రెండో డబుల్ సెంచరీతో రోహిత్‌శర్మ రికార్డు | Rohitsarma record the second double century | Sakshi
Sakshi News home page

రెండో డబుల్ సెంచరీతో రోహిత్‌శర్మ రికార్డు

Published Thu, Nov 20 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

రెండో డబుల్ సెంచరీతో రోహిత్‌శర్మ రికార్డు

రెండో డబుల్ సెంచరీతో రోహిత్‌శర్మ రికార్డు

వార్తల్లో వ్యక్తులు

 ఫార్చూన్ సీఈవోల్లో సత్య నాదెళ్ల
 ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సీఈవోల జాబితాలో ప్రవాస భారతీయులు ముగ్గురు చోటు దక్కిం చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, హర్మన్ ఇంటర్నేషనల్ చైర్మన్ దినేష్ పాలివాల్ ఈ జాబితాలో ఉన్నారు. 50 మంది కార్పొరేట్ దిగ్గజాలతో ఫార్చూన్ మ్యాగజైన్ ‘బిజినెస్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పేరిట రూపొందించిన లిస్టులో గూగుల్ సీఈవో ల్యారీ పేజ్ అగ్రస్థానంలో, యాపిల్ సీఈవో టిమ్ కుక్ రెండో స్థానంలో నిల్చారు. బంగా 28వ స్థానంలో, నాదెళ్ల 38వ స్థానంలో, పాలివాల్ 42వ స్థానంలో ఉన్నారు.
 
 జీనియస్ బుక్‌లోకి సూక్ష్మ నమూనాల సృష్టికర్త
 నెల్లూరుకు చెందిన సూక్ష్మ నమూనాల సృష్టికర్త షేక్ ముసవ్వీర్ అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానాన్ని సాధించాడు. 1.3 గ్రాముల బంగారు తీగతో తెలుగులో జాతీయ గీతంతోపాటు తెలుగుతల్లి, ప్రపంచ తెలుగు మహాసభల లోగో సూక్ష్మ నమూనాను రూపొందించినందుకు ఈ గుర్తింపు లభించింది.
 
 గోల్డ్ మాన్ శాక్స్‌లో భారత సంతతి యువకునికి భాగస్వామ్యం
 భారత సంతతికి చెందిన కునాల్ షా (32) అనే యువకుడు అమెరికాలోని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్ మాన్ శాక్స్‌లో భాగస్వామిగా చేరాడు. దీం తో అతిపిన్న వయుసులో ఈ ఉన్నతి పొందిన వ్యక్తిగా నిలిచాడు. గోల్డ్ మాన్ శాక్స్‌లో భాగస్వామికి 9 లక్షల డాలర్ల (సుమారు రూ. 5.4 కోట్ల) వేతనం ఉంటుంది.
 
 ఇంటర్‌పోల్ ఫౌండేషన్ బోర్డులో రతన్‌టాటా
 టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌టాటా ఇంటర్‌పోల్ ఫౌండేషన్ బోర్డు సభ్యునిగా నవంబరు 14న నియమితులయ్యారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఈ బోర్డు పనిచేస్తుంది.
 
 ఐరాస మహిళా సౌహార్ధ్ర రాయబారిగా ఫర్హాన్ అక్తర్
 ఐక్యరాజ్యసమితి చేపట్టిన ‘హి ఫర్ షి’ అనే కార్యక్రమానికి దక్షిణాసియా ప్రాంత మహిళా సౌహార్ధ్ర రాయబారిగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నవంబరు 14న నియమితులయ్యారు. దీంతో మహిళా సౌహార్ధ్ర రాయబారిగా ఎంపికైన తొలి పురుషుడుగా ఆయన గుర్తింపు పొందాడు. ఈ హోదాలో లింగ సమానత్వం, మహిళా స్వయం శక్తి అంశాలపై ఫర్హాన్ ప్రచారం నిర్వహిస్తాడు. అక్తర్‌తోపాటు బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్, అకాడమీ అవార్డు గ్రహీత నికోల్ కిడ్‌మన్, థాయ్‌లాండ్ యువరాణి బజ్రకితియాబా మహిదోల్ నియమితులయ్యారు.
 
 తమిళనాడు హెచ్‌ఆర్‌సీ చైర్ పర్సన్‌గా జస్టిస్ మీనాకుమారి
 తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ) చైర్ పర్సన్‌గా జస్టిస్ మీనాకుమారి నియమితులయ్యారు. గవర్నర్ రోశయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ మీనాకుమారి గతంలో మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
 
జాతీయం పీఆర్ కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్
 క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టం రాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నవంబరు 16న ఆ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
 
 పింఛనుదారులకు జీవన్ ప్రమాణ్
 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు పింఛను పొందేందుకు ఉద్దేశించిన జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇప్పటిదాకా పింఛనుదారులు ఏటా నవంబరులో నేరుగా సంబంధిత అధికారుల ఎదుట హాజరవడం లేదా జీవన ధ్రువ పత్రాన్ని అందజేయాల్సి వచ్చేది. ఇకపై ఆధార్ సంఖ్య, బయోమెట్రిక్ వివరాలతో కూడిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పిస్తే సరిపోతుంది.
 
 ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఆయుష్
 ప్రాచీన వైద్య విధానాలకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ఆయుష్‌ను ప్రత్యేక మంత్రిత్వశాఖగా మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా శ్రీపాద యశోనాయక్‌ను నియమించారు. గతంలో ఆరోగ్య మంత్రిత్వశాఖలో అంతర్భాగంగా ఆయుష్ ఉండేది. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వీటన్నింటినీ కలిపి ఆయుష్‌గా వ్యవహరిస్తారు.
 
 వల్లభాయ్ పటేల్ పేరిట జాతీయ గృహ నిర్మాణ పథకం
 పట్టణాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణాల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు నవంబరు 13న ప్రకటించారు.
 
రాష్ట్రీయం

తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాల పిట్ట
 తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర పక్షిగా పాల పిట్టను ఎంపిక చేసింది. రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నవంబరు 17న తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, పౌరాణిక నేపథ్యం ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
 
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి వి.నాగిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 11న నియమించింది. ఆయన ఐదేళ్ల పాటు కొనసాగుతారు.
 
తెలంగాణ  పౌర సరఫరాల శాఖకు ఇ-ఇండియా అవార్డు
రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ఇ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్-2014 అవార్డు లభించింది. నవంబరు 15న త్రివేండ్రంలో జరిగిన గవర్నెన్స్ సదస్సులో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
 
ఏపీ రాజధాని సలహా కమిటిలో సింగపూర్ ప్రతినిథి
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యునిగా సింగపూర్‌కు చెందిన ఖూ తెంగ్ చెయ్‌ని ప్రభుత్వం నియమించింది. ఖూ తెంగ్ చెయ్ సింగపూర్ అభివృద్ధి ప్రణాళికా విభాగంలో ముఖ్యుడు.  
 
విశాఖ ఉక్కుకు రాజభాష పురస్కారం
విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్)లో రాజభాష హిందీని పటిష్టంగా అమలు చేస్తున్నందుకు ఇందిరాగాంధీ రాజభాష పురస్కారం వరించింది. నవంబరు 15న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సంస్థ సీఎండీ మధుసూదన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
 
అంతర్జాతీయం

బీజింగ్‌లో 22వ అపెక్ సదస్సు
చైనా రాజధాని బీజింగ్‌లో 22వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సు నవంబరు 11-12 తేదీల్లో జరిగింది. ఆసియా పసిఫిక్ బాగస్వామ్యంతో భవిష్యత్ ఆవిష్కరణ అనేది సదస్సు ఇతివృత్తం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఏర్పాటుకు సభ్యదేశాలు అంగీకరించాయి. భారత్ ఇందులో సభ్యదేశం కాదు. పరిశీలకదేశంగా పాల్గొనాలని ఆహ్వానించగా ప్రధాని మోదీ హాజరుకాలేదు. 2015 అపెక్ సదస్సు ఫిలిప్పైన్స్‌లో జరగనుంది. అపెక్ సభ్య దేశాల సంఖ్య 21.
 
 తోకచుక్కపై దిగిన ఫీలే
 ఖగోళ చరిత్రలో తొలిసారి తోకచుక్కపై ల్యాండర్ చేరింది. 67పి/ చుర్యుమోన్-గెరాసి మెంకో అనే తోకచుక్క వెంట పదేళ్లుగా ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన రొసెట్టా వ్యోమ నౌక ఫీలే నవంబరు 12న కాలుమోపింది. ఇలా తోకచుక్కపై దిగడం ఇదే తొలిసారి. 2004లో రొసెట్టా వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించారు. తోకచుక్కల అధ్యయనం వల్ల 450 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిన సౌర కుటుంబం గురించి తెలుసుకోవచ్చు.
 
 బ్రిస్బేన్‌లో జీ-20 సదస్సు
 నవంబరు 15-16 తేదీల్లో జరిగిన తొమ్మిదో జీ-20 సదస్సుకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికైంది. సభ్య దేశాలు వచ్చే ఐదేళ్లలో 2.1 లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని ఉమ్మడిగా, వేర్వేరుగా సాధించేందుకు తీర్మానించాయి.

అవార్డులు

రజనీకాంత్‌కు ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు
 ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఈ సెంటినరీ అవార్డుకు రజనీకాంత్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ నవంబరు 11న ప్రకటించింది.
 
 ఎస్.ఎల్.గోస్వామికి స్వామినాథన్ అవార్డు
 ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుందర్‌లాల్ గోస్వామికి 2014 ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డును ప్రకటించారు. డాక్టర్ గోస్వామి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ మాజీ అధ్యక్షుడు. వ్యవసాయం, జంతు, మత్స్య సంబంధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రెండేళ్లకోసారి ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
 
 సెయిల్ చైర్మన్‌కు జె.ఆర్.డి.టాటా అవార్డు
 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్ సి.ఎస్.వర్మకు 2014 ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డు లభించింది. లోహ పరిశ్రమ కంపెనీ నిర్వహణలో నైపుణ్యం, పనితీరును కనబరిచినందుకు కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
 
 ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్ పురస్కారం
 హైదరాబాద్‌లోని భారత రసాయన పరిశోధన సంస్థ (ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త, ప్రకృతి ఉత్పత్తుల విభాగాధిపతి శ్రీవారి చంద్రశేఖర్ 2014 సంవత్సరానికి ఇన్ఫోసిస్ పురస్కారానికి ఎంపికయ్యారు. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది.

 క్రీడలు
 
రెండో డబుల్ సెంచరీతో రోహిత్‌శర్మ రికార్డు
శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత క్రికెటర్ రోహిత్‌శర్మ 264 పరుగులతో వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. నవంబరు 13న కోల్‌కత ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. దీంతో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 పరుగుల రికార్డును రోహిత్ అధిగమించాడు. గతంలో అతడు 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు.
 
 2015 ప్రపంచ కప్ క్రికెట్ ప్రచారకర్తలు
 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించే 2015 ప్రపంచకప్ క్రికెట్ ప్రచారకర్తలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నవంబరు 13న ప్రకటించింది. వీరిలో విరాట్‌కోహ్లి (భారత్), షేన్‌వాట్సన్, మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు.
 
 మిచెల్ జాన్సన్‌కు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ అవార్డు
 ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ 2013-14 సంవత్సరానికి ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటరు అవార్డుకు ఎంపికయ్యాడు. రికీపాంటింగ్ తర్వాత రెండోసారి ఈ అవార్డుకు ఎంపికైన ఆటగాడు జాన్సనే.
 
 చైనా ఓపెన్ సిరీస్ విజేతలు సైనా, శ్రీకాంత్
 చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ సింగిల్స్ టైటిళ్లను సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ గెలుచుకున్నారు.  శ్రీకాంత్‌కు ఇది తొలి సూపర్ సిరీస్ టైటిల్. సైనా ఈ టైటిల్ గెలవడం ఇది తొలిసారి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement