సాక్షి, ఒంగోలు : పార్టీలతో పనిలేదు. ప్రధాన నేతలను వేడుకోవాల్సిన అవసరం లేదు. ‘బి’ఫారం గురించి బెంగే అక్కర్లేదు. పోటీ చేయాలన్న ఆలోచన, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే చాలు... నామినేషన్‌ను స్వతంత్రంగా వేయవచ్చు. ప్రజల మనిషిగా ప్రజాక్షేత్రంలో నిలబడొచ్చు. గెలుపో..ఓటమో పక్కనబెడితే ప్రధాన పార్టీల ఓట్లపై ప్రభావం చూపొచ్చు. గెలిస్తే ప్రధాన పార్టీల భవిష్యత్‌లో కీలకంగా మారొచ్చు. ఈ సిద్ధాంతాన్నే నమ్ముకుని ముందడుగేస్తున్నారు కొందరు స్వతంత్ర అభ్యర్థులు.
జిల్లా పురపోరులో స్వతంత్ర అభ్యర్థుల జాబితా మునుపటికంటే పెరిగింది. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలుండగా, కోర్టు వ్యాజ్యాలతో ఒంగోలు, కందుకూరు ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో (చీమకుర్తి, కనిగిరి, మార్కాపురం, అద్దంకి, చీరాల, గిద్దలూరు) మొత్తం 145 వార్డులకుగాను 1217 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 142 వార్డుల్లో పోటీ తప్పనిసరైంది. ఇందుకుగాను మొత్తం 592 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 137 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ శ్రేణులే స్వతంత్రులుగా బరిలో ఉండటం గమనార్హం. పార్టీ గడ్డుపరిస్థితికి చేరిన నేపథ్యంలో.. ఆ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లలేక స్వతంత్ర ముసుగును తగిలించుకున్నారు. ఇక మిగిలిన వారిలో కొందరు మాజీలుగా పార్టీల్లో పనిచేసి, విసుగుచెంది స్వతంత్రులుగా బరిలోకి దిగారు.
ఓట్ల చీలికతో ఫలితాలు తారుమారు
ప్రతి మున్సిపాలిటీలోని వార్డుల్లో స్వతంత్రులు ఇద్దరు ముగ్గురు వరకు పోటీపడుతుండగా, కొన్నిచోట్ల వీరిసంఖ్య ఐదుకు మించి ఉంది. ఈ పరిస్థితి ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఇండిపెండెంట్లు తమకున్న పలుకుబడితో ఓట్లను రాల్చుకున్న పక్షంలో ... అన్ని ప్రధాన పార్టీలకు భారీగా ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటములు కూడా కొద్ది తేడాలోనే తేలడం ఖాయమని, భారీ అధిక్యత చూపే అవకాశం లేదంటున్నారు. కొన్నిచోట్ల టీడీపీ రెబల్స్ అధికంగా ఉంటే... కాంగ్రెస్ రెబల్స్ స్థానిక పట్టణ సంరక్షణ సమితి, బీఎస్పీ పేరుతో ఎన్నికల్లో తమ సత్తా పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు.
చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం పక్క పార్టీల వైపు చూస్తూనే ఉన్నారు. ఈలోగా అతని చుట్టూ ఉన్న కేడర్ కూడా క్రమంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్ని చూసుకుంటున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికలొచ్చాయి. దీంతో ఆయన తనవద్దనున్న కొందరితో చీరాల పరిరక్షణ సమితి పేరిట స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దింపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అంతే పోటీగా బరిలో పావులు కదుపుతోంది. అక్కడ్నే టీడీపీ రెబల్స్ కూడా ఉన్నారు. ఈక్రమంలో ఆరెండు పార్టీల అభిమానులు తమ ఓట్లను స్వతంత్ర అభ్యర్థులకు వేసే ఆలోచనలో ఉన్నారు.
గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చేదిగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ ఓటు బ్యాంకులు రెండూ చీలిన పక్షంలో.. ఆయా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకూ ఓట్లశాతం తక్కువగా ఉంటుందని.. ఇప్పటికే డిపాజిట్‌గా ఉన్న బడుగు బలహీనవర్గాల ఓటుబ్యాంకు వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఎవరికి వరం?
Published Thu, Mar 27 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement