పెద్దలకు ప్రమాదాలు... ‘నవ’ నివారణలు
ఏజింగ్ ప్రక్రియ చాలా సాధారణం. వయసు పెరుగుతూ పెద్దవారు అవుతున్న కొద్దీ కొన్ని అనర్థాలు చోటు చేసుకోవడం జరుగుతుంటుంది. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ కింద పేర్కొన్న కొన్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. వాళ్లలో చోటు చేసుకునే ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలివి...
అకస్మాత్తుగా పడిపోవడం: వయసు పెరుగుతున్న కొద్దీ అకస్మాత్తుగా పడిపోవడం చాలా సాధారణం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని... పెద్ద వయసువారిలో సాధారణంగా పాదాల్లో స్పర్శ తగ్గుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ మజిల్ మాస్ కూడా తగ్గుతుంది. దాంతో కండరాల్లోని శక్తి కూడా క్షీణిస్తుంటుంది మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలో కొన్ని మార్పులు రావడం వల్ల పడిపోవడం జరగవచ్చు.
చూపు, వినికిడి శక్తి తగ్గడం: వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించడం, వినికిడి శక్తి క్షీణించడం వంటివి చాలా సాధారణం. వయసు పెరుగుతున్న కొద్దీ గ్లకోమా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది నిశ్శబ్దంగా చూపును హరించి, అంధత్వాన్ని తెచ్చిపెడుతుంది. ఇక డయాబెటిస్ వంటి సమస్య పెద్దల్లో ఉండే అవకాశం ఎక్కువ. దీని వల్ల డయాబెటిక్ రెటినోపతి సమస్య వచ్చి అది క్రమంగా అంధత్వానికి దారితీయవచ్చు. ఇక కొందరిలో లోపలి చెవి సమస్య వల్ల కళ్లు తిరిగినట్లుగా అవుతుంది. చెవి లోపలి సమస్య వల్ల ఒక్కోసారి కళ్లు తిరిగినట్లుగా అయిపోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు.
అకస్మాత్తుగా స్పృహ తప్పడం: సింకోప్: కొంతమంది అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతూ, చూపు తాత్కాలికంగా మసకబారుతూ, ఒకేసారి ముఖంలో రక్తపుచుక్కలేనట్లుగా పాలిపోతారు. శరీరం చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. దాంతో మనిషి అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఒక్కోసారి మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని సింకోప్ అంటారు. మానసికంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మనకు అయిష్టం కలిగించే అంశాలను చూసినప్పుడు (ఎవరైనా గాయపడటం, ఎవరికైనా రక్తస్రావం అవుతుండటం, ఇంకెవరైనా తీవ్రమైన నొప్పి/వేదనతో బాధపడటం వంటి అన్‌ప్లెజెంట్ విజువల్ స్టిములై వల్ల) ఇలా జరగవచ్చు.
బీపీ పడిపోవడం: పోశ్చరల్ హైపోటెన్షన్ (లో బీపీ): ఇది అకస్మాత్తుగా బీపీ తగ్గిపోయే పరిస్థితి. సాధారణంగా దీనికి ముందు శరీరంలోని ద్రవాలు, ఖనిజాల పాళ్లు తగ్గడం, ఏదైనా మందు/ఔషధం తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి మనం కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు బీపీ అకస్మాత్తుగా పడిపోవచ్చు. ఇలా పడిపోవడం అన్నది 20 హెచ్‌జీ/ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే మెదడుకు చేరాల్సిన రక్తం అకస్మాత్తుగా తగ్గడం వల్ల పడిపోవడం జరగవచ్చు నిలబడి మూత్రవిసర్జన చేసే సమయంలో లేదా అకస్మాత్తుగా దగ్గు తెర కమ్మి ఒక్కోసారి బీపీ అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంటుంది.
పక్షవాతంతో పాటు ఇతర నాడీ సమస్యలు: ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ): ఒక్కోసారి కొందరిలో చాలా తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఇలాంటి కండిషన్‌ను వైద్య పరిభాషలో ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు.
ఫిట్స్: కొందరిలో ఒక్కోసారి ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల పడిపోవడం జరగవచ్చు.
పార్కిన్‌సన్ డిసీజ్ : ఈ వ్యాధి ఉన్నవారిలో పడిపోవడం అన్నది శరీరం సరైన బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో శరీర కదలికలు మందగించడం వల్ల పడిపోవడం జరగవచ్చు. వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమవుతాయి. మన శరీరంలోని సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాల పాళ్లు, చక్కెర పాళ్లు తగ్గిపోయినందున పెద్దలు పడిపోయే ప్రమాదం ఉంది.
పెద్దల కోసం నవ సూచనలు...
1. వయసు పెరుగుతున్న వారి మెడికల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారిని క్రమం తప్పకుండా ఒక ఫిజీషియన్‌కు చూపిస్తూ ఉండటం ద్వారా ఆ వయసుకు వచ్చే రుగ్మతలను గుర్తించి, అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది.
2. పెద్ద వయసు వారు అకస్మాత్తుగా కుర్చీ నుంచి నిటారుగా నిలబడటం లేదా పడక నుంచి ఠక్కున లేవడం సరికాదు. పడుకున్న వారు లేవాల్సి వస్తే పక్కలో మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ లేచి కూర్చుని... ఆ తర్వాత మెల్లగా నించోవాలి. అలాగే కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిల్చోవాలి.
3. వయసు పైబడిన వారికి న్యూరలాజికల్ కారణాలు ఏవైనా ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా సరిదిద్దుకోవాలి.
4. పెద్ద వయసు వారు తమకు అవసరమైన ఉపకరణం... అంటే వాకర్ / చేతికర్ర (వాకింగ్ స్టిక్) / కళ్లజోడు వంటి ఉపకరణాలు వాడుకోవాలి. ఏదైనా కారణాల వల్ల వాటిని మరచిపోయినా వెంటనే తెప్పించుకోవాలి.
5. మంచి పోషకాహారం తీసుకోవడం, వాకింగ్ వంటి వ్యాయామాలు అవసరం.
6. నాన్‌స్టిక్ మ్యాట్స్ వాడటం.
7. ఘర్షణ (ఫ్రిక్షన్) ఎక్కువగా ఉంటే ఫ్లోరింగ్ వేయించడంతో పాటు కాలుజారడానికి ఆస్కారం ఇవ్వని కార్పెట్స్ పరవడం.
8. టాయిలెట్స్, బాత్‌రూమ్స్‌లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్‌రూమ్ బయట కాలుజారకుండా మ్యాట్స్ వాడటం
9. వాళ్లతో ఎప్పుడూ ఎవరో ఒకరు మాట్లాడుతుండటం అవసరం. ఇటీవల ఇంట్లోని పిల్లలంతా చదువులు, ఉద్యోగాలు, వ్యాపకాల కారణంగా బయటకు వెళ్లిన సందర్భాల్లో పెద్దలు మాత్రమే ఉండటం వల్ల మానసికంగా వాళ్లకు ‘ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్’ వంటివీ వచ్చే అవకాశం ఉన్నందున వాళ్లతో నిత్యం కమ్యూనికేషన్‌లో ఉండటం అవసరం.
డాక్టర్ బొల్లినేని భాస్కరరావు
కార్టియో థొరాసిక్ సర్జన్ - మేనేజింగ్ డైరక్టర్
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్