22 ఏళ్ళ చేత్నా గృద్ధా మల్లిక్– కోల్‌కతా స్ట్రాండ్ రోడ్లో ఉండే కూలిపోతున్న ఇంట్లో, తన కుటుంబంతో పాటు ఉంటుంది. పక్కనే ‘నిమ్తలా ఘాట్’ ఉండటం వల్ల, ఇంటిముందు జరిగే శవయాత్రలను చూస్తూనే పెరుగుతుంది. ‘నేతితో తయారవుతున్న మిఠాయిల వాసనా, కాలుతున్న శవాల దుర్గంధం మిళితమై, మమ్మల్ని చుట్టు ముడతాయి’ అంటుంది. ఆమె తండ్రయిన 88 ఏళ్ళ ఫణిభూషణ్, ‘451 మందిని ఉరి తీసిన’ తలారి. ‘భారత్, భారత్ అవక ముందే– క్రీ.పూ. 420 ఏళ్ళ నుంచీ’ ఆ వృత్తి చేపట్టిన కుటుంబం వారిది. ‘తలారి కిరాయి హంతకుడు కాడు. దేశం కోసం ప్రాణం తీసే బాధ్యతగల ఆఫీసర్’ అంటాడు ఫణిభూషణ్. అయితే, దేశంలో ఉరితీతలు తగ్గిపోయినప్పుడు అతని ఆదాయమూ పోతుంది.
మలయాళం నుండి ఇంగ్లిష్ లోకి అనువదించబడిన ‘హాంగ్‌వుమన్’ నవల్లో కనపడే సంఘటనలూ, పాత్రలూ కూడా కోల్‌కతావే. తనకి పడిన ఉరి శిక్షకని జతిందర్‌నాథ్ బెనర్జీ పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీ నిరాకరించబడ్డంతో, నవల మొదలవుతుంది. ఫణిభూషణ్ ముసలివాడైపోయినందువల్ల బెనర్జీని ఉరి తీయడానికి అతను ఇక పనికి రాడని ప్రభుత్వం నిర్ధారిస్తుంది. కుటుంబ కలహాల్లో అవిటివాడైన ఫణిభూషణ్ కొడుకు రామూ, వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోలేడు కనుక ఆ బాధ్యత చేత్నా చేపట్టాలంటూ, న్యూస్ చానల్లో పని చేసే మిత్రా– పానెల్ డిబేట్లు పెడతాడు. ‘భారతదేశానికీ, సమస్త లోకానికీ కూడా చేత్నా– స్త్రీ శక్తికీ, ఆత్మ గౌరవానికీ చిహ్నం’ అన్న ప్రచారం మొదలవుతుంది. కూతురు పొందుతున్న ఖ్యాతిని తండ్రి డబ్బు చేసుకుంటాడు. ఆమె షోలో ఏమి మాట్లాడాలో తనే నిర్ణయిస్తాడు. చేత్నాను ఉపయోగించుకుంటూ పైకి రావాలనుకున్న మిత్రా,‘చేతూ, యీ షో నాకు గౌరవం తెచ్చిపెట్టేది. ఇలాగే చెప్పాలి’ అని పోరుతాడు. చేత్నా మిత్రాతో ప్రేమలో పడి, ‘యీ ప్రేమ నా మెడ చుట్టూ– మూడవ వెన్నుపూసకీ, నాలుగవ దానికీ మధ్య బిగుసుకుంటున్న ఉచ్చు’ అనుకుంటుంది. ఒకసారి ‘రామూ దా’ ముందు, మిత్రా నవ్వుతూ నిలుచుని ఫొటోలు తీసుకుంటుండగా చూసి, అతని కెమెరాను పగలగొడుతుంది.
‘బెనర్జీని ఉరి తీస్తే అతని శరీరపు బరువు నా వేళ్ళనుండి శాశ్వతంగా వేళ్ళాడుతుంది’ అనే ఆలోచనలు చేత్నాను చుట్టుముడతాయి. కానీ, ‘ఇతరులతో మాట్లాడుతూనే, నా దుపట్టా కొసతో ఉచ్చు చుట్టానని గుర్తించగలిగేదాన్ని. దుపట్టా పాతదై, పిగిలిపోతున్నా– ఉచ్చు మాత్రం పరిపూర్ణంగా పడేది. మా కుటుంబాల్లో పుట్టిన శిశువులు కూడా నేర్చుకునే మొదటి పనే ఇది కదా!’ అన్న తన నేపథ్యం గుర్తొచ్చి, తన సహజమైన పిరికితనాన్ని వదిలించుకుంటుంది. తండ్రి దాష్టీకం, ప్రేమికుడి దోపిడీతనం జ్ఞాపకానికి తెచ్చుకుని– తన తొలి ఉరితీతను అద్భుతంగా నిర్వహిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ‘తలారిస్త్రీ’ అయి, ‘ఇన్నాళ్ళూ జీవితం, భూమిపైన ఊగుతూ ఉండేది. క్షణమాత్రంలో తాడు తెగింది. నేనూ ప్రదర్శనకి పెట్టబడ్డాను’ అంటుంది.
రచయిత్రి కె.ఆర్. మీరా చూపే యీ లోకంలో ప్రస్ఫుటంగా కనబడేది కటిక దారిద్య్రం. మల్లిక్ పూర్వీకుల సాహసపు ఉరితీతలూ, సమకాలీన సంఘటనలూ ఉన్న ఈ నవల, ‘నిజమైన బాధితులు ఎవరు? నేరస్తులా లేక తరాలకొద్దీ వారిని ఉరి తీసిన మల్లిక్‌లా?’ అన్న సందేహాలను కలిగిస్తుంది. మరొకరి ప్రాణం తీయడం వల్ల చేత్నా ఎదగడం అన్నది కలవర పెట్టే వైరుధ్యం. జె.దేవిక ఇంగ్లిష్‌లోకి అనువదించిన యీ నవల– తమ వృత్తిని ఒక కళగా భావిస్తూ, గర్వించే తలారుల చీకటి లోకంలోకి పాఠకులను తీసికెళ్తుంది. పుస్తకంలో కనపడే స్త్రీవాదంలో కర్కశత్వం ఉండదు. ఆంగ్ల నవలను పెంగ్విన్, 2016లో ప్రచురించింది. తొలి ప్రచురణ 2012లో.
వి. కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment