డబుల్ వరం | udayabhanu family special story | Sakshi
Sakshi News home page

డబుల్ వరం

Published Sat, Aug 27 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

డబుల్ వరం

డబుల్ వరం

ఉదయభాను ఉదయించినప్పటి నుంచీ... జీవితంలో అన్నీ కష్టాలే!
నాలుగేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుంది.
తర్వాత నా అనుకున్నవాళ్లు దూరం అయ్యారు.
అయినా పోరాడింది. తల దించకుండా పోరాడింది.
యాంకర్ సామ్రాజ్యానికి తలమానికం అయింది.
కష్టనష్టాల నుంచి... పేరుప్రతిష్టల కవలలకు తల్లి అయింది.
దీన్నే డబుల్ వరం అంటారు!
ఇవాళ... ఈ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చదవండి.
వారం తిరిగేలోపు ‘ట్విన్ మమ్మీ’కి విషెస్ చెప్పండి.

ఉదయభానుకి చాన్సులు తగ్గాయా?  ఎక్కడా కనిపించడం లేదు. ఇండియాలోనే ఉందా? అనే గాసిప్ వెబ్ మీడియాలో ప్రచారంలో ఉంది. అసలేమైపోయారు?
ఉదయభాను: ఎక్కడికీ వెళ్లిపోలేదండి. హైదరాబాద్‌లో హాయిగా ఉన్నా. బొజ్జలో ఇద్దరు బుజ్జోళ్లో.. బుజ్జెమ్మలో ఉన్నారు. నా జీవితంలోనే చాలా ఆనందమైన క్షణాలను అనుభవిస్తున్నాను. ఎందుకంటే మరో వారం, పది రోజుల్లో ఇద్దరు పండంటి కవల పిల్లలకి జన్మనివ్వబో తున్నా. ఈ విషయం తెలియక నరం లేని నాలుక. ఏది అనిపిస్తే అది వాగేస్తూ ఉంటారు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతలివాళ్లు మాట్లాడేవి పట్టించుకోకపోతేనే బతకగలుగుతాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఈ ఫీల్డ్‌లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. దాని మీద ఎవరైనా రాయి వేయొచ్చు. అది తగలకుండా జాగ్రత్తపడాలి. తగిలి నా ఎదుర్కొని, యుద్ధం చేయగల సాహసం ఉండాలి.

ఎప్పుడైనా అనిపించిందా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి ఎందుకు వచ్చామా అని?
ఈ ఫీల్డ్‌లో అడ్వాంటేజ్, డిస్ అడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం, ఒక రకంగా వరం. రూమర్స్, మనీ, ఫేమ్ అన్నీ వస్తాయి. ఏదేమైనా సక్సెస్‌లో ఉన్నవాళ్లను చూస్తే, ఏదో ఒక రాయి విసరకుండా ఉండలేరు చాలామంది. బట్ ఐ డోంట్ కేర్ దట్. గుళ్లో దేవతను చూసి వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయ్, దానివల్ల దేవత గొప్పతనం పడిపోదని నా ఫ్రెండ్ అమ్ములు అంటుంది. అది కచ్చితంగా నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. నేను చిన్న వయసులోనే రావడం వల్ల చాలా చూశా. ఎన్నో జీవిత పాఠాలు నేర్చేసుకున్నా. అందుకే ఆడపిల్లలు పుడితే చాలా చాలా స్ట్రాంగ్‌గా పెంచాలనుకుంటున్నా.

మీ మాటలు విన్నప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు స్ట్రాంగ్ పర్సన్ అని ఎవరికైనా అనిపిస్తుంది.. మీరలా కాదా?
స్ట్రాంగే.. కానీ, ఎవరైనా బాధపడితే ఎమోషనల్ అయిపోతాను. కెరీర్ బిగినింగ్‌లో ఓ వ్యక్తి వచ్చి ఆరోగ్యం బాగా లేదంటే నా దగ్గర జస్ట్ పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. పదివేలు ఇచ్చేశాను. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలియదు. ఇలాంటివి లెక్కలేనన్ని జరిగాయి. సొంత వాళ్లకీ, బయటి వాళ్లకీ చాలానే చేశాను. అర్హత లేనివాళ్లకు ప్రేమ పంచి టైమ్ వేస్ట్ చేసుకున్నా. నేను ఎవరికేం చేసినా వాళ్ల నుంచి ఆశించేది జస్ట్ ప్రేమ మాత్రమే. అది ప్యూర్‌గా దక్కలేదు. బట్ ఐయామ్ లక్కీ ఇనఫ్. నాకు కావల్సినంత ప్రేమ విజ్జూ (భర్త విజయ్) నుంచి దక్కింది. ఒక్కటి కచ్చితంగా చెప్పగలను. ప్రపంచమంతా ఒక్కటై నావైపు వేలెత్తి చూపిస్తున్నా.. ఆ వేలుని విరిచి నా వెన్నంటే ఉండే భర్త దొరికాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు నా బిడ్డలు రాబోతు న్నారు. ప్రపంచంలోని ప్రేమ అంతా నా సొంతం కాబోతోంది (ఆప్యాయంగా పొట్ట నిమురుకుంటూ).
వియ్ ఆర్ హ్యాపీ

విజయ్‌గారూ మీ గురించి?

మాది విజయవాడ. మాకు థియేటర్లున్నాయి. విజయవాడలోనే భానూతో పరిచయం. మా ఇంట్లోవాళ్లకి కూడా తనంటే చాలా ఇష్టం. ఎంబీఏ ఇక్కడే హైదరాబాద్‌లో చేశా. మా పెళ్లయినప్పుడు నేను చదువుకుంటున్నాను. మా ఇంట్లో చెప్పి, పెళ్లి చేసుకోలేదని బాధపడ్డారు. పది రోజులకి అదే సర్దుకుంది.

హరీబరీగా పెళ్లి చేసుకున్నారెందుకని?
అప్పటి పరిస్థితి అది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆర్య సమాజ్‌లో చేసుకున్నాం. నౌ వియ్ ఆర్ ది మోస్ట్ హ్యాపీయస్ట్ కపుల్.


మీరేం చేస్తుంటారు?
నాది కన్‌స్ట్రక్షన్ బిజినెస్. ఈ మధ్యే నాలుగైదు అపార్ట్‌మెంట్స్ కంప్లీట్ చేశాం. ప్రొఫెషనల్‌గా ఇద్దరం బిజీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే తను వర్క్ చేయకూడదనుకున్నా ను. మామూలుగా నాలుగైదు నెలలు చేయొచ్చంటారు కానీ, ఏ ఒత్తిడీ  లేకుండా పీస్‌ఫుల్‌గా ఉంటే బాగుంటుందనిపించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం లైఫ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మాకిద్దరు రాబోతున్నారు. వెరీ వెరీ హ్యాపీ.

విజయ్‌గారితో మీ పెళ్లై పదేళ్లకు పైనే అయింది కదా.. పిల్లలను లేట్‌గా ప్లాన్ చేసుకున్నారేంటి?
భార్యాభర్తలుగా మేం ఫైనాన్షియల్‌గా జీరోతో స్టార్ట్ అయ్యాం. సెటిల్ కావడానికి టైమ్ పట్టింది. రెండేళ్ల క్రితం పిల్లలు ప్లాన్ చేద్దామని విజ్జూ అన్నాడు. ప్లాన్ చేసేశాం.

ట్విన్స్ అని తెలియగానే ఎలా అనిపించింది?
డాక్టర్ చెప్పగానే కన్నీళ్లు ఆగలేదనుకోండి. మీరు వెనక్కి తిరిగి చూస్తే గోడ మీద రాముడు, సీత ఫొటోలు ఉంటాయి. ఆ బొమ్మలను చూసినప్పుడల్లా ‘మీకు ఇద్దరు బిడ్డలు కదా.. నాకూ ఇద్దర్ని ఇవ్వండి’ అని కోరుకునేదాన్ని. నా చిన్నప్పుడు జంట అరటిపండ్లు, జంట టమోటాలు, జంట వంకాయలు తింటే కవల పిల్లలు పుడతారని అనేవాళ్లు. నేను కావాలని అవే తినేదాన్ని. ఈవెన్ వంకాయ కూర వండేటప్పుడు జంట కాయలుంటే కట్ చేయకుండా, వండేదాన్ని. నేను కవలల్ని కోరుకున్న ప్రతిసారీ ఆ దేవతలు ‘తథాస్తు’ అని ఆశీర్వదించారేమో అనిపిస్తోంది.

ఇద్దరు బిడ్డల్ని మోయడం ఎలా అనిపిస్తోంది?
రెండు ప్రాణాలు నాలో కదులుతున్నాయ్. దేవుణ్ణి చూసినప్పుడు కలిగే ఫీలింగ్ కలుగుతోంది. మెల్లిగా నడవడం అనేది నా హిస్టరీలో లేదు. ఇద్దర్ని మోస్తున్నాను కాబట్టి మెల్లిగా నడవక తప్పడం లేదు. కానీ, వేగం తగ్గినా ఆనందంగా ఉంది. గంటలు గంటలు నిలబడి యాంకరింగ్ చేస్తాను కాబట్టి, గతేడాది రైట్ లెగ్ లిగమెంట్ టియర్ అయింది. కొద్ది రోజుల తర్వాత మెట్లు దిగుతుంటే పడిపోయాను. ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయింది. అయినా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశాను. ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనిపిస్తోంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా రాసేస్తా ఉంటారు కొందరు. మంచి రాయడానికి కదిలే కలాలు తక్కువ. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు. రెండు కాళ్లకూ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా షోలు చేశాను. చాలామందికి నా పరిస్థితి తెలుసు. అదే హీరోకో, హీరోయిన్‌కో చిటికెన వేలికి దెబ్బ తగిలినా రాస్తారు. నాలాంటి వాళ్ల గురించైతే నెగిటివ్ విషయాలు తప్ప పాజిటివ్‌గా మాట్లాడరు. 

పదిహేనేళ్లకు పైగా నాన్‌స్టాప్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు పీస్‌ఫుల్ స్పేస్‌లో ఉన్నట్లనిపిస్తోంది?
నాకోసం నేను ఆలోచించుకోలేనంత బిజీగా ఉండేదాన్ని. నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు కెరీర్ మొదలైంది. యాంకర్‌గా కాస్ట్యూమ్స్ చూసుకోవడం, మేకప్ చేసుకోవడం, చుట్టూ ఉన్న ‘స్టుపిడిటీకి’ ఆన్సర్ చేయడంతోనే సరిపోయింది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేయాలి. దాంతో బాగా సంపాదిస్తున్నా ఐదు వేళ్లతో కడుపు నిండుగా తిన్న సందర్భాలు తక్కువ. ఇప్పుడు నా కోసం, నా ఇద్దరి బిడ్డల కోసం ఫుల్లుగా లాగిస్తున్నా. నో టెన్షన్. పీస్‌ఫుల్‌గా అనిపిస్తోంది. ఇంకో వారం, పది రోజుల్లోపే నా బిడ్డలు వచ్చేస్తారు. ‘అయామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే’.

అసలు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి ఎలా వచ్చారు?
నా చిన్నప్పుడే మా అమ్మ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు. స్టేజి షోలు చేశాను. వాటి ద్వారా అవకాశాలు వచ్చాయి. ‘ఎర్ర సైన్యం’ నా మొదటి సినిమా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశా. ఎక్కువగా టీవీపై దృష్టి పెట్టాను. పల్లెటూరి నుంచి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చా. ప్రాంతాల వివక్ష, కుల వ్యవస్థ అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు కావల్సినంత తీరిక దొరికింది కాబట్టి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయ్. ‘ఇన్ని కష్టాలు పడ్డామా?’ అనిపిస్తోంది.

ఇంతకీ కడుపులో ఉన్న బిడ్డలు తమ మూమెంట్స్ ద్వారా ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా?
కుడివైపు ఉన్న బేబీ డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఒకటే హడావిడి. ఎడమవైపు బేబీ అమ్మను ఇబ్బంది పెట్టకూడదన్నట్లు కామ్. ఇప్పుడు కావల్సినంత తీరిక కాబట్టి, నా లైఫ్ స్టార్ట్ అయిన విధానం, ఇక్కడిదాకా వచ్చింది ఆలోచించుకుంటుంటాను. బాధాకరమైన సంఘటనలు గుర్తొచ్చి ఫీలైతే కడుపులో ఉన్న బేబీలు కదలడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘డోంట్ వర్రీ అమ్మా’ అని అన్నట్లు అనిపిస్తోంది. ‘దటీజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్’.

జనరల్‌గా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లంటేచిన్న చూపు ఉంటుంది. చూసే చూపుల్లో, మాట్లాడే మాటల్లో వ్యంగ్య ధోరణి కనిపిస్తుంది. అవన్నీ ఎలా తట్టుకుంటారు?
కష్టమే. పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు వెకిలి శబ్దాలు చేస్తారు. మీద పడటానికి ట్రై చేస్తారు. చదువుకున్నవాళ్లకు సంస్కారం ఉంటుందంటారు. కానీ, చాలా చోట్ల ఆ మాట తప్పని పిస్తుంది. ఫ్లైట్‌లో అమ్మాయి కనిపిస్తే ఎగాదిగా చూస్తుంటారు. ఒక్కోసారి నేను తట్టుకోలేక, ‘కొంచెం తల తిప్పుకోవయ్యా’ అన్న సందర్భాలు న్నాయి. బాధగా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి? ఏ ఆడపిల్లనైనా రెస్పెక్ట్ చేసే సంస్కారం పెరగాలి. అది తక్కువ మందికి ఉంది.

వృత్తిపరమైన పోటీ, అసూయ కామన్. ఆ పరంగా చేదు అనుభవాలు ?
ఒకటి చెబుతా. యూఎస్‌లో ఒక  ప్రోగ్రామ్ చేశాం. మన తెలుగు పరిశ్రమలో ఆవిడ మంచి సింగర్. తనను స్టేజి మీదకు పిలిచే ముందు వీలైనంతగా పంప్ కొట్టేదాన్ని. నేను స్టేజి మీదకు రాగానే హైప్ క్రియేట్ అవుతుంది. తను రాగానే కొంచెం డౌన్ అవుతుంది. దాంతో ‘నేను ముందు వెళతాను’ అని తనే వెళ్లి పాడుతోంది. అందర్నీ స్టేజి మీదకు పిలుస్తోంది.. పాడుతోంది. నన్ను పిలవడంలేదు. కట్ చేస్తే.. యాంకర్స్ మీద సెటైర్ వేసే స్కిట్ రన్ అవుతున్నప్పుడు.. ‘యాంకర్ ఉదయభాను వస్తారు’ అని ఆ స్కిట్ చేసేవాళ్లే పిలిచారు. నేను స్టేజి మీదకు వెళ్లేటప్పుడు ఆర్కెస్ట్రా వాళ్లు నీరసం వచ్చే బీట్ ఒకటి వేశారు. వాళ్లను ఆవిడ తీసుకొచ్చింది. షో అయిపోయి, గుడ్‌బై చెప్పేటప్పుడు నన్ను తప్ప మొత్తం టీమ్‌ని పిలిచింది. అయినా నేను స్టేజి మీదకు వెళ్లి, ‘థర్టీ డేస్ నుంచి ఈ షో చేస్తున్నా. ఈరోజు లాస్ట్ షో. మీ అందరికీ గుడ్‌బై చెబుదామనుకున్నా. మేడమ్ పిలవలేదు. అందరూ అంటున్నారు మేం మళ్లీ రావాలని. నేను మళ్లీ రాను. రావాలని కూడా లేదు. ఇక్కడకు వచ్చి ఎన్నో సాధించారు. మీరు మన దేశం రావాలి. అక్కడ ఒకామె ఎదురు చూస్తోంది. ఆవిడే మీ అమ్మ. మీ దేశం కోసం, మీ ఊరి కోసం మీరు రావాలి. చేతనైనంత సాయం చేయండి. వస్తారని ఆశిస్తున్నా’ అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. మాట్లాడి వచ్చేశాక ‘నేను పిలవాలనే..’ అంటూ సాగదీసింది. ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే ఇండస్ట్రీలో నాకు స్నేహితులు తక్కువ. బయట నా కోసం ప్రాణమిచ్చే స్నేహితులున్నారు.

ఆకలి బాధ, ఆర్థిక కష్టాలు తెలుసా?
మా నాన్నగారిది చాలా పెద్ద కుటుంబం. జమిందార్లు. నా నాలుగేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. అప్పుడు నాన్న ఆస్తిలో అమ్మ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. లక్షలు లక్షలు తీసుకుని ఎవరైనా మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసు. అందుకే ఎవరైనా కష్టం అంటే వెంటనే సహాయం చేయాలనిపిస్తుంది. అనాథ పిల్లలకు పదివేలిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, సొంతవాళ్లకి మీరేమైనా ఇవ్వండి అది ఉండదు. మనం ఎదుగుతుంటే ఒకటే ఏడుపు. ఈ మధ్య ఓ అమ్మాయికి చిన్న సాయం చేశాను. తను అన్న మాటలు ఎప్పటికీ మరచిపోలేను. హెల్ప్ చేసినందుకు జీవితాంతం విశ్వాసంగా ఉండమని కాదు.. మన ఎదుగుదల చూసి, వాళ్లు ఆనందపడితే అప్పుడు మనకూ హ్యాపీగా ఉంటుంది కదా.

అప్పట్లో ‘లీడర్’లో ఐటమ్ సాంగ్ చేశారు.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు?
శేఖర్ కమ్ముల అడిగారు. బేసిక్‌గా నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి, ట్యూన్ నచ్చి చేశాను. ఆ పాట తర్వాత దాదాపు 25 ఐటమ్ సాంగ్స్‌కి అవకాశం వచ్చింది కానీ, చేయలేదు. ‘జులాయి’లో చేశాను.

ఆడపిల్లలు కావాలనుకుంటున్నారా? మగపిల్లలా?
నాకూ, విజ్జూకి ఎవరైనా ఓకే. ‘ఇప్పటికే ఇల్లంతా నీ బట్టలు, నీ నగలు.. నాకు ఒక్క కబోర్డ్ ఇచ్చావ్. ఇక, ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ల బట్టలు, నగలు... నాకు ఆ కబోర్డ్ కూడా ఉండదు’ అని నవ్వుతాడు.

ఇక ఇంటికే పరిమితం కాదల్చుకున్నారా...?
కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని, మళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తాను. నేను, విజ్జూ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేశాం. ఈలోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో పక్కన పెట్టాం.

మీ ఇద్దరు.. మీకిద్దరు. చాలా.. ఇంకా?
లేదండీ. నాకింకా పిల్లలు కావాలని ఉంది (నవ్వుతూ).

మరో వారంలో మీ ఇద్దరి జీవితంలోకి మరో ఇద్దరు రాబోతున్నారు.. తల్చుకుంటే ఏమనిపిస్తోంది?
ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా. రేపో మాపో.. ఐదు రోజుల్లోనో మా ఇంటికి పిల్లలు వచ్చేస్తారు. నా గురించి గాసిప్స్ రాసేవాళ్లు వీలైతే ఆశీర్వదించండి. హర్ట్ మాత్రం చేయొద్దు.

ఆల్ ది బెస్ట్ . పండంటి బిడ్డలు పుట్టాలని కోరుకుంటున్నాం...
థ్యాంక్యూ సో మచ్.
- డి.జి.భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement