బుద్ధితోనూ పరుగెత్తాలి! | Sensitive Mind | Sakshi
Sakshi News home page

బుద్ధితోనూ పరుగెత్తాలి!

Published Sun, Mar 23 2014 10:32 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Sensitive Mind

 ‘‘జీవితంలో విజయాన్ని కేవలం ప్రతిభ, శారీరక సామర్థ్యాల ఆధారంగా మాత్రమే  నిర్వచించలేం’’
 
కొన్నిసార్లు ఒక చిన్న వాక్యమే మన జీవితంలో ఎనలేని మార్పుకు దారితీస్తుంది. ఆ చిన్న వాక్యాన్ని ఎక్కడైనా చదివి ఉండొచ్చు, ఎవరైనా మనకు చెప్పి ఉండొ చ్చు. ఆ వాక్యం మన మెదడులో, మనసులో శాశ్వతంగా ముద్రించుకుపోతుంది. మనల్ని జీవితంలో ముందుకు నడిపించే ఒక చుక్కానిలా పనిచేస్తుంది. అలాంటి గొప్ప వాక్యాలను మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చదివారా? ఎవరైనా చెప్పారా? అవి మీకు ఇంకా స్ఫూర్తినిస్తున్నాయా?అనుకున్నది సాధించాలన్న కాంక్షను మీలో రగిలిస్తున్నాయా?... ఒకసారి గుర్తుకుతెచ్చుకునే ప్రయత్నం చేయండి! మీరు ఎప్పుడో ఎక్కడో చదివిన, విన్న కొన్ని స్ఫూర్తి వాక్యాలు మళ్లీ స్ఫురణకు వస్తాయి. వాటినుంచి ప్రేరణ పొంది, ముందడుగు వేసే ప్రయత్నాన్ని ఇప్పటికైనా ప్రారంభించండి..! గుర్తించే నేర్పు ఉండాలేగానీ మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే వాక్యం ఒక్కటి చాలు. దాన్ని వెతికి పట్టుకోండి.
 
బుద్ధి బలం మిన్న

 సింగిల్ లైన్ వాక్యం సైతం జీవితంలో గొప్ప మార్పు తెస్తుందనడానికి నా ప్రాణమిత్రుడే ఉదాహరణ. విశ్రాంత(రిటైర్డ్) బ్రిగేడియర్ అయిన నా మిత్రుడిలో మార్పు తెచ్చిన ఆ వాక్యమేంటో, అది చూపిన ప్రభావమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...
 
‘‘ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే సైన్యంలో అడుగుపెట్టాను. సైన్యంలో రాటుదేలాలంటే.. కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాలి. శారీరక శ్రమను తట్టుకోవాలి. ఆర్మీలో చేరిన తొలిరోజుల్లోనే ఓ ఆదివారం ఉదయం ఒక సవాల్ మా కోసం ఎదురుచూస్తోంది. అదేమిటంటే.. 10 మైళ్లు పరుగెత్తాలి. కమాండింగ్ ఆఫీసర్ నుంచి ఆదేశం వెలువడగానే సహచరులతో కలిసి ఉత్సాహంగా పరుగు మొదలెట్టా.

కొద్దిసేపటికే శరీరంలో శక్తి హరించుకుపోవడం మొదలైంది. ఉత్సాహం నీరుగారిపోతోంది. సగం దూరం వెళ్లగానే ఇక ఒక్క అడుగైనా వేయలేని స్థితికి చేరుకున్నా. కాళ్లు ముడుచుకుపోయి నేలపై కూలిపోయా.. మళ్లీ లేస్తాననే నమ్మకం కూడా లేదు. అప్పుడే గాల్లోంచి దూసుకొచ్చింది ఓ మెరుపు.

‘‘కమాన్ యంగ్‌మ్యాన్! లేచి నిలబడు.. ఇప్పటిదాకా కాళ్లతో పరుగెత్తావు, ఇప్పుడు నీ బుద్ధితో పరుగెత్తు’’ అంటూ కమాండింగ్ ఆఫీసర్ నోటి నుంచి వెలువడిందో వాక్యం! అంతే.. అది మంత్రంలా పనిచేసింది. ఆ తర్వాత  రెట్టించిన ఉత్సాహంతో పది మైళ్ల పరుగును పూర్తిచేశా. కమాండింగ్ ఆఫీసర్ వాక్యం నా మదిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. జీవితంలో నేను సాధించిన ప్రతి విజయం, చేసిన ప్రతి మంచి పని వెనుక ఆ వాక్యం ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ ఉన్నాయి’’.
 
జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ప్రతిభా పాటవాలు, శారీరక సామర్థ్యాలే కాదు, మానసిక బలం కూడా చాలా అవసరం. కాళ్లతోనే కాదు.. బుద్ధితోనూ పరుగెత్తితేనే విజయం తథ్యమన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. కాళ్లతో పరుగెత్తినప్పుడు ఒత్తిళ్లు మనల్ని నిర్వీర్యులను చేస్తాయి. దారిలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ‘ఇక నా వల్ల కాదు’ అనే ప్రతికూల భావన మొదలవుతుంది. అలాకాకుండా మన మెదడు(బుద్ధి)ను కూడా రంగంలోకి దింపితే.. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. నేను కచ్చితంగా సాధించగలనన్న భావన మనసులో ఉదయిస్తుంది.
 
హోండా హోరు అదరహో

సందర్భం వచ్చింది కాబట్టి... జపాన్‌కు చెందిన సాయ్‌చిరో గురించి కూడా తెలుసుకుందాం. ఇంజనీరింగ్ పూర్తయిన సాయ్‌చిరోకు ఆటోమొబైల్ రంగంలో మంచి ఉద్యోగం సాధించాలనే కల ఉండేది. ప్రఖ్యాత టయోటా మోటార్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అక్కడ నిరాశే పలకరించింది. చాలాకాలంపాటు నిరుద్యోగిగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా ఎంతకాలం ఎదురుచూడడం.. తానే సొంతంగా ఏదైనా ఎందుకు చేయకూడదనే ఆలోచన సాయ్‌చిరో మనసులో అంకురించింది. తన ఇంట్లోనే స్కూటర్ల తయారీని ప్రారంభించారు. ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. కారణం.. చేతిలో డబ్బు లేకపోవడమే. సాయ్‌చిరో కృషిని గుర్తించిన ఇరుగుపొరుగు తమవంతు తోడ్పాటును అందించారు. క్రమక్రమంగా బిలియన్ డాలర్ల విలువైన హోండా మోటార్ కంపెనీ ఆవిర్భవించింది.
 
 కేఎఫ్‌సీ సూపర్


రుచికరమైన కెంటకీ ఫ్రైడ్ చికెన్(కేఎఫ్‌సీ) ఎలా పుట్టిందో మీకు తెలుసా? అమెరికాకు చెందిన కల్నల్ శాండర్స్‌కు కొన్ని చికెన్ వంటకాల తయారీ(రెసిపీ) తెలుసు. ఓ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. తన వంటకాలకు మరింత ప్రచారం కల్పించి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో తన వద్దనున్న చికెన్ ఫార్ములాలను ఇతర హోటళ్లకు విక్రయించాలని అనుకున్నారు. వేలాది మంది రెస్టారెంట్ల యజమానులను సంప్రదించారు. శాండర్స్ వంటకాలను తమ రెస్టారెంట్లలో ఉంచేందుకు ఎవరూ అంగీకరించలేదు. కల్నల్ శాండర్స్ అంతటితో నిరాశ చెంది, తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. తన చికెన్ ఫార్ములాలపై ఉన్న నమ్మకంతో కాళ్లరిగేలా తిరిగారు.

1009వ రెస్టారెంట్ యజమాని శాండర్స్ కృషిని గుర్తించారు. ఆయన రెసిపీని కొనేందుకు ముందుకొచ్చారు. వెంటనే ప్రపంచంలో మొట్టమొదటి కేఎఫ్‌సీ ఔట్‌లెట్ రూపుదిద్దుకుంది. తర్వాత కేఎఫ్‌సీ వ్యాపారం ఖండాంతరాలు దాటింది. ఏడేళ్లలోపే శాండర్స్ తన మొత్తం వ్యాపారాన్ని 15 మిలియన్ డాలర్లకు విక్రయించుకోగలిగారు.  ఈసారి ఎప్పుడైనా విజయం అందకుండా పోయినప్పుడు, ప్రయత్నం వదులుకోవాలని అనిపించినప్పుడు సాయ్‌చిరో హోండాను, కల్నల్ శాండర్స్‌ను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. పోటీలోనే నిలవండి. వెనక్కి తగ్గొద్దు. కాళ్లతోనే కాదు, బుద్ధితోనూ పరుగెత్తండి.
     
-‘కెరీర్స్ 360’ సౌజన్యంతో

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement