బొబ్బిలి యుద్ధం | BOBBILI War | Sakshi
Sakshi News home page

బొబ్బిలి యుద్ధం

Published Fri, Jan 2 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

బొబ్బిలి యుద్ధం

బొబ్బిలి యుద్ధం

పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రెంచి, బ్రిటిష్ వాళ్ళ రాకతో ఆంధ్రదేశం ఆధునిక యుగంలోకి ప్రవేశించింది. వాణిజ్యానికై వచ్చిన తెల్లదొరలు అధికారానికై తలబడ్డారు. పక్కవాడు బాగుపడితే ఓర్వలేని మనవాళ్ళు ఆంధ్రదేశాన్ని బంగారుపళ్ళెంలో పెట్టి వారికి అందించారు. స్వార్థపూరితమైన రాజకీయాల వల్ల పెరిగిపోయిన అప్పుల భారానికి రైతుబిడ్డలు అల్లాడారు. ఆనాటి జానపద సాహిత్యం వారి ఆక్రందనలకి అద్దంపడుతుంది.

‘ఏటికేతాంబట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగనన్నా... కాలె గంజిలో మెతుకెరుగనన్నా...’ అంటూ రైతులు వాపోయారు. ఆనాటి రైతులు పండించిన పంట ఎవరెవరికి ఎంత పోయిందో వివరాలు కొన్ని నైజాం రికార్డుల్లో దొరికాయి.

 మూడెకరాల మాగాణిలో నేటి హైబ్రిడ్ రకాలు రాకమునుపు వరిపంట ఎకరానికి 2400 శేర్ల చొప్పున పండితే అదే పెద్ద గొప్ప. అందులో పురోహితుడికి 5 శేర్లు, ధర్మాలకి 5, జోతిష్యుడికి 1, మంగలి 2, కుమ్మరి 2, కమ్మరి 2, చాకలి 4, కొలిచే సరాఫుకి 4, గుడికి 5, రెడ్డి లేదా మునసబుకి 8, కరణానికి 10, తలారి లేదా కొత్వాల్‌కి 10, దేశ్‌ముఖ్ 45, దేశ్‌పాండే 45, నేరడికి 20 అంటే 169 శేర్లు ఊళ్ళో కొలిచి పంచవలసి వచ్చేది. ఇక గుత్తేదారుకి 10 శాతం అంటే 240 శేర్లు. మొత్తం పంటలో 50 శాతం అంటే 1200 శేర్లు ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. ఇక మిగిలింది. 790 శేర్లు. ఇది మాగాణి రైతుల పరిస్థితి. అంటే మెట్ట రైతుల విషయం ఇంకెంత అధ్వాన్నంగా ఉండిందో ఊహించుకోవచ్చు.

 ఉత్తరకోస్తాని ఫ్రెంచివారికి పరం చేయడంతో పన్ను 66 శాతానికి పెంచబడింది. అప్పుడు రైతులు చేసిన ఆక్రందనలే బొబ్బిలియుద్ధానికి ముఖ్యకారణం. ఆ అన్యాయాన్ని ఎదిరించి ప్రాణాలు త్యాగం చేసిన బొబ్బిలివీరులు తెలుగుజాతికి చిరస్మరణీయులయ్యారు. అందుకే జానపద సాహిత్యంలో ఆ వీరగాథ అజరామరమయింది. గ్రామీణ వినోదంలో వీరగాథలకున్న ప్రాముఖ్యం మరి దేనికీ లేదు.
 
ఇంటిని తిమ్మరాజుకత, యింటిని యీర్లకథా ప్రసంగముల్ ఇంటిని పాండులాలి, యిబమింటిని నాయకురాలి శౌర్రెమొ అంటూ పండగ వచ్చిందంటే గ్రామాలు జానపదుల ఆటపాటలతో మార్మోగుతాయి. ఇక సంక్రాంతి పండగ హరిదాసులకీ, డూడూ బసవన్నలకీ, కూచిపూడి భాగోతులకీ అన్నంపెట్టే పండగ. కోలాటాలూ, గొబ్బిసుద్దులూ, బొమ్మలకొలువులతో ఆడపిల్లలు ధాన్యలక్ష్మికి స్వాగతం చెబితే, కోడిపోరు, ఎడ్లపందేలు, మల్లయుద్ధాలు, కర్రసాములతో యువకులు చిందులేస్తారు. చేతిలో కాసులు గలగలలాడుతుంటే ఇక జూదానికీ, పంతాలకీ అంతుండదు.

 అప్పటి శిష్ఠ సాహిత్యం జమిందారుల వరండాలకే పరిమితమయింది. పనికిమాలిన రాజులని కూడా ఇంద్రుడు చంద్రుడు అని కీర్తించి పబ్బం గడుపుకునే కవులు, రూపాయిస్తే పద్యం చెప్పే స్తోత్రపాఠకులు, కానీ వాళ్ళవల్లనే సాంప్రదాయక కవిత్వం అనే ప్రక్రియ పూర్తిగా మాయమవకుండా నిలిచింది. నాటి పరిస్థితులను గురించి ఆవేదనని వ్యక్తం చేసే చాటువులూ, శతకాలూ వెలువడ్డాయి. దేశంలో అరాచకానికి దేవుడిదే బాధ్యత అంటూ తిరుపతి వెంకన్ననీ, సింహాచలం అప్పన్ననీ తిట్టిపోస్తూ వందల పద్యాలు చెప్పారు.
 ఇక పులిమీద పుట్రలా తనఖాలు, తాకట్లతో రైతుబిడ్డ ఆధారపడిన నేలతల్లికే ఎసరుపెట్టే వడ్డీవ్యాపారులూ, వకీళ్ళు బయలుదేరి గ్రామీణ జీవితాన్ని మరింత ఛిద్రం చేశారు.

 ధనమైనంతట భూముల తనఖాలను విక్రయములు తరువాత సతీ  మణి భూషణాంబరమ్ములు  గొనుట యవలక్షణములు గువ్వలచెన్నా!మరో వందేళ్ళు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే. రైతుపై ఆధారపడిన గ్రామీణ సంస్కృతీ, సంప్రదాయాలకూ, చేతివృత్తులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్ళయినా ఆనాటి గాయం ఇంకా మానలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement