ఏ పండగకీ చూడం – సంక్రాంతి పర్వంలో నేల తల్లి రంగవల్లులతో ఒళ్లంతా కళ్లు చేసుకుని నవ్వుతున్నట్టుండే వర్ణచిత్రం. తెలుగు లోగిళ్ల గడపలు మామిడి తోరణాలతో కళకళ నవ్వుతూ కనిపిస్తాయ్. పల్లె గుమ్మాలు కొత్త ధాన్యాల రాశులతో బంగరు కాంతులతో పండగ వేళ, వచ్చే పోయే వారందర్నీ నవ్వుతూ పలకరిస్తాయి. తెల్లటి సంక్రాంతి మబ్బులు నవ్వుతూ ఆకాశవీధిలో పెళ్లి నడకలు సాగిస్తుంటాయ్. కొత్త అల్లుడు అత్తవారింటికి దంపతీ సమేతంగా నవ్య సంక్రాంతిని వెంటపెట్టుకు వస్తాడు. ఆ ఇంట్లో బోలెడు సందళ్లు వెల్లివిరుస్తాయి. ‘‘బావా! బావా! పన్నీరు; బావను పట్టుకు తన్నేరు’’ లాంటి చిలిపి అల్లరి పాటలు సంకురాత్రికి పుట్టినవే. పుట్ల కొద్దీ నవ్వులు, ధాన్యాలు పోటీగా పండే తరుణం యిదే!
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కావిళ్లకొద్దీ రైతుల ఇళ్లకు చేరినప్పుడు, ఆశలన్నీ పండి గాదెలు నిండినప్పుడు ఎన్ని ఆనందాలు పండుతాయో చెప్పలేం. రైతులతో సమానంగా శ్రమించిన పశుసంపదకు కృతజ్ఞతలు చెప్పే పండుగ సంక్రాంతి. ధాన్యాలు ఇంటికి చేరాక బసవన్నలు కాస్తంత సేదతీరతాయ్. లేత పచ్చికలు, మంచి గుగ్గిళ్ల దాణాలు తిని లేత ఎండలో పశువులు తృప్తిగా నెమర్లు వేస్తుంటే అవి నవ్వుతున్నట్లే అనిపిస్తుంది. కోడెదూడలతో రైతు బిడ్డలు చెంగనాలు వేస్తూ కేరింతలతో ఆడుతుంటే పెరటిదొడ్లు నవ్వులతో ప్రతిధ్వనిస్తాయి. జొన్న చేలు విచ్చుకున్న పచ్చ పూలను కప్పుకుని, ఆ పైన తెలి మంచు వల్లెవాటు వేసుకుని, పల్లీయుల్ని పదేపదే నవ్వించి కవ్వించి పలకరించి చక్కలిగింతలు పెడుతూ ఉంటాయి. సెనగ చేలు పోటీ పడుతుంటాయ్.
మకర సంక్రాంతి మకర సంక్రమణం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమై ఆరు నెలలపాటు సాగుతుంది. శుభాశుభాలన్నింటికీ యిది మంచి కాలం. సూర్యభగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు తన ప్రతాపాన్ని పెంచి సమస్త జీవరాశిని దీవిస్తూ దర్శనమిస్తాడు. పగటి పొద్దును పెంచి వరంగా యిస్తాడు. మకర సంక్రమణ శుభవేళ పితృదేవతలు తర్పణాలు స్వీకరించి సంతృప్తి గా దీవించి వెళతారని మన ప్రగాఢ విశ్వాసం. సంక్రాంతి వేళ రకరకాల దానాలతో అవసరార్థులను ఆదుకుని వారిని సంతోషపరుస్తారు. దానికి పెద్దలు ఆనందిస్తారని నమ్ముతారు. ఇదొక ఆచారంగా కొనసాగుతోంది.
బొమ్మల కొలువులు ఇంటింటా ఒక వినోదం. ఒక వేడుక. మన దేవుళ్లు, దేవతలు, నాయకులు, దేశభక్తులు బొమ్మల రూపంలో పిల్లలకు పరిచయమవుతారు. చిన్న పిల్లలకు సంక్రాంతి భోగిపళ్లు పోస్తారు. భోగి పేరంటంలో ముల్తైదు వాయనాలు ఇంటింటా ఒక వేడుక. ఇంటింటికీ పెద్ద చిన్న ముత్తయిదువలు సంచరించడం, దీవెనలిస్తూ తిరగడం ఒక గొప్ప సంక్రాంతి విశేషం. సంక్రాంతి పండగ వేళ రకరకాల చిరుతిళ్లు నవ్విస్తాయ్. మురిపిస్తాయ్. రేగి పళ్లు, కొత్త చెరుకులు, తేగలు, కొత్త బెల్లంతో కొత్త నువ్వులు అద్ది తయారుచేసే అరిసెలు, జీళ్లు, మిఠాయిలు, జిలేబీలు అందర్నీ బలే నవ్విస్తాయ్.
కొంచెం వెనక్కి వెళ్లి, పాత రోజులలోకి వెళితే – అసలు సంక్రాంతి శోభ కళ్లకు కడుతుంది. తెల్లారకుండానే సాతాని జియ్యరు ‘హరిలో రంగ హరీ!’ అంటూ తలపై అక్షయపాత్రతో, కాళ్లకు గజ్జెలు, చేతిలో భజన చెక్కలతో ముగ్గుల్లో చిందు వేస్తూ అందర్నీ సంకీర్తనలతో నిద్ర లేపేవాడు. ఇప్పుడు పండగ నెల కాదు గాని ఓట్ల పండగకి నెలపడితే వేరే స్వాములు భజనలతో ఓట్ల ముష్టికి వాకిళ్లలోకి వస్తూనే వున్నారు. తర్వాత ముష్టి వేసిన వారే ‘కృష్ణార్పణం’ అనుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఏ ఆశా లేకుండా, అప్పట్లో కోతలు కోసే మాటలతో వినోదపరిచే జానపద కళాకారులు, పిట్టల దొరలు కడుపుబ్బ నవ్వించేవారు. ఇప్పడు వాగ్దానకర్ణుల రూపంలో బోలెడు కోతల వాగ్దానాల మాటలు విప్పి మన ముందు పరుస్తారు.
తర్వాత ‘అంతా వొఠిదే... తూచ్’ అని లోపల్లోపల గొణుక్కుని తర్వాతి గడపకి వెళతారు. గంగిరెద్దుస్వాములు ఆడించే ‘డూడూ బసవన్న’ సంగతి అందరికీ తెలుసు. తలలూపే ఎద్దుల్ని డూడూ బసవన్నలని కదా అంటాం. కోతికి తమాషా దుస్తులు తొడిగి చిత్రంగా ఆడించే ఆటలు బాగుంటాయ్. విప్ర వినోదులు గమ్మత్తులు చేస్తారు. హస్తలాఘవం ప్రదర్శిస్తారు. ఉన్నది లేనట్టు, లేనిది వున్నట్టు చూపిస్తారు. ‘మేం మాత్రం తక్కువ తిన్నామా?’ అంటున్నారు నేటి మన మేధావులు. చెప్పండి. మేం దేన్నైనా మాయం చెయ్యగలం. విమానాలైనా, రైలు పెట్టెలైనా, బ్యాంకులైనా సరే, ‘సవాల్’ అంటున్నారు.
మా చిన్నప్పుడు ‘కొమ్మదాసరి’ అని ఓ కళాకారుడుండేవాడు. వూరొచ్చి, ఎత్తయిన కొమ్మ మీద కూచుని వూళ్లో అందర్నీ గమనించి, ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తుండేవాడు. కింద నేల మీద వస్త్రం పరిచి పెట్టేవాడు. దాన్నిండా చిల్లర పడేది. ఇప్పుడూ ఇంకో రూపంలో కొమ్మదాసర్లు వస్తున్నారు. వివరణ దేనికి. అందరికీ తెలుసు. నాగసొరం వూదుతూ పాముల్ని ఆడించేవాళ్లు, ముగ్గులో తిష్ట వేసి మరీ ముష్టి తీసుకువెళ్లేవాళ్లు. ఒకానొక పాత అల్లుడు అత్తారింటికి వచ్చి, రెండు రాత్రుళ్లు వుండి వెళ్తానని ప్రాధేయపడితే, సరేనని మామగారు మాటిచ్చారు. ఎంతకీ కదలకపోతే, ‘అల్లుడూ! రెండు రాత్రుళ్లు యిరవై అయినా కదిలావు కాదు. ఇదేం మర్యాద’ అని నిలదీశారు. ఆ పళంగా అల్లుడు నవ్వి, ‘నేను రెండు రాత్రుళ్లన్నది, సంకురాత్రి నుంచి శివరాత్రి అనే లెక్కలో’ అనేసి భళ్లున నవ్వేశాడు. ఈసారి అవాక్కవడం మావగారి వంతు అయింది.
సంక్రాంతికి కోడి పందాలు మంచి వినోదం. కోళ్ల మీద పందేలు కాసుకుంటారు. కొందరు కోల్పోతుంటారు.. కొందరు గెలుస్తూ ఉంటారు. ఎడ్ల పందాలు కూడా ఒక సరదా. సంక్రాంతి పొద్దులో పైర గాలికి కన్నుమిన్ను కానక ఎగిరే గాలిపటాలు ఒక వినోద కాలక్షేపం. ఇవన్నీ ఈ పండగకే ముందుకొస్తాయ్. తర్వాత మళ్లీ నెల పట్టేదాకా కనిపించవ్. ఇంకా బుడబుక్కలసామి జోస్యాలు చెబుతూ, చింకిపాత గొడుగుతో ఢక్కీ వాయిస్తూ, పెద్ద తలపాగాతో వచ్చి ‘బెజవాడ కనకదుర్గమ్మ’మాటగా చెబుతుంటాడు. ఇప్పుడూ వేషాలు మారాయి గానీ, సాములు మాత్రం వున్నారు. ఇప్పుడూ ‘అంబ పలుకు! జగదాంబా పలుకూ!’ అంటూ అంబని పలికించేవారికేం కొదవ లేదు.
నిజం! మనకిప్పుడు నిత్య సంక్రాంతి.
కళాకారులంతా వేషభాషలు కొంచెం సరిచేసుకుని వస్తూనే ఉన్నారు. వినోదం పంచుతూనే వున్నారు. ఇంకా పగటి భాగవతుల సంగతి ముచ్చటించుకోనే లేదు. జోస్యాలు పలికే జంగం దేవర్ల మాట అనుకోనే లేదు. జోలె నింపగానే ‘భం భం’ అంటూ దేవర శంఖం పూరించడం బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు కూడా మనం ఏవీ పోగొట్టుకోలేదు. సంక్రాంతి నిత్యం పచ్చగానే వుంటుంది.
అందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. – శ్రీరమణ, ప్రముఖ రచయిత
Comments
Please login to add a commentAdd a comment