ముంబైలో అణుబాంబు పేలుణ్ణి సైఫ్‌ అడ్డుకున్నాడా..! | Scared Games Second Part Special Story | Sakshi
Sakshi News home page

ముంబైలో అణుబాంబు పేలుణ్ణి సైఫ్‌ అడ్డుకున్నాడా..!

Published Sat, Aug 24 2019 7:04 AM | Last Updated on Sat, Aug 24 2019 10:26 AM

Scared Games Second Part Special Story - Sakshi

క్రైమ్, పాలిటిక్స్, రిలీజియన్, టెర్రరిజంల కాక్‌టెయిల్‌ సేక్రెడ్‌ గేమ్స్‌–2

సాత్వికత రావాలంటే తామస చర్య తప్పదేమో! యుద్ధం తర్వాతే కదా.. ప్రశాంతత ఏలుతుంది! నేటి భారతం .. కలియుగ విషబీజమని నమ్మి.. దీని గర్భాన్ని పేల్చి..సత్యయుగానికి పురుడు పోయాలని రాసిన కథే..సేక్రెడ్‌ గేమ్స్‌–2..

‘‘ఇండియాను నాశనం చేయాలని పాకిస్తాన్‌... కక్ష్య తీర్చుకునే ప్రయత్నంలో ఇండియా.. జోక్యం చేసుకోవాలని అమెరికా.. ఆ జోక్యాన్ని సహించని చైనా... ఇదంతా చూస్తూ ఊరక ఉండని రష్యా.. ఇలా అన్ని దేశాలు పిచ్చిపట్టిన కుక్కల్లా కాట్లాటకు దిగుతాయి. ప్రపంచం ముగిసిపోతుంది. అప్పుడు కొత్తగా ఇంకో లోకం ఏర్పడుతుంది. అదే సత్యయుగం. ఆ కాలం తర్వగా రావాలంటే ఈ కాలం త్వరగా ముగిసిపోవాలి. దానికి నువ్వే కర్తవు.. ’’ గురూజీ తన శిష్యుడితో చెప్పిన మాట.

సేక్రెడ్‌ గేమ్స్‌ థీమ్‌ కూడా ఇదే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ అంతా దీనిచుట్టే తిరుగుతుంది. గతానికి, వర్తమానానికి మారుతూ సాగే ఆ కథ క్లుప్తంగా ఇక్కడ..
బాంబ్‌ పేలుళ్లతో ముంబై భూస్థాపితం కాబోతోంది.. ముంబైని కాపాడమని మాఫియా డాన్‌ గణేష్‌ గైతొండే (నవాజుద్దీన్‌ సిద్దిఖీ) ఇన్‌స్పెక్టర్‌ సర్తాజ్‌ (సైఫ్‌ అలీ ఖాన్‌)కు చెప్తాడు. ముందు అసలు గైతొండేను పట్టుకుంటే డొంక కదులుతుందని బంకర్‌లో దాక్కున్న గైతొండేని అరెస్ట్‌ చేయబోతాడు సర్తాజ్‌. పట్టుబడడం ఇష్టం లేని గైతొండే తనను తాను కాల్చుకుంటాడు తుపాకితో. ఇక్కడితో ఫస్ట్‌ సీజన్‌ ఎండ్‌ అవుతుంది.

సెకండ్‌ సీజన్‌లో..
ఆత్మహత్యా యత్నం చేసిన గైతోండే కెన్యాలో ప్రత్యక్షమవుతాడు. అతణ్ణి అక్కడికి తీసుకెళ్లింది ఎవరో కాదు రా ఏజెంట్‌ కుసుమ్‌ దేవి యాదవ్‌ (అమృతాసుభాష్‌) అని సెకండ్‌ సీజన్‌ ప్రారంభంలోనే తెలుస్తుంది. గైతొండేని పావుగా ఉపయోగించి ముంబైలో పేలుళ్లకు కుట్ర పన్నుతున్నదెవరో తెలుసుకోవడానికి ఆమె అలా చేస్తుంది. కెన్యాలో డ్రగ్స్, వెపన్స్‌ వ్యాపారంలోకి గైతొండే అడుగుపెట్టేలా చేస్తుంది కుసుమ్‌ దేవి యాదవ్‌. ఆ వ్యాపారం ద్వారా మళ్లీ ఇండియాతో సంబంధాలు పెంచుకుంటాడు గైతొండే. ఆ సమయంలోనే అతని పార్ట్‌నర్‌ త్రివేది.. అతణ్ణి క్రొయేషియాలో ఉన్న గురుజీ (పంకజ్‌ త్రిపాఠీ)దగ్గరకు తీసుకెళ్తాడు.

ఆ గురుజీ తనను తాను అవతార పురుషుడిగా భావిస్తుండడమే కాక తన అనుయాయులనూ నమ్మిస్తూంటాడు. తన దగ్గరున్న కాలగ్రం«థంలోని బోధనలతో గైతొండే మనసులో తండ్రిగా స్థానం సంపాదించుకుంటాడు. తను ఏం చెబితే అదే నిజమని గైతొండే విశ్వసించేటట్టు తయారు చేసుకుంటాడు గురూజీ. గైతొండే కూడా గురుజీ సాంగత్యంలో ప్రశాంతతను ఆస్వాదిస్తుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఆశ్రమాన్ని కన్‌ఫెషన్‌ బాక్స్‌లా భావిస్తుంటాడు.

 సేక్రెడ్‌ గేమ్స్‌–2లోని నటీనటులు
సర్తాజ్‌ సింగ్‌..
తన తండ్రి కానిస్టేబుల్‌ దిల్‌బాఘ్‌సింగ్‌కు గురూజీతో, గైతొండేతో లింక్స్‌ ఉన్నట్టు తెలుస్తుంది ఇన్‌స్పెక్టర్‌ సర్తాజ్‌సింగ్‌కు. అసలు ఆ గురూజీ ఎవరో తెలుసుకోవడానికి ముంబైలో ఉన్న ఆశ్రమానికి వెళ్తాడు సర్తాజ్‌. అక్కడే గురూజీ అనుంగు శిష్యురాలైన బత్యా (కల్కి కొచ్లిన్‌)తో స్నేహమేర్పడుతుంది. ఆ బోధనలకు అతనూ ఆకర్షితుడవుతాడు. తన జీవితంలోని విషాదాలన్నిటికీ అక్కడ సాంత్వన పొందుతూంటాడు. అయితే అప్పటికే గురూజీ చనిపోయి ఉంటాడు.

గురూజీ ఎలా చనిపోయాడో తెలుసుకునే ముందు అసలు దిల్‌బాఘ్‌ సింగ్‌కి గైతొండే, గురూజీలతో ఉన్న సంబంధం గురించి..దిల్‌బాఘ్‌ సింగ్‌... గురూజీని గుడ్డిగా అనుసరించే అనుచరుల్లో ఒకడిగా ఉండడమే కాక సత్యయుగాన్ని తీసుకురావాల్సిన గురూజీ బాధ్యతల్లో పాలుపంచుకునే భారాన్నీ మోస్తూంటాడు. గైతొండేకు గురూజీని పరిచయం చేయడమే దిల్‌బాఘ్‌ భుజాల మీదున్న భారం. ఒక సందర్భంలో గైతొండేను రక్షిస్తాడు దిల్‌బాఘ్‌. కానుకల ద్వారా ఆ కృతజ్ఞతను తీర్చుకోవాలనుకుంటాడు గైతొండే. ప్రత్యుపకారం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అతని స్థితి చూసి.. అతణ్ణి గురూజీకి పరిచయం చేయాల్సిన కరెక్ట్‌ టైమ్‌ ఇదేనని గ్రహిస్తాడు దిల్‌బాఘ్‌. ‘‘తిరిగి నువ్వు నాకు సాయం చేయాల్సిన పనేంలేదు కాని నేను దేవుడిగా భావిస్తున్న గురూజీని ఒకసారి కలువు చాలు’’ అని చెప్తాడు గైతొండేతో. అలా మొదటిసారి గురూజీ గురించి తెలుసుకుంటాడు గైతొండే.

గురూజీ మరణం..
‘‘అహం బ్రహ్మాస్మి’’ అంటూ మార్దవ స్వరంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న గురూజీ మెదడు ఒక క్రౌర్యమని తెలుసుకున్న గైతొండే హతాశుడవుతాడు. తనను అడ్డం పెట్టుకొని టెర్రరిస్ట్‌ సంస్థలతో కలిసి ముంబైని భూస్థాపితం చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడని అర్థమై గురూజీని చంపేస్తాడు గైతొండే.

వర్తమానంలో..
అలా గురూజీ మరణించిన తర్వాతే ఆ ఆశ్రమానికి వస్తాడు సర్తాజ్‌. అప్పటికే అంటే అతని టీన్స్‌లోనే సర్తాజ్‌ తండ్రీ చనిపోతాడు. ఆడియో ద్వారా, బత్యా ద్వారా గురూజీ ఉపన్యాసాలతో ప్రభావితుడై ఆ భావజాలంలో మునగబోతున్న సర్తాజ్‌కు ఒకరోజు.. గురూజీ కలలు కన్న సత్యయుగం గురించి చెప్తుంది బత్యా. దానికోసం వేసిన ముంబై పేలుళ్ల పథకానికీ అతని సహాయం అడుగుతుంది. యాజ్‌యూజువల్‌గా షాక్‌ అవుతాడు సర్తాజ్‌. ‘‘మీరంతా ఒక పిచ్చిలోకంలో బతుకుతున్నారు’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు. కాని ముంబై పేలుళ్ల కుట్రను భగ్నం చేయాలంటే బత్యాతో స్నేహం నటించాలని మళ్లీ ఆశ్రమానికి వెళ్తాడు సర్తాజ్‌. ఈలోపు గురూజీని చంపేసిన గైతొండేని పట్టుకోవాలని ఆశ్రమంలోని వారికి పురమాయిస్తుంది బత్యా. జోజో అనే జూనియాక్టర్స్‌ సప్లయర్, బ్రోతల్‌ హౌజ్‌ ఓనర్‌ను ఎరగా వేసి గైతొండేను పట్టుకునే ప్రయత్నం మొదలుపెడ్తారు వాళ్లు. అది తెలుసుకున్న గైతొండే జోజోను చంపేస్తాడు. ఇటువైపు సర్తాజ్‌ కూడా బత్యాను తుపాకితో కాల్చి.. ఆశ్రమంలోని కాలగ్రంథాన్ని తీసుకెళ్లిపోతాడు.

అప్పటికే..
ముంబై నడి బొడ్డున ఉన్న ఓ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లో న్యూక్లియర్‌ బాంబ్‌ను సెట్‌చేసి పెడ్తాడు పాకిస్తాన్‌ ఏజెంట్‌ షాహిద్‌ ఖాన్‌. అతను ఎవరో కాదు సర్తాజ్‌ పెద్దమ్మ కొడుకే. ఇండియా, పాకిస్తాన్‌ విభజన సమయంలో లాహోర్‌ నుంచి ఇండియాకు వస్తూన్నప్పుడు బార్డర్‌లో సర్తాజ్‌ పెద్దమ్మను కిడ్నాప్‌ చేసి లాహోర్‌కే తీసుకెళ్లిపోతారు ముస్లింలు. ఈ కుటుంబం మళ్లీ లాహోర్‌కు వెళ్లి.. ఆమెను వెదికే పరిస్థితి ఉండదు. దాంతో ఆమె అక్కడే పాకిస్తాన్‌లోనే ఉండిపోయి ముస్లిం వ్యక్తికే భార్య అయి.. షాహిద్‌ఖాన్‌కు తల్లి అవుతుంది. ఈ విషయం ఇటు సర్తాజ్‌కు, అటు షాహిద్‌ ఖాన్‌కూ తెలియదు. ఇక బాంబు సంగతికి వస్తే.. గురూజీ ఆధ్వర్యంలో కొందరు రాజకీయ నేతలు, పోలీస్‌ అధికారుల అండదండలతో తయారైన ఆ న్యూక్లియర్‌ బాంబు .. హిరోషిమాను పేల్చిన అణుబాంబు కన్నా అరవై రెట్ల అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఆ బాంబు సమాచారం తెలిసిన వెంటనే ఆ స్థలానికి వెళ్లిన పోలీసు అధికారుల మీద కాల్పులు జరుపుతాడు అక్కడే పొంచి ఉన్న షాహిద్‌ ఖాన్‌. ఈలోపు కాల గ్రంథంతో అక్కడికి చేరుకుంటాడు సర్తాజ్‌. బాంబ్‌ను నిర్వీర్యం చేసే సైంటిస్ట్‌ ఆ పాస్‌వర్డ్‌ ప్యాటర్న్‌ కనుక్కోలేక ఉన్న అయిదు ఎటెంప్ట్స్‌లో రెండిటిని వృథా చేస్తుంది. అది పేలడానికి ఎనిమిది నిమిషాల టైమే ఉంటుంది. షాహిద్‌ ఖాన్‌ను పట్టుకొని టార్చర్‌ పెట్టినా పాస్‌వర్డ్‌ చెప్పడు. ఆగ్రహావేశంలో అతణ్ణి కాల్చేస్తాడు సర్తాజ్‌. ఇంక బాంబ్‌ను నిర్వీర్యం చేయడం అసాధ్యమని అక్కడినుంచి వెళ్లిపోతారంతా. సర్తాజ్‌ మాత్రం అక్కడే ఉండి ఆ కాలగ్రంథంలోని ప్యాటర్న్స్‌తో ట్రై చేస్తూంటాడు. చివరి ఎటెంప్ట్‌తో సెకండ్‌ సీజన్‌ ఎండ్‌ అవుతుంది. ఈ ఎండ్‌లెస్‌ ఎండ్‌ మూడో సీజన్‌ ఉందేమోనన్న క్లూనిస్తోంది కాని ఉంటుందన్నట్టుగానైతే ప్రకటించలేదు దర్శక నిర్మాతలు.

ఇంతకన్నా ఏం కావాలి?
స్టార్స్‌తో నేనెప్పుడూ వర్క్‌ చేయలేదు. ఇదే ఫస్ట్‌ టైమ్‌. సైఫ్‌ చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు.. ప్రతి విషయాన్ని శ్రద్ధగా విని అంతే శ్రద్ధతో ఎక్స్‌ప్రెస్‌ చేస్తాడు. ఒక డైరెక్టర్‌కి ఇంతకన్నా ఏం కావాలి? దాంతో అతణ్ణి డైరెక్ట్‌ చేయడం డే వన్‌ నుంచే నాకు ఈజీ అయిపోయింది. సెట్స్‌లో పాలిటిక్స్‌ గురించి డిస్కస్‌ చేసేవాడు.. పాత్రలో ఇమిడిపోవడానికి.
– నీరజ్‌ ఘేవాన్‌ (మసాన్‌ ఫేం)..సేక్రెడ్‌ గేమ్స్‌2లో సైఫ్‌ అలీ ఖాన్‌ ఎపిసోడ్స్‌ను డైరెక్ట్‌ చేశాడు.

ఆడియెన్స్‌నుఇన్‌వాల్వ్‌ చేయడానికి..
సేక్రెడ్‌ గేమ్స్‌ ఫస్ట్‌ సీజన్‌ పట్ల ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోలేదు. సెకండ్‌ సీజన్‌ పట్లా లేవు క్రైమ్, పాలిటిక్స్, రెలీజియన్, టెర్రరిజం అన్నీ కలిసి జటిలంగా అనిపిస్తాయి. నవాజ్‌.. నేను అనుకున్నదానికన్నా గొప్పగా చేశాడు. ఫస్ట్‌ సీజన్‌లో కొన్ని విమర్శలు వచ్చాయి. ఒక కథ చెప్తున్నప్పుడు ఆడియెన్స్‌ను అందులో ఇన్‌వాల్వ్‌ చేయడానికి ఆ కాలమాన పరిస్థితులను, అప్పుడు జరిగిన సంఘటనలు, సందర్భాలనూ కథలో చూపించాల్సి ఉంటుంది. సేక్రెడ్‌ గేమ్స్‌ క్రెడిట్‌ అంతా టీమ్‌దే. ఎస్పెషల్లీ వరుణ్‌ గ్రోవర్, విక్రమ్‌చంద్ర, పూజ, స్మిత, వసంత్, ధ్రువ్, నిహిత్‌.. అందరిదీ.
– అనురాగ్‌ కశ్యప్‌

ఆర్‌జీవీ
ఇందులో రామ్‌గోపాల్‌వర్మ మీద ఒక స్పూఫ్‌ ఉంటుంది. కెన్యాలో ఉన్న గైతొండే.. తన గురించి మరిచిపోయిన ముంబైకి తన జీవిత చరిత్రను సినిమాగా తీసి గుర్తుచేయాలనుకుంటాడు. మాఫియా డాన్స్‌ మీద సినిమా తీయడానికి రామ్‌ జీ వర్మ (రామ్‌గోపాల్‌ వర్మ పాత్ర)ను మించిన డైరెక్టర్‌ లేడని తెలుసుకొని అతణ్ణి ఆఫ్రికా రప్పించి సినిమా తీయిస్తాడు గైతొండే. ఇరవై నాలుగ్గంటలూ సెల్‌ఫోన్‌ చూసుకుంటూ, టెక్స్‌ట చేసుకుంటూ.. ఆర్‌జీవీ బాడీ లాంగ్వేజ్‌ను, మ్యానరిజమ్స్‌ను, శ్రీదేవి పట్ల అతనికున్న అబ్సేషన్‌ను అద్భుతంగా అభినయించాడు రామ్‌ జీ వర్మగా నటించిన విజయ్‌ మౌర్య.

చేయను.. చూస్తా..
నిజానికి ఆ ఎపిసోడ్‌లో ఆ డైరెక్టర్‌ రోల్‌కి రామ్‌గోపాల్‌ వర్మనే అడిగాడట అనురాగ్‌ కశ్యప్‌. ‘‘నేను చేయను. కాని ఎవరు చేశారో.. ఎలా చేశారో సిరీస్‌లో చూస్తా. అసలు నువ్వు నన్నెలా చూశావో .. చూస్తున్నావో.. తెలుస్తుంది ఆ రోల్‌తో’’ అని అనురాగ్‌తో అన్నాడట ఆర్‌జీవీ.
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement