ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు... ఎంతోమంది పేదవారికి విద్యను ప్రసాదించే దేవాలయాలు... ఆ దేవాలయాల పరిస్థితి ఎంత బాగుంటే... విద్యావిధానం కూడా అంతే బాగుంటుంది.... ఇందుకు ప్రభుత్వాలే కాదు అందరూ బాధ్యత తీసుకోవాలి... ఝార్‌ఖండ్ హజీరాబాఘ్ పట్వాడీ అంగన్‌వాడీ పరిస్థితి దయనీయంగా ఉంది... ఒక అధికారి దత్తత తీసుకున్నారు... ఇప్పుడు అది అందాలను సంతరించుకుంది...
గరిమా సింగ్ ఆలిండియాలో 2015లో యుపిఎస్‌సిలో 55వ ర్యాంకు సాధించారు. అంతకు ముందు ఆమె ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు మహిళల తక్షణ రక్షణ కోసం ఓ రెస్కూ ఫోన్ నంబరును ఏర్పాటు చేశారు. మహిళా రక్షణ టీమ్‌లో తానూ సభ్యులుగా ఉన్నారు. మోహన్‌లాల్‌గంజ్ రేప్ కేసును పరిష్కరించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచే ఆమె ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన మంచి పనులతో తన పరిధిలో ఉన్న మహిళలకు, అణగారిన వర్గాల వారికి రోల్‌మోడల్‌గా నిలిచారు గరిమ సింగ్.
గరిమ... ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌గా మారారు. కలెక్టరుగా ఆవిడ విధానాలు చాలా కొత్తగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. 2016లో కలెక్టరుగా ఆవిడ నిర్వహించిన మొదటి బాధ్యత ఝార్‌ఖండ్ హజీరాబాఘ్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో అదనపు బాధ్యతలు. ‘‘ఈ బాధ్యత... పిల్లలకు విద్యావకాశాలు మెరుగు పరచడానికి నాకు ఎంతో ఉపయోగపడింది. అది నాకు మరపురాని సంఘటన’’ అని చెబుతారు గరిమ సింగ్. అక్కడి స్థానిక అంగన్‌వాడీలో పరిస్థితులు హీనంగా ఉండటం చూసి, గరిమ వెంటనే పాఠశాల పునరుద్ధరణకు నడుం బిగించారు.
‘‘విద్యార్థులు తమ తొలి తరగతుల్లో చదువుకున్న అంశాలు వారి మెదడులో నిలిచిపోయేలా ఉండాలి. విద్యా విధానం కూడా అందుకు అనువుగా రూపొందాలి’’ అంటారు గరిమ. మట్వారీ మస్జిద్ రోడ్‌లో ఉన్న అంగన్‌వాడీని తాను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలను అభివృద్ధిచేసి, జిల్లాకే ఆ పాఠశాలను ఆదర్శంగా నిలపాలనుకున్నారు. తాను దాచుకున్న డబ్బులలో నుంచి ఏభై వేల రూపాయలు ఖర్చు చేశారు. బిల్డింVŠ కి రంగులు వేయించి, కొత్తగా తయారుచేశారు. అక్షరమాలను గోడల మీద వేసి, గుమ్మంలోని పెద్ద హోర్డింగ్ పెట్టారు. ప్రీ స్కూల్‌కి అవసరమైన చార్టులు, బ్లాకులు, బొమ్మలు కొని ఇచ్చారు. వీటి ద్వారా పిల్లలు అన్ని విషయాలు బాగా తెలుసుకుంటారంటారు గరిమ. ఊగే గుర్రపు బొమ్మను కూడా ఇచ్చారు.
‘‘ప్రీస్కూల్ పిల్లలకు గుర్రం మీద కూర్చుని ఊగుతూ విద్య నేర్చుకోవడం సరదాగా ఉంటుంది కదా’’ అంటారామె. ‘మట్వారీ కేంద్ర పరిస్థితి అస్సలు బాగాలేదు. చదువుకునే ప్రదేశం ప్రశాంతంగా, అందంగా ఉండకపోతే, పిల్లలు చదవడానికి ఇష్టపడరు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు... వంటి వారు అంగన్‌వాడీలను దత్తత తీసుకుంటే బాగుంటుంది’ అంటారు గరిమ. ఈ సంవత్సరం మార్చినాటికి మొత్తం 50 అంగన్‌వాడీలను బాగుచేసే పనిలో ఉన్నారు గరిమ. ఇప్పుడు మట్వారీ అంగన్‌వాడీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
కలెక్టరు చేతుల మీదుగా ప్రారంభోత్సవాని సిద్ధంగా ఉంది. ఈ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు వారి విద్యాభ్యాసం మరపురానిదిగా మిగిలిపోతుంది అంటున్నారు గరిమసింగ్. గరిమ సింగ్ వంటి ఉన్నతాధికారి పూనుకోవడంతో ఒక జిల్లాలోని అంగన్‌వాడీలన్నీ నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. మరింతమంది అధికారులు ఇలాగే ముందుకు వస్తే, మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment