కాంగ్రెస్ పాలనలో దేశం నాశనం: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సోమవారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి మల్లారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావులకు మద్దతుగా చంద్రబాబు మల్కాజ్‌గిరిలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో నిత్యావసర సరుకులు, విద్యుత్, పెట్రోలు చార్జీలు విపరీ తంగా పెరగాయన్నారు. సోనియా గాంధీ ఊరికి ఒక అనకొండను తయారు చే సిందని విమర్శించారు. సోనియా చేతిలో ప్రధానమంత్రి రోబోలా తయారయ్యాడన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. సామాజిక తెలంగాణ టీడీపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలుగుజాతికి పునర్‌వైభవం తీసుకురావడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
బాబు సభకు టీడీపీ, బీజేపీ నేతల డుమ్మా
ఎల్‌బీనగర్‌లో సోమవారం చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభకు సొంత పార్టీ నేతలే డుమ్మా కొట్టారు. టికెట్ దక్కలేదని మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీ కృష్ణప్రసాద్ సభకు రాలేదు. కర్మన్‌ఘాట్, పీఅండ్‌టీ కాలనీ, హయత్‌నగర్, వనస్థలిపురం కార్పొరేటర్లు సభకు డుమ్మా కొట్టారు. సభలో మోడీ, కిషన్‌రెడ్డి ఫోటోలతో పాటు బీజేపీ జెండాలు, బ్యానర్లు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. టీడీపీకి వ్యతిరేకంగా నినదిస్తూ సభ నుంచి నిష్ర్కమించారు.