వీధి అరుగు ఆహ్వానం వంటిది. మొదటి ఆతిథ్యం అరుగే ఇస్తుంది. అతిథులో, అభ్యాగతులో, బాటసారులో, అందరినీ ఇలా దయచేయండి అంటుంది వీధి అరుగు.
పట్టణంలో ఉన్నప్పుడు పల్లెటూరికి పోయి ఉండాలనిపిస్తుంది. తీరా, పల్లెటూళ్లో పట్టుమని పదిరోజులైనా ఉండలేను. వింతగా తయారయ్యాను నేను. అసలు పల్లెటూరికే మతిపోయినట్లుంది ఇప్పుడు. ఇదివరకు ఎలా గుండేది. పాపం, నిశ్చలంగా నిశ్చింతగా!
‘‘కాలవ ఒడ్డున ఒరిగి నీడ చూసుకేనేదో,
చేలనడుమ పడుచులాగ చేయెత్తీ పిలిచేదో,
తోటవెనెక కాస్త కాస్త తొంగి తొంగి చూసేదో,
కొండపక్క నిలిచేదో.’’
ఎంత తీయగా, చల్లగా ఉండేది తెలుగు పల్లె!
ఇప్పుడు పల్లె కూడా మతి చెడగొట్టుకుంది– పట్టణం లాగ ఉండబోయి, అది చాతకాక.
కాఫీ హోటళ్లూ, వాటినుంచి గ్రామఫోను రికార్డుల అరుపులూ, కిల్లీసోడా కొట్టులూ, బస్సుల సందడీ, సినీమాలూ, వాటి తాలూకు ప్రకటనలూ– వాటి అన్నిటితో గ్రామం వేడుక కోసం నగరంవైపు మొగం తిప్పుకొని చూస్తున్నట్టుంటుంది. నగరం వీటి అన్నిటి మధ్యా ఊపిరాడక నలుగుతూ, అన్నం కోసం పల్లె వైపు చేతులు జాపుతున్నట్టుంది.
పల్లె తల్లి వంటిది. పట్టణం ప్రియురాలు వంటిది. అన్నం పెట్టడం, చల్లని అంకం మీద పవళింప జేసుకోవడం– గారంగా పెంచుతుంది పల్లె.
ఆకర్షించడం, ఎప్పటికప్పుడు ఆవేశాలతో కదిలించి వేయడం– గాఢంగా ఊపేస్తుంది పట్టణం.
‘‘నీకేం గావాలి?’’ అంటుంది పల్లె. ‘‘నా కేమిస్తావు?’’ అంటుంది పట్టణం.
పల్లె కుటుంబంలాగ, సంసారంలాగ ఉంటుంది. పట్టణం సంతలాగ విపణిలాగ ఉంటుంది.
గ్రామంలో కాలాలు తెలిసిపోతాయి– ఎండా, వానా, వెన్నెలా, వీటితో స్పష్టంగా. పట్టణానికి రుతువులు లేవు. చెట్లూ, చేమలూ, లతలూ, పువ్వులూ, పక్షులూ, బిక్కచచ్చి ఉంటాయి.
పట్టణంలో పదిమందిలో ఒంటరిగా ఉంటాం. పల్లెలో మనిషీ, చెట్టూ చేమా పిట్టా జంతువూ కలిసి ఒకే కుటుంబం.
పట్టణంలో కొత్తరకపు ఇళ్లు లేస్తున్నాయి. దాదాపు ఒకే రకంగా ఉంటాయి.
కొన్నింటికి చుట్టూ గోడలు ఉంటాయి, లోపలికి రావడానికి వీలు లేదన్నట్టు. ఎన్నిటికో గోడలు లేకపోయినా వీధి అరుగులుండవు.
గ్రామాల్లో ఇళ్లకు వీధి అరుగులుండేవి.
వీధి అరుగు ఆహ్వానం వంటిది. మొదటి ఆతిథ్యం అరుగే ఇస్తుంది. అతిథులో, అభ్యాగతులో, బాటసారులో, అందరినీ ఇలా దయచేయండి అంటుంది వీధి అరుగు.
మా ఊళ్లో చెప్పుకోదగ్గ అరుగులు నాలుగు ఉండేవి– కరణం జగ్గరాజు మావయ్యగారిదీ, మునసబు శేషాద్రిగారిదీ, దివాణందీ అంటే వెలమ దొరగారు వెంకట్రాయణిం గారిదీ, మరీ మాదీ అంటే పెద్ద శాస్త్రులు గారిదీని. ఇవే, సమయాన్ని బట్టి, కచేరీ లయ్యేవి; క్లబ్బు లయ్యేవి; సభాస్థలాలయ్యేవి.
రాయణింగారి అరుగు గచ్చు నిగనిగమంటూ నున్నగా మెరుస్తూ ఉండేది. అరుగంటే నిజానికి రెండు అరుగులు– వీధి గుమ్మానికి అటూ ఇటూ, దివాణపు టరుగు మీద తివాసీలు పరచి ఉండేవి. కాని, చల్లటి గచ్చుమీదే కూర్చోవాలని ఉండేది మాకు. ఈ అరుగుల మీద ఇటూ అటూ జేరగిలబడ్డానికి గచ్చు బాలీసులుండేవి. అరుగుల మీద ఒకవైపు రెండు సవారీ లుండేవి– చక్కగా చెక్కిన అడ్డలూ, సోగదండెలూ, దంతపుకోళ్లూ, రాయంచ రెక్కలతో పరుపు బాలీసులూ, ‘‘వింతపని చక్కీల్ పెంజరీ పింజరీల్’’; మొదలైన వాటితోనూ.
పెద్దలు మాట్లాడుకుంటూంటే పిల్లలం ఆ సవారీలో సరదాగా కూర్చునేవాళ్లం.
ఆ అరుగుల మీద ఉన్న కిటికీలలో నుంచి దివాణం లోపలి భాగం కనబడేది.
కరణం గారి వీధి అరుగుమీద పాత తివాసీ ఉండేది– కొంత నలిగి, ఎంతో రంగు పోగొట్టుకున్నది. ఒక పక్కన గోడ నానుకుని ఆయన కూర్చుంటే ముందుగా చిన్న డెస్క్‌బల్ల ఉండేది.
కరణం జగ్గరాజు మామయ్య కచేరీ వేషం మహాబడాయిగా ఉండేది– ‘‘తెలితలపాగ, చొక్క, మొలతిత్తి భుజంబున చల్వపచ్చడంబు, అలచిటివ్రేల ముద్రిక, ఒయారము మీర పొగాకు చుట్ట.’’
మునసబు శేషాద్రి వీధి అరుగు గచ్చుకన్నా నిగనిగలాడుతూ గట్టిగా నున్నగా ఉండేది– మట్టితో అలికిన దైనా! ఈ అరుగు మొగాన జేవురు మట్టిచార లుండేవి. దీని మీద పెద్ద పెద్ద తుంగ చాపలు.
కరణం వీధి అరుగూ, మునసబు వీధి అరుగూ కచేరీలు. అవి సాయంకాలం దాకా సందడిగా ఉండేవి. కిస్తీలూ, జప్తులూ, మందడిగోడల ఫిర్యాదులుగా, బందెలదొడ్లూ, చేలగట్ట వివాదాలూ, సర్వేరాళ్లూ, రెవిన్యూ ఇనస్పెక్టర్ల దురంతాలూ, తాసిల్దారు గారికి సప్లయిలూ, బోర్డు ఎన్నికలూ, రౌడీ సుబ్బన్న పోకిరి చేష్టలూ, అచ్చెమ్మ విడాకులూ– ఇలాటి వాటిమీద కరణం మునసబుల మంత్రాంగాలూ ఈ అరుగుల మీద జరిగేవి.
ఇక్కడికి అన్ని తరగతులవారు వచ్చేవారు. పాగాలవారూ, జుట్టు ముళ్లవారూ, జునపాలవారూ, బొత్తాలు లేని చొక్కాలవారూ!
దూరాన అరుగుమీద ఓ మూల ఒక పరదేశి మూటతో కూర్చుని ఉంటాడు. ఈ వ్యవహారాల తీర్పులో నడుమ ఎవరో ఒకరు ఛలోక్తులు విసురుతారు. ఒకడనవసరంగా కలుగజేసుకొని చీవాట్లు తింటాడు.
సాయంకాలం మూడుగంటల నుండి దివాణపు వీధి అరుగు. ఇక్కడికి కరణం మునసబు వస్తారు; కలకాపులు వస్తారు; మేష్టారు వస్తారు; సిద్ధాంతీ షావుకారు కూడా వస్తారు. రాయణింగారు సరేసరి.
ఇంతలో ఆ వీధినే తుర్రుమని ఒక పంది అటు పరుగెత్తేది; చెంగున ఇటు ఒక లేగదూడ బంతిలా ఎగిరి వెళ్లిపోయేది.
ఊరిబావి నుండి నీళ్లు తెస్తున్న అమ్మలక్కలు, అంతవరకు కిలకిల మాట్లాడేవాళ్లు, ఒక్కసారి ఆగిపోయి, నిశ్శబ్దంగా తలలు రెండోవైపు తిప్పుకొని నడిచిపోయేవారు. వాళ్ల అందెల రవళిలో రవ్వంత ఒడిదుడుకూ, వాళ్ల కడవల నీళ్లలో రవ్వంత తొట్రుపాటూ, వాళ్ల మనస్సులు దివాణపు టరుగుమీదనే ఉన్నాయని తెలియపరుస్తున్నప్పటికీ.
ఇంతలో సీమదేశాల్లో యుద్ధాన్ని గురించో, చంద్రలోక యాత్రను గురించో, కబుర్లు వస్తాయి. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతారు. వెటకారంగా చిరునవ్వుతూ కరణంగారు ఆఖరిమాట చెప్పడానికి చూస్తూ ఉంటారు. తమ పూర్వులైన వీరుల్లో ఒకరుంటే చాలు, ఈ యుద్ధాలు చిటికెలో తేలిపోయేవని దొరగారు చెప్తారు. కాలికి పసరు పూసుకొని హిమాలయాలకిన్నీ, ఇట్టే చేతులు జాపి కాళ్లెత్తి చంద్రగోళానికిన్నీ, మన పూర్వులు చటుక్కున వెళ్లి, మళ్లీ సాయంకాలానికి ఎలా తిరిగివచ్చేసేవారో సిద్ధాంతిగారు విశదంగా తెలియబరుస్తారు.
రెండో అరుగు మీద పేకాట జరుగుతూ ఉంటుంది.
ఒక్కొక్కప్పుడు వీధి అరుగుల ముందు, తూర్పు నుంచి రాజుగారు పంపిన పుంజుకీ, రాయణింగారి పుంజుకీ, పోట్లాట జరుగుతుంటే, అందరూ చూస్తారు. కౌజుపిట్టలది కూడా.
రాత్రి శాస్త్రిగారి వీధి అరుగు. దానిముందు ఖాళీస్థలంలో పురాణ పఠనం.
కరణం మునసబుల వీధి అరుగులు గ్రామస్థుల నిత్యలౌకిక జీవితానికీ, దివాణం వీధి అరుగు వేడుకలకీ కాలక్షేపానికీ, శాస్త్రిగారి వీధి అరుగు ధర్మచింతనకీ ఆముష్మిక గోష్ఠికీ కేంద్రాలై ఉండేవి.
కాక కుట్టుపని దానయ్య అరుగుండేది. దానిమీద మిషన్ టకటకలాడిస్తూ ఉండేవాడు.
సిద్ధాంతిగారి చిన్న అరుగుండేది. ఇక్కడ ఆయనచేత చెవిటి సుబ్బయ్య– వినిపించకపోయినా న్యూస్‌పేపన్ చదివించుకొనేవాడు.
ఇలాగే ప్రసిద్ధమైన అరుగులు కొన్ని ఉండేవి.
అయితే ఈమధ్య వీధుల్ని వెడల్పు చెయ్యడంలో అరుగులు కొన్ని కుదించుకుపోయాయి.
కొన్ని అరుగులు గదులైపోయాయి. సిద్ధాంతిగారి వీధి అరుగు అటువంటిది. దానిలోకి వచ్చింది దానయ్య కుట్టుమిషన్.
రాయణింగారు చితికిపోవడం వల్ల వారు దూరాలకు వలసపోవడమున్నూ, తరువాత కుమారుని ఉద్యోగానికై పట్టణవాస మేర్పరచుకోవడమున్నూ, దివాణపులోగిలి లోపల కూలి దిగబడిపోయి అరుగుల మీద అందంగా చెక్కిన స్తంభాలు మాత్రం మిగిలిపోయాయి.
కరణంగారు వృద్ధులవడం వల్ల, ఇతర కారణాల వల్ల కుంగిపోయిన గుడారంలాగ అయిపోయి అరుగుమీద చతికిలబడి కూర్చుంటారు. ఇప్పుడు దానిమీద ఆట్టే కచేరీలు జరగడం లేదు.
శాస్త్రిగారు పరమపదించడం వల్ల, వారి కుమారుడు ఇంగ్లీషు చదువుకొని, ఎక్కడికో ఉద్యోగానికి వెళ్లిపోతే ఆ ఇల్లు బోర్డువారు ‘ఎక్వైరు’ చేసి అరుగుల మీద క్లాసుల కోసం గదులు కట్టారు.
మునసబుగారి వీధి అరుగు ఇంకా సందడిగానే ఉంది. అయితే, అక్కడ ఇప్పుడు ఎన్నికలగోలా పార్టీల కోలాహలమున్నూ.
దేవులపల్లి కృష్ణశాస్త్రి
(1897–1980) ‘మా ఊళ్లో వీథి అరుగు’ వ్యాసానికి సంక్షిప్త రూపం ఇది.కృష్ణశాస్త్రి వ్యాసావళిలోని ‘పుష్పలావికలు’ ప్రకరణంలో ఇది ఉంది. కృష్ణపక్షము, ఊర్వశి ఆయన ప్రసిద్ధ రచనలు. సినీగీత రచయితగానూ ప్రముఖులు.
Comments
Please login to add a commentAdd a comment