సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే హవా! | ysrcp lead in seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే హవా!

Published Sat, Apr 5 2014 1:41 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే హవా! - Sakshi

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే హవా!

న్యూస్-ఎక్స్ సర్వేలో వెల్లడి
సీమాంధ్రలో 17 ఎంపీ సీట్లు చేజిక్కించుకుంటుందని అంచనా
 
 సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ న్యూస్-ఎక్స్ సర్వేలో వెల్లడైంది. సీమాంధ్రలోని మొత్తం 25 సీట్లలో వైఎస్సార్‌సీపీ 17 స్థానాలను చేజిక్కించుకుంటుందని, టీడీపీ ఎనిమిది స్థానాలకే పరిమితమవుతుందని ఆ చానల్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది.
 
 సర్వే ఫలితాలను న్యూస్-ఎక్స్ చానల్ శుక్రవారం ప్రసారం చేసింది. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవాకు తిరుగుండదని ఎన్‌టీవీ-నీల్సన్ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే గత నెలరోజుల్లో పరిస్థితులు మారిపోయాయని, టీడీపీ పుంజుకుందని జాతీయ చానళ్లు సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ తాజా సర్వేల పేరుతో కొత్త అంచనాలను అందించాయి. వీటిపై ఆ చానళ్ల చర్చల్లో పాల్గొన్న హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్, ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నెలరోజుల్లో ఏం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని సర్వే ఫలితాలు అంతగా మారిపోయాయని పలువురు విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీతో పొత్తువల్ల సీమాంధ్రలో టీడీపీకి నష్టమే తప్ప లాభం ఉండదని విశ్లేషించారు. వారి వాదనలను నిజం చేస్తూ సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీయే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని న్యూస్-ఎక్స్ చానల్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మొత్తం 17 సీట్లలో పదిసీట్లు గులాబీదళానికే దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు ఐదు, బీజేపీకి ఒకటి, ఇతరులకు ఒక ఎంపీ సీటు దక్కే అవకాశాలున్నాయని పేర్కొంది. జాతీయస్థాయిలో బీజేపీకి 220 ఎంపీ సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 100 స్థానాల దగ్గరే ఆగిపోతుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement