హిందూపురం మునిసిపాలిటీ, న్యూస్‌లైన్ :తనకు అవకాశం వస్తే సీఎం పదవిపై ఆలోచిస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన హిందూపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి పదవి విషయంపై ఆలోచిస్తానని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇది పెళ్లో.. పేరంటమో కాదు కదా అని వ్యాఖ్యానించారు. ప్రజలు కావాలనుకుంటే ఆయన ప్రచారానికి రావొచ్చన్నారు. ఈ ప్రాంతం నుంచి తన తండ్రి ప్రాతినిధ్యం వహించారని, ఆయన ఆశయాల మేరకు ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అన్నారు. వాటిని తాను పూర్తి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గతంలో ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన సమయంలోనే హిందూపురంలో బిందె రూ.2 ఉండేదని, తర్వాతి కాలంలో అది రూ.5కు చేరుకుందన్నారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్‌స ఫ్యాక్టరీని మూసివేసి అమ్మేశారు కదా దీనిపై మీ స్పందన ఏమిటని విలేకరులు ప్రశ్నించారు. రైతులకు సాగునీటి కొరత ఏర్పడటంతోనే నిజాం షుగర్‌స ఫ్యాక్టరీని విక్రయించారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, మేనిఫెస్టోలోని అంశాల అమలుకు కృషి చేస్తామని చెప్పారు.
సీఎం పదవిపై ఆలోచిస్తా
Published Thu, Apr 17 2014 3:36 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement