20 ఏళ్ల కుర్రాడతడు.. మహా అయితే అప్పుడే కెరీర్‌లో ఎదిగే వయస్సది.. కానీ అంత చిన్న వయస్సులోనే అతడు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను అందుకుని పెను సంచలనమే సృష్టించాడు.. ఇంకేముంది..లెక్కలేనంత డబ్బు ఒళ్లో వచ్చి వాలింది.. దీంతో జీవితం కట్టు తప్పింది.. చెప్పే వారు లేక.. వినే ఓపిక లేక.. విచ్చలవిడి వ్యవహార శైలితో అధోగతి పాలయ్యాడు. ఎంతలా అంటే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపి డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టిన చేతులతోనే జైలు ఊచలు లెక్కపెట్టాడు.. ఇంతకీ ఈ దురదృష్టవంతుడెవరో కాదు.. ది గ్రేట్ మహ్మద్ అలీ తర్వాత అంతటి మొనగాడు తనే అని ప్రపంచమంతా చెప్పుకున్న మైక్ టైసన్.
- రంగోల నరేందర్ గౌడ్
చిన్ననాటి జీవితం బాధాకరం..
టైసన్ జీవితాన్ని గమనిస్తే మనకు ఓ సినిమా కథకు కావాల్సినంత సరంజామా దొరుకుతుంది. మైదానంలోనూ, బయట ఇంత హింసాత్మకంగా ప్రవర్తించడానికి కారణం అతడి బాధాకరమైన బాల్యమే. అందరూ ఉన్నా అనాథలాగే పెరిగాడు. తల్లి మద్యానికి బానిస.. దీనికి తోడు స్వేచ్ఛా జీవితం. వ్యభిచార గృహాన్ని నిర్వహించే తండ్రయితే టైసన్‌తో పాటు అతడి తోబుట్టువులకు ఎప్పుడో కానీ కనిపించే వాడు కాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన టైసన్ సహజంగానే ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. దాదాపు రౌడీలా పెరిగాడు. పదేళ్లు రాకముందే స్కూల్‌కు డుమ్మా కొట్టి దొంగతనాలు చే యడం అలవాటు చేసుకున్నాడు. ఈ కారణంగా పలుమార్లు పోలీసులకూ పట్టుబడ్డాడు. చాలాసార్లు వారు ఇతడిని నిర్బంధ శిక్షణ కేంద్రాలకు పంపించారు.
మహ్మద్ అలీ రాకతో..
ఓసారి టైసన్ ఉంటున్న సెంటర్‌ను బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ సందర్శించారు. ఆయన గురించి తెలుసుకున్న టైసన్.. తానూ బాక్సర్‌ను కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమైతే జరిగింది కానీ బాక్సింగ్ గురించి టైసన్‌కు తెలిసింది శూన్యం. అప్పుడు తనతోపాటు అక్కడే ఉంటున్న ఓ బాక్సర్ మార్గదర్శకంగా నిలిచాడు. బయటికి వెళ్లాక వెటరన్ కోచ్ కస్ డి అమటోను కలవమని సలహా ఇచ్చాడు. టైసన్ పంచ్ పవర్‌ను గమనించిన కోచ్ మరో మాట లేకుండా తనతో చేర్చుకున్నాడు.
చాంపియన్ అవతారం..
కోచ్ జిమ్‌లోనే తన శరీరాన్ని ఓ బాక్సర్‌గా మలుచుకున్నాడు. ఓసారి తన ఆటతీరును రింగ్‌లో ప్రదర్శించి బయటకు వస్తున్నప్పుడు కోచ్ అమటో పక్కనున్నతడితో ఓ మాటన్నాడు.. ‘అదిగో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్’ అని. దీనికితోడు 14 ఏళ్ల వయస్సులో ‘నీవో అద్భుత ఫైటర్‌వి’ అని కోచ్ పదేపదే చెప్పే మాటలతో యువ టైసన్ ఎంతగానో ఉత్తేజితుడయ్యేవాడు. అప్పటిదాకా అతడి గురించి ఏ ఒక్కరూ ఒక మంచి మాటైనా చెప్పింది లేదు. కోచ్ మాటల ప్రభావం టైసన్‌పై విశేషంగా పడింది. బాక్సర్ల గురించి పుస్తకాలను టైసన్‌తో అమటో చదివించాడు.
ఎనిమిది సెకన్లలోనే..
1981 జూనియర్ ఒలింపిక్స్ తనకు తొలి మేజర్ టోర్నమెంట్. ఇక్కడే తనపై తనకు ఎంతగానో నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే 15 ఏళ్ల వయస్సులో.. కేవలం ఎనిమిది సెకన్లలో.. ఒకే ఒక్క పంచ్‌కు ప్రత్యర్థిని మట్టి కరిపించి స్వర్ణం సాధించాడు. అయితే అప్పటికే తను విపరీతంగా తాగడం కాకుండా డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు. దీనికి తోడు ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ డిగో మారడోనాతో సమానంగా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉండడంతో ఆ ‘మత్తు’లో మెల్లగా జీవితం కట్టు తప్పసాగింది.
టైసన్ శకం...
టైసన్ కెరీర్‌లో అతి పెద్ద సంచలనం 1986లో నమోదైంది. 20 ఏళ్ల వయస్సులో డిఫెండింగ్ చాంపియన్ ట్రెవర్ బెర్బిక్‌ను మట్టికరిపించి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యుబీసీ)ను గెలుచుకున్నాడు. ఇది బాక్సింగ్ చరిత్రలో అతిపెద్ద విజయంగా విమర్శకులు పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఆరాధ్యుడు మహ్మద్ అలీని ఓడించిన బెర్బిక్‌పై విజయం ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యిందని టైసన్ భావించాడు. ఇక్కడి నుంచి టైసన్ శకం ప్రారంభమైంది. ఎక్కడికెళ్లినా నీరాజనాలు.. లెక్కలేనంత డబ్బుతో టైసన్ పెద్ద సెలబ్రిటీగా మారాడు. కానీ టైసన్ భవిష్యత్‌ను ముందుగానే ఊహించిన కోచ్ డి అమటో మాత్రం తన శిష్యుడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఇది టైసన్‌ను కూడా తీవ్రంగా బాధించింది.
1990లో షాక్..
ఐరన్ మైక్ టైసన్‌గా పేరుతెచ్చుకున్న తనకు 1990లో జీవితంలో కోలుకోలేని షాక్ తగిలింది. టోక్యోలో జేమ్స్ డగ్లస్‌తో పోటీ అది. మహామహులనే ఓడించిన టైసన్‌కు ఇతడొక లెక్కా.. అనే అనుకున్నారంతా. పంటర్లంతా పెద్ద ఎత్తున టైసన్‌పై పందాలు కాసారు. అప్పటికే విందు వినోదాల్లో కూరుకుపోయిన టైసన్ సరైన ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాడు. బౌట్ అనంతర వెలువడిన ఫలితం చూసి ఓ రకంగా ప్రపంచం నిర్ఘాంత పోయింది. జరిగింది నిజమా? కలా? నమ్మలేకపోయారు. ఓటమనేది తెలీని టైసన్‌కు తొలిసారి పరాజయం. ఇక అక్కడి నుంచి జారిపడిన టైసన్ మళ్లీ లేవలేకపోయాడు. ఇవాండర్ హోలీఫీల్డ్‌తో జరిగిన ఫైట్‌లో ఓటమి తట్టుకోలేక చెవి కొరికాడు. బాక్సింగ్ లోపల పని లేకపోవడంతో బయట తన ‘ప్రతాపం’ చూపసాగాడు. వీధి గొడవలు, భార్యతో విడాకులు, రేప్ కేసులు చివరికి జైలుపాలు. జైల్లో అయినా సక్రమంగా ఉన్నాడా అంటే అదీ లేదు. అక్కడ విచ్చలవిడి శృంగారంతో భ్రష్టు పట్టిపోయాడు. ఎంతలా అంటే మామూలు ఎక్సర్‌సైజ్ చేయడానికి కూడా సరైన శక్తి లేనంతగా.. జైల్లోనే ఇస్లాం స్వీకరించాడు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దివాలా తీశాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడాయి. కూతురు మరణం తట్టుకోలేకపోయాడు.
పశ్చాత్తాపం మొదలు...
ఇప్పుడు తన జీవితంపై 47 ఏళ్ల వయస్సులో పశ్చాత్తాపపడుతున్నాడు. అందుకే 2011లో అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టైసన్‌ను చేర్చినప్పుడు తన జీవితంపై ఆశ్చర్యపోయాడు. ‘వెనక్కి తిరిగి చూసుకుంటే అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించింది నేనేనా అని అనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ‘ది అన్‌డిస్‌ప్యూటెడ్ ట్రూత్’ అనే పేరిట ఈ దుర (అ)దృష్టవంతుడు జీవిత చరిత్ర రాస్తున్నాడు.
పతనం ఆరంభం...
టైసన్ ఒక్కో బౌట్‌లో ప్రత్యర్థిపై పిడిగుద్దులు విసురుతూ బాక్సింగ్ రింగ్‌లో అజేయుడుగా నిలుస్తున్నాడు. అప్పటికి దిగ్గజాలుగా పెరుతెచ్చుకున్న జేమ్స్ స్మిత్, మైకేల్ స్పింక్స్, లారీ హోమ్స్, పింక్లోన్ థామస్, టోరీ టక్కర్‌లను అత్యంత సులువుగా ఓడించి ఔరా అనిపించుకున్నాడు. దీంతో విపరీతంగా డబ్బు వచ్చిపడుతోంది. దాన్ని సరైన రీతిలో ఎలా ఖర్చు చేయాలో తెలీకపోవడంతో పాటు ఎక్కడికి వెళుతున్నావు.. ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదా? అని అడిగేవారు లేకపోవడంతో తెగిన గాలిపటంలా మారిపోయాడు. విచ్చలవిడిగా పార్టీలు ఇచ్చేవాడు. ఒక్కోసారి అవి నాన్‌స్టాప్‌గా సాగేవి. ఒక్కో క్లబ్ నుంచి మరో క్లబ్‌కు.. ఒక్కో నగరం నుంచి మరో నగరానికి ఇలా సాగేవి.
డ్రగ్స్ + మందు + మగువ = మైక్ టైసన్
Published Fri, Mar 14 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement