నా చర్మం కాస్త డల్‌గా ఉంటోంది. నేను తినే ఆహార పదార్థాల్లో చర్మానికి ఏవైనా కీడు చేసేవి ఉన్నాయేమో అనిపిస్తోంది. మేనికి మేలు చేయని ఆహారాల గురించి వివరిస్తే... వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. దయచేసి చెప్పండి.
- సులోచన, హైదరాబాద్
ఈ కింద పేర్కొన్న ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. పైగా మితిమీరి తీసుకుంటే కీడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఇవి తీసుకునే సమయంలో విచక్షణతో ఉండాలి. ఈ ఆహారం వివరాలివి... కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లలో కెఫిన్ పాళ్లు ఎక్కువ. ఇవి చర్మం నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తాయి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు తీసుకోవడం ఇన్‌ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతాయి.
తీపి ఎక్కువగా ఉండే ఆహారంవల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్‌డ్ ఫుడ్‌లలో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌లలో ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మేనికి మంచిది కాదు.
డాక్టర్ మేఘనారెడ్డి కె.
కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్‌డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,హైదరాబాద్
డర్మటాలజీ కౌన్సెలింగ్
Published Mon, May 18 2015 12:12 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
Advertisement
Advertisement