మనిషి కలిసి ఉండాలి. అమ్మ, నాన్న.. భార్య, భర్త... తల్లి, పిల్లలు... కాని దేశంలో దాదాపు ఆరుశాతం మంది స్త్రీలు ఈ బంధాలను ఎడంగా ఉంచి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దక్షిణాదిలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. సపరేటెడ్/డివోర్సీ/వితంతువు... ఈ స్త్రీలు తిరిగి ఏ బంధంలోకీ వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కుటుంబాలతో కూడా ఉండటం లేదు. ఎందుకు? (కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవలు)
సుజాతగారి ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఇంకో అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు. సుజాతగారు టీచర్‌గా రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాక ఆమె తన ఇంట్లోనే ఉంటరిగా ఉంటున్నారు. అమెరికాకు వెళ్లడం లేదు. రెండోకొడుకు ఇంట్లో ఉండి కోడలి ప్రేమను తగ్గించుకోవడమూ ఇష్టం లేదు. ఇలా బాగానే ఉంది అనుకున్నారామె. రజితకు 40 ఏళ్లు. పిల్లలు లేరు. భర్త చనిపోయాడు. ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ ఒక్కతే ఉంటోంది. మొదటి పెళ్లిలో అత్తామామల నుంచి చాలా హింస పడింది. భర్త హఠాన్మరణం కూడా ఆమెను బెంబేలెత్తించింది. కొత్త బంధంలో ఏ సమస్యలు, చికాకులు ఉన్నాయో. ఇలా బాగానే ఉంది అని అనుకుని ఉండిపోయింది.
రాధకు భర్తతో సరిపడలేదు. పదేళ్ల కూతురు ఉంది. భర్తతో విడివడి కూతురే లోకం అనుకుంటూ ఉంది. మరో పెళ్లి అనే ఆలోచన ఆమె ఎదుట అనేక ప్రశ్నలను ఉంచుతోంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోలేక ఒంటరిగా ఉండిపోయింది. ఇటీవల కూతురి కోసం ఒక కుక్కపిల్లను కొన్నది. వాళ్లిద్దరికి ఇప్పుడు కుక్కపిల్ల తోడు. స్త్రీలు ఒంటరిగా ఉండగలరు.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్– 2018 గణాంక నివేదిక ప్రకారం దేశంలో 5.5 శాతం మంది స్త్రీలు వివాహం అయ్యాక అనేక కారణాల రీత్యా ఒంటరిగా ఉంటున్నారు. విడాకులు లేకుండా విడిపోయి, విడాకులతో విడిపోయి, భర్త చనిపోయి... కారణాలు ఏవైనా వీరంతా ఒంటరిగా జీవిస్తున్నారు.
అయితే కేరళ, తమిళనాడుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంది. కేరళలో ఒంటరిగా ఉంటున్న స్త్రీలు 9.3 శాతం అయితే తమిళనాడులో 9.1 శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 7.8 శాతం, తెలంగాణలో 7.1 శాతం ఉన్నారు. కాని వివాహం అనంతరం వివిధ కారణాల వల్ల ఒంటరిగా ఉంటున్న పురుషుల సంఖ్య కేవలం 1.5 శాతం మాత్రమే. అంటే మగవారు ఎలాగోలా ఒక స్త్రీతోడును వెతుక్కుంటుంటే స్త్రీలు మగతోడును వద్దనుకుంటున్నారు.
ఒంటరి స్త్రీల సంఖ్య దక్షణాదిలో పెరగడానికి మైక్రోఫ్యామిలీ సిస్టమ్ ఒక ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లయిన వెంటనే పిల్లలు వేరు కాపురాలు పెట్టడానికి ఆత్రపడటం వల్ల తల్లిదండ్రులు వేరుగా ఉండాల్సి వస్తోంది. వీరిలో వయసు వ్యత్యాసం వల్ల భర్త ముందు చనిపోతే భార్య ఒక్కతే ఉండాల్సి రావడం కేరళ, తమిళనాడుల్లో ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలనలో తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాలలో అబ్బాయి వయసు అమ్మాయి వయసు కంటే ఎక్కువగా ఉండటం (దాదాపు 10 సంవత్సరాల వరకు) వల్ల కూడా భర్తల మరణం తర్వాత స్త్రీలు ఒంటరి జీవితానికి నిబద్ధులు అవుతున్నారు. కొద్దోగొప్పో చదువు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి మార్గాలు ఇవన్నీ వివాహం నుంచి బయటపడ్డ స్త్రీకి, సంతానం వద్ద ఉండే వీలు లేని స్త్రీకి/ పిల్లలు ఉండనివ్వని స్త్రీకి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తున్నాయి.
కాని పిల్లల కోసం, సంఘ మర్యాద కోసం ‘టెక్నికల్’గా కలిసి ఉంటూ ఒకే ఇంటికప్పు కింద శారీరకంగా/ మానసికంగా ఒంటరిగా ఉన్న స్త్రీల గణన జరిగితే ఈ శాతం ఎంత ఉంటుందో ఊహించలేము. వివాహంలో సమ గౌరవం, సమ విలువ స్త్రీకి సంపూర్ణంగా లభించాల్సి ఉంది. వివాహ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి పురుషుడు ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడో, వివాహ వ్యవస్థలో స్త్రీకి ఉండే అభద్రత దూరం చేయడానికి సంఘం ఏమేరకు ప్రయత్నిస్తూ ఉందో తేలే వరకు ఒంటరిగా ఉండే స్త్రీల శాతం పెరుగుతూ పోతూ ఉండొచ్చు. గతంలో కేవలం కేరళలో మాత్రమే అధికంగా కనిపించే ఒంటరి మహిళలు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలలో ఉత్తరాది కంటే అధికంగా కనిపించడానికి కారణాలు సంపూర్ణంగా అర్థం చేసుకుంటే స్త్రీలు ఒకరితో కలిసి ఉండగలిగే ఆనందమైన జీవితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment