అచటనుండును ఆంధ్ర మహావిష్ణువు
• మీసాలున్న మహావిష్ణువు
• తెలుగుభాషకు దేవుడు శ్రీకాకుళేశ్వరస్వామి
• ‘ఆముక్తమాల్యద’ గ్రంథ రచనకు శ్రీకారమిక్కడే
• ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం
శ్రీకాకుళేశ్వర స్వామి క్షేత్రం కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళ గ్రామంలో
నెలకొని ఉంది. తెలుగువారికి ఈ క్షేత్రం విశిష్టమైనది. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఇక్కడ
ఆంధ్ర మహావిష్ణువుగా కొలువవడమే కాదు... ఆంధ్రనాయకుడుగా, తెలుగు వల్లభుడుగా
పూజలందుకుంటున్నాడు. చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణాపథం వరకూ
పాలించిన శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం.
శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి తన ‘ఆముక్తమాల్యద’ రచనకు ఇక్కడే శ్రీకారం చుట్టడం
మరో విశేషం. ఇంకో విశేషం... ఇక్కడ స్వామి మీసాలున్న మహావిష్ణువు. ఇన్ని విశేషాలు
ఉన్నాయి కనుకనే... శ్రీకాకుళాన్ని 108 దివ్యక్షేత్రాలలో 57వ క్షేత్రంగా చెబుతారు.
బ్రహ్మ పులకరించిన ప్రదేశం
శ్రీకాకుళానికి సంబంధించి అనేక స్థలపురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. కలియుగంలో పాపాలు పెరిగి పోతున్నాయని దేవతలు, మునులు, మహర్షులు వ్యాకులత చెంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారట. ఆయన వారి మొర ఆలకించి, ఈ పాపభార ప్రక్షాళనకు విష్ణువు సాక్షాత్కారమే శరణ్యమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలు హరిస్తానని మాట ఇచ్చాడట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడట. అందువల్ల బహురూపాలు ధరించి ప్రతి మూలనా నిలబడి ఈ ప్రాంత అందాలు చూడసాగాడట.
అప్పుడు ఇతర దేవతలకు, మునులకు ఎక్కడ చూసినా బ్రహ్మరూపమే కనిపించింది. దాంతో వారు ఈ ప్రాంతాన్ని ‘శ్రీకాకుళం’ అని పిలవడం మొదలుపెట్టారు. ‘శ్రీ’ అంటే శోభాయకరమైన, ‘క’ అంటే బ్రహ్మచే, ‘ఆకుళం’ అంటే వ్యాపించినది అని అర్థం. మరో కథనం ప్రకారం శ్రీమహావిష్ణువుకు సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు ఇష్టమైనవి కనుక ఆయన ఇక్కడ వెలిశాడట. మరో కథనం ప్రకారం భృగువు, పులస్త్యుడు, సుబాహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దశుడు, వశిష్ఠుడు, మరీచి అనే నవబ్రహ్మలు ఇక్కడి విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారనే నమ్మకం ఉంది.
పద్యానికో అంగుళం చొప్పున...
ఒకప్పుడు ఆంధ్రనాయకస్వామి ఆలయం కృష్ణానది మధ్యలోని దేవుడిలంకలో ఉండేదనీ, అయితే వరదల వల్ల ఆలయం దెబ్బతినడంతో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో పునరుద్ధరణ జరిగిందనీ తెలుస్తోంది. నిజానికి ఈ ఆలయం క్రీ.శ. 4వ శతాబ్దంలోనే ఉండేదనీ, అయితే విచిత్రంగా వెయ్యేళ్లపాటు మూలవిరాట్టు కనిపించకుండా పోయిందనీ మరో కథనం. వెయ్యేళ్ల తర్వాత ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఈ ప్రాంతం గుండా వెళుతూ క్షేత్రాన్ని దర్శించుకుని మూలవిరాట్టు లేకపోవడం గురించి ఆందోళన చెంది, దాని కోసం వెతికించినట్టూ, అయినా ఎక్కడా దొరకనట్టూ, అప్పుడు అతని కలలో స్వామి కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నానని చెప్పినట్టూ, మంత్రి అక్కడికి వెళ్లి తవ్వకాలు జరపగా మూలవిరాట్టు బయటపడినట్టూ ఒక కథ ఉంది.
ఇంకో కథనం ప్రకారం 18వ శతాబ్దంలో చల్లపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజా అంకినీడు బహద్దూర్ శ్రీకాకుళస్వామి మహాభక్తుడు. ఆయనకు ఆ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం లేకపోవడం వల్ల బాధ కలిగి అప్పటికే శ్రీకాకుళస్వామి మరో భక్తుడైన కాసుల పురుషోత్తముడనే కవిని ఆలయానికి తీసుకొచ్చి మూలవిరాట్టు భూమి లోపల ఉండవచ్చునని దానిని బయటకు వచ్చేలా చేయాలని కోరాడట. అప్పుడు పురుషోత్తమ కవి అక్కడిక్కడే 108 పద్యాల శతకం భక్తియుక్తంగా చెప్పగా, ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున భూమి లోపల నుంచి స్వామివారి విగ్రహం పైకి లేచిందని అంటారు.
ఆముక్త మాల్యదకు శ్రీకారం
శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తరువాత 1513లో జైత్రయాత్ర సాగించాడు. ఉదయగిరి, కొండవీడు రాజ్యాలు జయించి విజయవాటిక, కొండపల్లి మొదలైన దుర్గాలను పట్టుకుని కళింగ వరకూ వెళ్లాడు. అక్కడ నుంచి విజయగర్వంతో తిరిగి వెళుతూ, వినమ్రుడై శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలకు శ్రీకాకుళేశ్వరస్వామి కలలో ప్రత్యక్షమై ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ రచన చేయాలని కోరాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఆలయ క్రింది భాగంలో ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి.
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనగా, తెలుగురాయుడైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆయన చేత తెలుగు సాహిత్యానికి తలమానికమైన ‘ఆముక్త మాల్యద’ ప్రబంధ రచన చేయించాడని ఒక నమ్మకం. ఈ రచన ద్వారా కృష్ణదేవరాయలు ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ బిరుదునందుకున్నాడు. అంతటి సాహితీవేత్త ప్రస్థానం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో జరగడం తెలుగువారందరికీ గర్వకారణం.
దర్శన వేళలు
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది.
రవాణా సౌకర్యం
విజయవాడ నుంచి శ్రీకాకుళం గ్రామం కరకట్ట మార్గంలో 35 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల ద్వారా ఘంటసాల మండలం కొడాలి చేరుకోవాలి. అక్కడ నుంచి 7 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోలు, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు. మచిలీపట్నం నుంచి చల్లపల్లి మీదుగా శ్రీకాకుళం చేరుకోవచ్చు. దూరం 35 కి.మీ. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పులిగడ్డ– విజయవాడ కరకట్ట మీదుగా ఈ క్షేత్రం 26 కి.మీ దూరం.
మీసాల వెనుక కథ...
శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామిగా పూజలందు కుంటున్న ఆంధ్ర మహావిష్ణువు మీసాలు కలిగి ఉండటం ఇక్కడి ఆలయం ప్రత్యేకత. అన్నవరంలోని సత్యనారాయణస్వామికీ, పలుచోట్ల చెన్నకేశవస్వామికీ ఈ విధంగా మీసాలున్నాయి. శ్రీరంగం, తిరుపతి వంటి ప్రసిద్ధి పొందిన వైష్ణవాలయాల్లో స్వామివారికి మీసాలుండవు. అయితే శ్రీకాకుళ స్వామి కేశాల వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వం ఈ ఆలయంలో ఒక అర్చకుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు. కానీ వేశ్యాలోలుడు. స్వామికి సమర్పించాల్సిన దండలు మొదట వేశ్యలకు సమర్పించి, ఆ తర్వాత స్వామికి అలంకరించి, ఆ తర్వాత స్థానిక ప్రభువుకు అర్పించే వాడట. ఒకసారి ప్రభువుకు ఆ దండల్లో సువాసనలీనే పొడవాటి వెంట్రుక కనిపించింది.
దానిని చూసిన ప్రభువు ‘ఏమిటీ... మన స్వామికి కేశాలు ఉన్నాయా?’ అని అర్చకుణ్ణి అడిగాడు. అప్పుడు అర్చకుడు ‘ఆయన కేశవుడు కదా... కేశాలు లేకుండా ఎలా ఉంటాయి’ అని బదులిచ్చాడు. ‘అయితే రేపొచ్చి నేను చూస్తాను’ అన్నాడు ప్రభువు. భక్తుడైన అర్చకుడు భయపడలేదు. తన మానాన తాను వెళ్లి నిద్రపోయాడు. కానీ తెల్లారి ప్రభువు వచ్చేసరికి స్వామికి మీసాలు, కేశాలు ప్రత్యక్షమయ్యాయి. ‘భక్తుడి మర్యాదే నా మర్యాద’ అని భావించిన స్వామి తనకు తానే మీసాలు తెచ్చుకున్నాడట. ఇది చూసి నమ్మని ప్రభువు మీసాలు లాగి చూడగా స్వామికి చురుక్కమన్నదనీ, ఆ తప్పుకు ప్రభువు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడనీ చెప్పుకుంటారు.
ఆంధ్రుల తొలి రాజధాని
క్రీ.శ 3వ శతాబ్దం చివరలో అశోకుని మరణానంతరం శాతవాహనాంధ్రులు మౌర్య సామ్రాజ్యాన్ని ధిక్కరించి స్వతంత్య్ర రాజ్యాన్ని స్ధాపించుకున్నారు. కృష్ణానదీ తీరంలోని శ్రీకాకుళాన్ని తొలిరాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. ధాన్యకటకానికి రాజ«ధానిని మార్చేవరకూ శ్రీకాకుళం రాజధానిగా ఉంది. శాతవాహనులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, వెలనాటి చోడులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
– పుట్టి శ్రీనివాసరావు, ‘సాక్షి’, అవనిగడ్డ, కృష్ణాజిల్లా