రేపటికి ముందడుగు
సూపర్ సేఫ్ హెల్మెట్
హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం. అంతేకాదు.. గెడ్డం కింద నుంచి ఓ పట్టీని బిగించుకునే మన పాత మోడల్ హెట్మెట్‌లను ప్రమాద సమయాల్లో వెంటనే తొలగించలేకపోయినా ప్రమాదమే! ఈ చిక్కులకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు వోజ్ అనే ఆస్ట్రేలియన్ సంస్థ సరికొత్త డిజైన్‌తో హెల్మెట్‌ను తయారు చేసింది. నిట్టనిలువునా రెండుగా విడిపోయే ఈ ఆర్‌ఎస్ 1.0 హెల్మెట్‌కు పట్టీలేవీ ఉండవు. మన దవడలుండే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బటన్లతో రెండు భాగాలను కలుపుకుంటే చాలు. ప్రమాద సమయాల్లో హెల్మెట్‌ను తొలగించేందుకు పైభాగంలో రెండు స్క్రూలు ఏర్పాటు చేశారు. నోటిభాగంలోని మరో స్క్రూ సాయంతో హెల్మెట్ సైజును మార్చుకోగలగడం మరో సౌలభ్యం.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను సోప్‌తో కడిగేయవచ్చు!
స్మార్ట్‌ఫోన్లు చాలా సున్నితమైనవి. వాటర్ ప్రూఫ్ ఏమాత్రం తడి తగిలినా పాడైతాయి. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లూ ఉన్నా వాటికీ కొన్ని పరిమితులున్నాయి. క్యోసెరా మొబైల్ కంపెనీ డిగ్నో రాఫైర్ పేరుతో తయారు చేసిన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు మాత్రం వీటికి పూర్తిగా భిన్నం. మరక పడిందనుకుంటే దీన్ని నేరుగా నల్లా కింద పెట్టేయవచ్చు. ఎంచక్కా సోపు పెట్టి కడిగేయవచ్చు కూడా. ప్రస్తుతానికి జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు దాదాపు రూ.30 వేలు. ఆండ్రాయిడ్ 5.1 9 (లాలీపాప్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే డిగ్నో రాఫైర్‌లోని ప్రత్యేకమైన స్క్రీన్ తడిగా ఉన్నా పనిచేస్తుంది. దీంట్లో ఉండే స్మార్ట్ సోనిక్ రిసీవర్లు స్పీకర్లలోనూ నీరు చేరకుండా ఉంచుతుంది.
ఫ్రిజ్ ఎలా పనిచేస్తుంది?
తినగ తినగ వేము తియ్యనగు అన్న సామెత మీరు వినే ఉంటారు. దీన్ని కొంచెం మార్చుకుంటే ఫ్రిజ్ ఎలా పనిచేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఫ్రిజ్‌లోపలి గాల్లో ఉండే వేడిని పదేపదే తీసేస్తూపోతే అక్కడ చల్లగా అవుతుందన్నమాట. ఇందుకోసం త్వరగా ఆవిరయ్యే ద్రవం ఒకటి అవసరం. దీన్నే రిఫ్రిజరెంట్ అంటారు. ఫ్రిజ్ వెనుకభాగంలో ఉండే కంప్రెసర్‌లో ఈ రిఫ్రిజరెంట్ ఆవిరిని అధికపీడనంతో ఉంచుతారు. మనం ఫ్రిజ్ స్విచ్ ఆన్ చేయగానే...
1. రిఫ్రిజరెంట్ ఆవిరి ఫ్రిజ్ వెనుకభాగంలో ఉన్న కండెన్సర్ కాయిల్స్ ద్వారా ప్రయాణించడం మొదలవుతుంది.
2. చుట్టుపక్కల ఉండే చల్లటిగాలి కారణంగా కాయిల్‌లోని ఆవిరి కాస్తా ద్రవంగా మారుతుంది.
3. పీడనం ఎక్కువగా ఉండటం వల్ల వేగంగా చల్లబడుతూ ప్రీజర్‌లో ఉండే ఎవాపరేటర్ కాయిల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. రిఫ్రిజరేటర్ లోపలి వేడిని పీల్చుకుంటుంది.
4. ఈ క్రమంలో రిఫ్రిజరెంట్ కాస్తా మళ్లీ ఆవిరిగా మారిపోయి... కంప్రెసర్‌ను చేరుతుంది. ఈ ఐదు దశలు మళ్లీమళ్లీ పునరావృతం కావడం ద్వారా రిఫ్రిజరేటర్‌లోని గాలి క్రమేపీ చల్లగా మారుతుంది.