బీసీలకు బురిడీ
* 50% సీట్లిస్తానన్న హామీకి బాబు నీళ్లు
* తెలంగాణ పోటీ చేస్తున్న 72 అసెంబ్లీ స్థానాల్లో బీసీల వాటా 18 (25%) మాత్రమే
* మైనారిటీలకు నాలుగే
* రెడ్డి వర్గానికి 16 సీట్లు, కమ్మ వర్గానికి 6, వెలమలకు 3,
* 9 మంది ఎంపీ అభ్యర్థుల్లో దేవేందర్‌గౌడ్ కుమారుడు ఒక్కరే బీసీ.. బాబు తీరుపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ‘బీసీలకు రాజ్యాధికారమే నా స్వప్నం. అది నా ద్వారానే సాధ్యం..’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన ప్రచారంలో ఊదరగొడుతున్నారు...
‘బీసీలకు జనాభా ఆధారంగా యాభై శాతం సీట్లు దక్కితేనే నిజమైన రాజ్యాధికారం దక్కినట్లు! అది ఒక్క చంద్రబాబు ద్వారానే సాధ్యం...’ అంటూ తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య లేని గొప్పలు ప్రచారం చేస్తున్నారు...
తీరా చూస్తే టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు ఇచ్చిన టికెట్లు అక్షరాలా పద్దెనిమిది.. అంటే కేవలం 25 శాతమే! ఇక లోక్‌సభ స్థానాల్లోనైతే ఒకే ఒక్క సీటును బీసీలకు ఇచ్చారు.. అది కూడా దేవేందర్‌గౌడ్ కువూరుడికి ఇచ్చిన సీటు. ఇదీ చంద్రబాబు మార్కు సామాజిక న్యాయం! ఇదే చంద్రబాబు ప్రవచిస్తున్న సామాజిక తెలంగాణ!
చంద్రబాబు తీరుపై తెలంగాణలో బీసీలు మండిపడుతున్నారు. ‘సీఎంగా బీసీని చేస్తానని ప్రకటించేస్తే చాలా..? బీసీలకు కనీసం వారి జనాభాకు తగినట్లయినా సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నారా? వురి జనాభా ఆధారంగా యూభై శాతం టికెట్లు దక్కనప్పుడు.. నిజమైన రాజ్యాధికారం ఎలా సాధ్యవువుతుంది?..’ అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ అగ్రవర్ణాల్లోని మూడు కులాలకు కట్టబెట్టిన టికెట్ల సంఖ్య 25. రెడ్డి వర్గానికి 16, వెలమ వర్గానికి మూడు సీట్లు ఇచ్చిన చంద్రబాబు తన కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణలో ఆరు సీట్లు ఇచ్చారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ స్థానానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రావి శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చిన బాబు... ఖమ్మంలో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు పోగా మిగిలిన మూడు జనరల్ స్థానాలనూ కమ్మ వర్గానికే కేటాయించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొత్తగూడెంను తొలుత బీసీ నేత బాలసానికి ప్రకటించిన చంద్రబాబు.. తరువాత ఎంపీ నామా ఒత్తిడికి లొంగి కమ్మ వర్గానికి చెందిన కోనేరు సత్యనారాయణకు ఇచ్చారు. మరోవైపు బ్రాహ్మణ, వైశ్య వంటి సామాజిక వర్గాలను పరిగణనలోకే తీసుకోలేదు.
లోక్‌సభకు ఒకే ఒక్క బీసీకి అవకాశం
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ తొమ్మిందింటి లో పోటీ చేస్తోంది. ఇందులో తప్పనిసరి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఒకే ఒక్క బీసీకి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చారు. అది కూడా సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్‌కు కావడం గమనార్హం. అసలు వీరేందర్‌కు ఉప్పల్ అసెంబ్లీ స్థానం అనుకుని, చివరి నిమిషంలో చేవెళ్ల ఎంపీ సీటు ఇచ్చారు. లేకపోతే ఈ ఒక్క ఎంపీ సీటు కూడా బీసీల కోటాలో చేరేది కాదు. చేవెళ్ల నుంచి రెడ్డి వర్గానికి లేదా కమ్మ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీ చేయించాలని బాబు చివరివరకు యోచించడం తెలిసిందే.
మిగతా సీట్లలో మల్కాజ్‌గిరి, నల్లగొండ స్థానాలను రెడ్డి వర్గానికి ఇచ్చిన బాబు.. జహీరాబాద్‌ను ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కె.మదన్‌మోహన్‌రావుకు కేటాయించారు. ఖమ్మం స్థానాన్ని యథావిధిగా కమ్మ వర్గానికి చెందిన నామా నాగేశ్వర్‌రావుకు కేటాయించారు. మరోవైపు.. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు సిట్టింగ్ బీసీ ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం అంటూ ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్లాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక న్యాయం ఇదేనా?
సామాజిక తెలంగాణ, అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం అంటూ ఊదరగొట్టే బాబు అసెంబ్లీ జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడా అవకాశం కల్పించలేదు. అనేక నియోజకవర్గాల్లో ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు టికెట్ కోసం పోటీ పడ్డా... వారిని రెండోశ్రేణి నాయకత్వానికే పరిమితం చేశారు.
ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్క బీసీకీ టికెట్ ఇవ్వలేదు. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో పేరుకు మాత్రం ఒక్కొక్క బీసీకి టికెట్ ఇచ్చారు. బీసీని సీఎం చేస్తానంటూ.. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని ఎల్‌బీ నగర్ సీటిచ్చిన చంద్రబాబు... మరి రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన సీట్ల సంఖ్య విషయంలో ఏం చెపుతారో? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.