ఇది కీళ్లనొప్పుల కాలం!
చలికాలంలో కీళ్లనొప్పులు మరీ ఎక్కువవుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండాకాలంలోలా ఈ సీజన్‌లో సూర్యరశ్మి ఎక్కువగా తగిలే అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిగ్గా ఎముకలకు కావాల్సిన విటమిన్–డి కూడా తగ్గడం లాంటి అనేక కారణాలు దీనికి దోహదపడతాయి. ఆ నొప్పులు తగ్గాలంటే కొన్ని మార్గాలివి...
ఈ సీజన్‌లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్‌డోర్ వ్యాయామాలు చేయండి. శీతకాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. ∙ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. ∙ఇన్‌డోర్ స్విమ్మింగ్ ∙ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్‌కు డాన్స్ చేయడం. ∙ఆఫీసులో లేదా మీరు వెళ్లిన చోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. ∙టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం.
నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలు...
⇔ ఈ సీజన్‌లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి.
⇔ ఈ సీజన్‌లో రూమ్ హీటర్లు వాడే సౌకర్యం ఉన్నవారు తమకు తెలియకుండానే శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. అందుకే ఈ సీజన్‌లో అందరూ నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
⇔ మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్‌లో చాలా మంచిది. అయితే స్విమ్మింగ్‌పూల్‌లో బాగా చల్లటి నీళ్లుంటే మళ్లీ అది నొప్పులను పెంచేందుకే దోహదం చేయవచ్చు. అందుకే ఒకింత వేడిగా ఉండే నీళ్లు ఉండే పూల్స్‌లో ఈత మంచిది. పైగా ఆ వేడినీటి ప్రభావంతో (వార్మ్ బాత్ కారణంగా) కీళ్లనొప్పులూ బాగా తగ్గుతాయి. అయితే ఈత తర్వాత నేరుగా చల్లటి వాతావరణంలో వెళ్లకండి. పూల్ నుంచి బయటకు వచ్చాక ముందుగా కాసేపు బయటివాతావరణానికి మిమ్మల్ని మీరు అడ్జెస్ట్ చేసుకోండి. ఆ తర్వాతే బయటి వాతావరణంలోకి ప్రవేశించండి.
⇔ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడండి. ఒకవేళ మీరు ఆస్టియో ఆర్థరైటిస్ రోగులైతే చలి మీ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు వాడండి. అలాగే ఆహారంలో అది ఎక్కువగా ఉండే వెన్న, పాలు వంటి పదార్థాలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోండి.
⇔ ఈ సీజన్‌లో మీకు దెబ్బలు తగలకుండా చూసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు మంచి షూస్ ధరించడం, వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్ వంటివి ధరించండి.
⇔ ఈ సూచనలు పాటిస్తున్నా మీ కీళ్ల నొప్పులు ఎంతకూ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడాలి.
ఇలా ఈ సీజన్‌లో కీళ్లనొప్పుల నుంచి, కండరాల నొప్పుల నుంచి వీలైనంత రక్షణ పొందవచ్చు.