ఆ విషయంలో నాకు రెండో ఆలోచనే లేదు!
వేదిక
ఆ రోజు నాకింకా గుర్తుంది. యాన్యువల్ డే ఫంక్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నాం. కబుర్లు చెప్పుకుంటూ, అల్లరి చేస్తూ, నానా హంగామా చేస్తున్నాం. అప్పుడే మా క్లాస్‌మేట్ పవన్ నా దగ్గరికొచ్చాడు. నీతో అర్జంటుగా మాట్లాడాలి అంటూ ఒత్తిడి చేశాడు. సరేనని వెళ్లాను. మూడేళ్లుగా తన మనసులో దాచుకున్న ఫీలింగ్సన్నీ కక్కేశాడు. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ నన్ను ప్రేమిస్తున్నాడట. చెబితే నేనేమంటానోనని భయపడి చెప్పలేదట. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అంటూ విషయాన్ని బైటపెట్టేశాడు.
నో చెప్పడానికి కారణాలు కనబడలేదు. బాగా చదువుతాడు. మంచి ఫ్యామిలీ నుంచే వచ్చాడు. చూడ్డానికి బాగుంటాడు. దాంతో ఎస్ అనేశాను. షికార్లు మొదలయ్యాయి. ఇద్దరం పీజీ కోసం ఒకే కాలేజీలో చేరాం. రెండేళ్లు సంతోషంగా గడిపేశాం. పీజీ పట్టాలు చేతిలో పుచ్చుకుని ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. రెండు వారాలు తిరిగే సరికల్లా నాకు ఉద్యోగం దొరికింది. పవన్‌కి మాత్రం రెండు నెలలైనా జాబ్ దొరకలేదు. నిరుత్సాహ పడ్డాడు. ధైర్యం చెప్పాను. తప్పక దొరుకుతుంది, కంగారు పడొద్దని ఊరడించాను.
కష్టాలు వచ్చినప్పుడే తోడుగా ఉండాలంటారు. నేనలానే ఉన్నాను. అర్థం చేసుకున్నాను. కానీ తను నా ప్రేమను, సహనాన్ని అర్థం చేసుకోలేదు. ఉద్యోగం రాలేదన్న విసుగు నామీద చూపించేవాడు. ఓసారి అందరి ముందూ నామీద చేయి చేసుకున్నాడు. అప్పటికీ కన్విన్స్ చేయాలని చూశాను. వినలేదు. ఉద్యోగం ఉందన్న పొగరుతో తనని లోకువగా చూస్తున్నాను, అవమానిస్తున్నానంటూ ఏవేవో అన్నాడు. నా చెంప మీద పడిన తన చేతి దెబ్బ కంటే... తన మనసు మీద పడిన దెబ్బ నన్ను చాలా బాధించింది. వారం రోజుల పాటు ఇంట్లో ఏడుస్తూ ఉండి పోయాను. తను ఒక్కరోజు కూడా ఫోన్ చేయ లేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను... మనసు లేని ఆ మనిషికి ఇక దూరమైపోవాలని. పని మీద ధ్యాస పెట్టాను. అంచెలంచెలుగా ఎదిగాను. టీమ్ లీడర్‌ని అయ్యాను.
దాదాపు రెండు నెలల తర్వాత పవన్ నుంచి ఫోన్. నేను తీయకపోవడంతో నేరుగా ఆఫీసుకే వచ్చాడు. ఉద్యోగం వచ్చిందన్నాడు. కంగ్రాట్స్ చెప్పాను. ‘‘జరిగిందేదో జరిగింది, మళ్లీ దగ్గరవుదాం’’ అన్నాడు. నవ్వాను. ‘నీ పరిస్థితి బాలేనప్పుడు నేను నీ పట్ల చూపించింది నిజమైన ప్రేమ, అప్పుడు నీకది అక్కర్లేకపోయింది, నీ పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు వచ్చి చూపించే ప్రేమ నాకు అక్కర్లేదు’ అని చెప్పాను. బతిమాలినా మెత్తబడలేదు. నాటితో మా దారులు శాశ్వతంగా వేరయ్యాయి.
నేనలా చేసి ఉండకపోతే ఈ రోజు ప్రశాం తంగా ఉండేదాన్ని కాదు. ఆ రోజు పవన్ ప్రవర్తనకు తన నిస్సహాయతతో పాటు నా పట్ల ఉన్న అసూయ కూడా కారణం అని నాకు తెలుసు. నేను తనకంటే అధికంగా ఉండటాన్ని తను భరించలేకపోయాడు. అలాంటివాడు నన్ను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు తప్ప చేతిలో చేయి వేసి, అడుగులో అడుగు వేసి నడవాలనుకోడు. సమానత్వం నాకక్కర్లేదు. అలాగని ఆధిపత్యాన్ని కూడా భరించలేను. నా వరకూ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తోంది. కాదంటారా?
- భవ్య, ముంబై