వేసేయ్ గాలం | who are the winners | Sakshi
Sakshi News home page

వేసేయ్ గాలం

Published Wed, May 7 2014 2:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

who are the winners

 సాక్షి, మంచిర్యాల : మున్సిపాలిటీ, స్థానిక, సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ వేడి రగిల్చిన నాయకులు తాజాగా అధికార పీఠాలను కైవసం చేసుకునే ఎత్తుగడలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా జెడ్పీ చైర్‌పర్సన్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు కైవసం చేసుకునే పనుల్లో పడ్డారు. ప్రధానంగా జెడ్పీ చైర్‌పర్సన్ స్థానంపై అన్ని పార్టీల నాయకులు గురిపెట్టారు. ఫలితాల వెల్లడికి దాదాపు వారం గడువు ఉన్నప్పటికీ, చైర్‌పర్సన్ ఎన్నికకు నిర్దిష్ట సమయం ప్రకటించనప్పటికీ ‘తమదైన ఏర్పాట్లలో’ నాయకులు బిజీ అయ్యారు. జిల్లాలోని ఆయా మండలాల్లో జెడ్పీటీసీ స్థానం కోసం బరిలో నిలిచిన వారి సమాచారాన్ని సేకరించే పనిలో నాయకులు పడ్డారు. వారి ఫోన్ నంబర్లు, ఒకవేళ వారు గెలిస్తే ఎవరి మాట వింటారు, వారు మద్దతిచ్చిన పార్టీకే ఓటు వేస్తారా లేదా ప్రలోభ పెడితే తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అన్న కోణంలో తమ ద్వితీయ శ్రేణి కార ్యకర్తల నుంచి ప్రధాన పార్టీల నాయకులు సమాచారం సేకరిస్తున్నారు.
 
 ‘ప్రత్యేక’ జాగ్రత్తలు
 జిల్లాలో గతంలో మెజార్టీ స్థానాలు గల పార్టీ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఉదంతాన్ని ఆయా పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. మరోమారు అదే పరిస్థితి తలెత్తకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న తమకు ఈసారి పెద్ద ఎత్తున జెడ్పీటీసీ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పార్టీ నుంచి బరిలో నిలిచిన వారి వివరాలను అందుబాటులో ఉంచుకొని తరచుగా వారితో టచ్‌లో ఉంటున్నారు. గతంలో జెడ్పీ పీఠాన్ని దాదాపు మెజార్టీ ఎన్నికల్లో దక్కించుకున్న టీడీపీలో మాత్రం ఈ పరిస్థితులే కనిపించకపోవడం లేదు.
 
 క్యాంప్ నడపుదామా..? వద్దా?
 మరోవైపు ‘క్యాంప్‌ల నిర్వహణ’ విషయంలో రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుస్తామనే ధీమాలో ఉన్న పార్టీతోపాటు.. అధిక స్థానాలు దక్కించుకుంటామనే పార్టీలు ఈ ప్రక్రియను సమీక్షించుకుంటున్నాయి. ఫలితాల నిర్వహణకు ఇంకా వారం రోజుల గడువు ఉంది. ఆ తర్వాత ఎన్నిక నిర్వహణకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టనుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో స్పష్టత లేదు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడాన్ని బట్టి జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక జూన్ రెండో వారంలోనా లేదా స్థానిక ఫలితాల తర్వాతనా అనేది తేలనుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడే క్యాంపులు నిర్వహిస్తే అది తలకు మించిన భారంగా మారుతుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు, భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుందనే ఉద్దేశంతో ఈ ఆలోచన విరమించుకున్నట్లు జిల్లా నాయకుడొకరు తెలిపారు. కానీ, మరోవైపు బరిలో నిలిచి, గెలిచిన వారికి ఎక్కడ ప్రత్యర్థి పార్టీలు తమ గూటికి లాక్కుంటాయోనన్న బెంగ పీడస్తోంది. జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ బాధ్యులు కొందరిని వ్యక్తిగతంగా కలుస్తూ రోజు టచ్‌లో ఉంటున్నారు. యనకే జెడ్పీ పీఠం దక్కుతుందని, ప్రలోభాలకు లొంగవద్దని భరోసా ఇస్తున్నారు. ఫలితాల వెల్లడికి ముందే ఇంతటి ఉత్కంఠను రేకెత్తిస్తున్న రాజకీయ ఫలితాల అనంతరం ఏ విధంగా ఉంటాయోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement