మరోమారు టెస్ట్ చేయించడం మంచిది... | It's nice to get the test again ... | Sakshi
Sakshi News home page

మరోమారు టెస్ట్ చేయించడం మంచిది...

Published Mon, Apr 11 2016 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

మరోమారు టెస్ట్ చేయించడం మంచిది...

మరోమారు టెస్ట్ చేయించడం మంచిది...

ఫెర్టిలిటీ కౌన్సెలింగ్

 

నా వయసు 29 ఏళ్లు. నేను, నా భార్య సంతానం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఇటీవలే మేమిద్దరమూ వైద్యపరీక్షలు చేయించుకున్నాం. నా భార్యకు అంతా మామూలుగానే ఉందని డాక్టర్లు అన్నారు. నా వీర్యంలో శుక్రకణాలు లేవని చెప్పారు. దాంతో మాకు ఎటూ పాలుపోవడం లేదు. మాకు సంతానం కలిగే మార్గం లేదా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరుడు, హైదరాబాద్
ముందుగా మీరు మరోమారు మీ వీర్య పరీక్ష చేయించండి. అలా మరోసారి చేయించిన వైద్య పరీక్షలోనూ మీకు శుక్రకణాలు లేవని తెలిస్తే, దానికి కారణాలు అన్వేషించాల్సి ఉంటుంది. బహుశా అది మీ ఎండోక్రైన్ గ్రంథుల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనా, వృషణాల పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనా లేదా మీలోని ఏదైనా నాళంలో అడ్డంకుల వల్లనా అన్నది తెలుసుకోవాలి. ఒకవేళ మీ చిన్నతనంలో వృషణం కడుపులోనే ఉండిపోయి, కిందికి జారకపోవడం (అన్‌డిసెండెడ్ టెస్టిస్) సంభవించినా లేదా మీకు చిన్నప్పుడు జననావయవాల దగ్గర ఏదైనా సమస్య వచ్చి, శస్త్రచికిత్స జరిగిందా అన్న విషయాలూ డాక్టర్లకు తెలియజెప్పాలి. ఇలాంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని సమస్యను విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ సమయంలో డాక్టర్లు వృషణాల పరిమాణమూ లాంటి కొలతలూ తీసుకుంటారు. మీలో వేరికోసీల్ వంటి సమస్య ఏదైనా ఉందేమోనని కూడా చూడాల్సి రావచ్చు. అలాగే మీకు కొన్ని రక్తపరీక్షలూ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. మీకు జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్లు తేలితే, అప్పుడు జెనెటిసిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరం కావచ్చు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి ఆ తర్వాత వీర్యసేకరణ కోసం అవసరాన్ని బట్టి పలు ప్రక్రియలను అవలంబిచాల్సి వస్తుంటుంది. అలా వీర్యసేకరణ జరిపాక, అందులోని శుక్రకణాలను ఉపయోగించి ఐసీఎస్‌ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే ప్రక్రియను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో శుక్రకణాన్ని, మీ భార్య అండంలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా మీరు తండ్రి అయ్యే అవకాశం ఉంది. మరోసారి మీ దంపతులిద్దరూ మీ ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి.

 

డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్

 

డర్మటాలజీ కౌన్సెలింగ్

 

నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా ఒక మోస్తరు జడ (మీడియమ్ లెంత్ హెయిర్) ఉంది. నేను హెల్మెట్ వాడుతున్నాను. హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్‌పోజ్ అవుతోంది. నా జుట్టు చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - భవాని, విజయవాడ
మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు సంయుక్తంగా ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ర్పభావం  జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి.

 టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి  రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి.  తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన్న పదార్థాలు ఉండే  ‘హెయిర్ సీరమ్’ రాయండి.  అవి...  డైమిథికోన్  ట్రైజిలోగ్జేన్  విటమిన్ ఈ ఎసిటేట్ అహోబా ఆయిల్   ఆలివ్ ఆయిల్  ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది.

 

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్

 

కిడ్నీ కౌన్సెలింగ్

 

నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా తాతగారు, మా అమ్మగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. మన ఆహారపు అలవాట్లు, డయాబెటిస్, అధిక రక్తపోటు (హైబీపీ)తో పాటు జన్యుపరమైన కారణాలతో కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని విన్నాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు పరిష్కార మార్గాలున్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సుబ్బారావు, గుంటూరు
మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 40 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సెలైంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్‌ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబంలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.


దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రంలో నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.

 

డాక్టర్  ఊర్మిళ ఆనంద్
సీనియర్ నెఫ్రాలజిస్ట్,
యశోద హస్పిటల్స్,
సికింద్రాబాద్

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement