ వేటువేసింది. ఐఏబీఎఫ్ నియమావళిని సవరించి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య సూచించింది. ఇలా అంతర్జాతీయ సమాఖ్య, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను, సూచనలను భారత బాక్సింగ్ సమాఖ్య ఇప్పటివరకూ పాటించలేదు. అలాగే ఇంతకు ముందు నిర్వహించిన ఎన్నికలను రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐఏబీఎఫ్ గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వివరించింది. గతంలోనూ ఈ సమాఖ్యపై 2012 డిసెంబర్‌లో తాత్కాలిక సస్పెన్షన్‌ను క్రీడామంత్రిత్వ శాఖ విధించింది.
జకోవిచ్‌కు మియామి ఓపెన్ టైటిల్
మియామి ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. మియామిలో మార్చి 31న జరిగిన ఫైనల్లో రాఫెల్ నాదల్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతలు
న్యూఢిల్లీలో ఏప్రిల్ 6తో ముగిసిన ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ విజేతలు - విభాగాల వారీగా పురుషుల సింగిల్స్: లీచోంగ్‌వీ (మలేషియా); పురుషుల డబుల్స్: డెన్మార్క్‌కు చెందిన మాథియాస్‌బో, కార్‌స్టెన్ మోగెన్సన్; మహిళల సింగిల్స్: షిజియాన్ వాంగ్ (చైనా); మహిళల డబుల్స్: యువాన్‌తింగ్, యాంగ్‌యూ (చైనా); మిక్స్‌డ్ డబుల్స్: జోచిమ్ నీల్సన్, క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్).
జాతీయం
దేశంలో రెండు నూతన బ్యాంకులు దేశంలో మరో రెండు నూతన బ్యాంకుల ఏర్పాటుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2న సూత్రప్రాయమైన అనుమతిని మంజూరు చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్‌సీ, మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌లకు నూతన బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్‌బీఐ ఆమోదించింది. కొత్త బ్యాంకులకు లెసైన్సుల మంజూరు ప్రక్రియ చేపట్టవచ్చునంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ ఈ చర్య తీసుకుంది
.
సన్‌ఫార్మాచేతికి ర్యాన్‌బాక్సీ
అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాస్యూటికల్స్.. మరో దిగ్గజ కంపెనీ ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 7న ఇరు కంపెనీలు సంయుక్తంగా ప్రకటించాయి. పూర్తిగా స్టాక్స్ కేటాయింపు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ 320 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.19,200 కోట్లు.
సీమాంధ్ర రాజధాని ఎంపికకు నిపుణుల కమిటీ సీమాంధ్ర రాజధాని ఎంపికకు కేంద్ర హోంశాఖ మార్చి 28న ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి కె.శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఆగస్టు 31, 2014లోగా తమ నివేదికను సమర్పించనుంది. ఈ బృందంలో ఇతర సభ్యులు కె.టి.రవీంద్రన్, జగన్‌షా, ఆరోమర్ రేవీ, రతిన్‌రాయ్.
ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి ప్రకటన
2014 సంవత్సరపు మొదటి ద్వైమాసిక పరపతి విధానాన్ని రిజర్వ్‌బ్యాంక్ ఏప్రిల్ 1న ప్రకటించింది. స్వల్ప కాలానికి బ్యాంకులు తమ వద్ద ఉంచే నిధులపై రిజర్వ్‌బ్యాంక్ చెల్లించే వడ్డీరేటు (రెపోరేటు)ను 8 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట మొత్తానికి చెందిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని 4 శాతంగానే ఉంచింది. 2014-16లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 5.6శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాదిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి తక్కువగా ఉంటుందని అంచనావేసింది. తదుపరి సమీక్షను జూన్ 30న ప్రకటిస్తుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్‌ఎల్‌వీ-ిసీ 24 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట నుంచి ఏప్రిల్ 4న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)-1బీ. ఇది విజయవంతమైన 26వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగం. షార్ నుంచి 42వ ప్రయోగం. ఐర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1బీ పది సంవత్సరాల పాటు పనిచేస్తుంది. రూ. 1,600 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. దీని బరువు 1,432 కిలోలు. రాకెట్ బరువు 320 టన్నులు. రాకెట్ ఎత్తు 44.5 మీటర్లు. గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ నిర్మాణం కోసం భారత్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా నౌకలు, విమానాల గమనాలను, వాటి భౌగోళిక స్థానాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సొంత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్‌కు ఏడు ఉపగ్రహాల అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- 1ఏ ఉపగ్రహాన్ని ఇంతకుముందే ప్రయోగించింది.
విండోస్ ఎక్స్‌పీకి సెలవు
సుదీర్ఘకాలం పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్‌పీకి తెరపడింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీనికి ఏప్రిల్ 8 నుంచి సాంకేతిక సహకారాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఫలితంగా ఇకపై సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు పెయిడ్ రూపంలో గానీ ఉచితంగా గానీ సపోర్ట్ లభించదు. ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌నకు ఆన్‌లైన్‌లో టెక్నికల్ కంటెంట్ అప్‌డేట్ కూడా లభించదు. విండోస్ ఎక్స్‌పీని తొలిసారిగా 2001 అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో పోలిస్తే విండోస్ ఎక్స్‌పీ మూడు తరాల పాతది. 2012 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన విండోస్ 8 మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్.
ముగిసిన ఇన్సాట్-3ఇ కాలం
కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-3ఇ జీవిత కాలం ముగియడంతో పని చేయడం ఆగిపోయిందని ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం కక్ష్యలో 10 సంవత్సరాల 6 నెలలు పాటు విధులు నిర్వర్తించింది. 15 ఏళ్ల వినియోగం కోసం మూడో తరానికి చెందిన ఈ ఉప గ్రహాన్ని 2003 సెప్టెంబర్‌లో ప్రయోగించారు.
వార్తల్లో వ్యక్తులుమిస్ ఇండియాగా
కోయల్‌రాణా
మిస్ ఇండియా -2014 కిరీటాన్ని ఢిల్లీ యువతి కోయల్‌రాణా కైవసం చేసుకుంది. ముంబైలో ఏప్రిల్ 5న జరిగిన పోటీలో ఆమె విజేతగా నిలిచింది. దీంతో ఈ ఏడాది జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో కోయల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించ నుంది.
అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా
భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీపావెల్ మార్చి 31న రాజీనామా చేశారు. 2012 ఏప్రిల్‌లో పావెల్ భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు.
బీడీఎల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్.బి. సింగ్
భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సాంకేతిక విభాగానికి కొత్త డెరైక్టర్‌గా ఎయిర్‌వైస్ మార్షల్ ఎన్.బి. సింగ్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆయన భారత వైమానిక దళంలో కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు.
బీఎస్‌ఎఫ్ అధిపతిగా డి.కె.పాఠక్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కొత్త డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐ.పి.ఎస్ అధికారి డి.కె.పాఠక్ ఏప్రిల్ 2న నియమితులయ్యారు. 1979 బ్యాచ్‌కు చెందిన పాఠక్ అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన బీఎస్‌ఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా ఉన్నారు.
ఆసియా ప్రభావవంతుల జాబితా
ఆసియాన్ అవార్డ్స్ లిమిటెడ్ సంస్థ ఆసియాలోని వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ఏప్రిల్ 6న ప్రకటించింది. ఇందులో తొలి 5 స్థానాల్లో ముగ్గురు భారతీయులు ఉండడం విశేషం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మూడో స్థానంలో చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నాలుగో స్థానంలోనూ, కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గనర్నర్‌గా ఆర్.గాంధీ
భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఆర్. గాంధీని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 3న నియమించింది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆనంద్ సిన్హా స్థానంలో నియమితులైన గాంధీ మూడేళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు. గాంధీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్నారు.
Advertisement
Advertisement