పాత సామాన్లు కొంటున్నారు!
చంద్రబాబుపై చిరంజీవి విమర్శలు
మిగిలినవారు, స్వార్థపరులను టీడీపీలోకి చేర్చుకుంటున్నారని వ్యాఖ్య
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పాత సామాన్లు కొనేవారి మాదిరిగా పార్టీలోకి ఎవరొస్తారో రండి.. రండి.. అంటూ సైకిల్ మీద తిరుగుతున్నారని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి ఎద్దేవా చేశారు. మిగిలిపోయినవారు, వట్టిపోయినవారు, స్వార్థపరులను చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. సైకిల్‌కు మోసే శక్తి అంత ఉందా? అని ప్రశ్నించారు. ‘అది బుల్‌డోజర్ కాదు.. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
బస్సుయాత్రలో భాగంగా సోమవారం విజయవాడలో ‘మీట్ ద ప్రెస్’లో అనంతరం గుంటూరులో కార్యకర్తల సమావేశంలో ఆంధప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో కలిసి చిరంజీవి మాట్లాడారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు కార్పొరేట్ల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నారని చిరంజీవి చెప్పారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తాను పునీతుడినని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ను వదిలివెళ్లారని విమర్శించారు. తన సోదరుడు పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నానన్నారు.
కాంగ్రెస్‌కు ఎగిరింది పైకప్పులే: రఘువీరా
రాష్ట్ర విభజన ఆపాలని తాము చివరిదాకా ప్రయత్నించినా చంద్రబాబు ఇచ్చిన లేఖ, బీజేపీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడంవల్ల అనివార్యమైందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుంటూరులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రక్షించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పునాదులు బలంగా ఉన్నాయన్నారు. పైకప్పులు మాత్రమే పోయాయని, మళ్లీ పునర్నిర్మాణం చేయడం సాధ్యమేనన్నారు.