హిడింబకు ఓ ఆలయం...
తెలుసుకుందాం
అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో, సాహస క్రీడలు జరిగే ప్రదేశాలతో మనాలి గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేసవిలో 14 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు, శీతాకాలంలో 7 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ హిడింబి ఆలయం ఉంది. మహాభారతంలోని పాండవులలోని భీమసేనుని భార్య హిడింబి. ఈమె రాక్షస సంతతికి చెందినది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుని సోదరి అయిన హిడింబి భీముడిని పెళ్లాడింది.
వీరి సంతానం ఘటోత్కచుడు. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న ఈ ఆలయం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఉండి ఎంతో రమణీయంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల గోపురంతో, దారు చెక్కడాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయం. ఈ నాలుగు అంతస్థులలోను, మొదటి మూడు అంతస్థులు చతురస్రాకారంగా ఉండి, దారుఫలకాలతో నిర్మించబడ్డాయి. ఆలయం 24 మీటర్ల ఎత్తు ఉంటుంది కానీ, హిడింబా దేవి విగ్రహం మాత్రం 7.5 సెం.మీ. ఎత్తు మాత్రమే ఉండటం విశేషం.
- బాచి