యూపీలో ఏం జరిగింది?
మొన్న మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. అక్కడ అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అనూహ్యంగా దూసుకెళ్లింది. అక్కడ మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. మైన్పురి లోక్సభ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ మూడు లక్షల మెజారిటీతో నెగ్గారు. ఇక 11 అసెంబ్లీ సీట్లలో కూడా సమాజ్వాదీ 9 చోట్ల ఆధిక్యత కనబరిస్తే.. బీజేపీ మాత్రం రెండు చోట్లే ముందంజలో ఉంది.
ఉప ఎన్నికలు కావడంతో బీజేపీ అగ్రనాయకులు పెద్దగా ఇక్కడ ప్రచారానికి రాలేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గానీ, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో చక్రం తిప్పిన పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గానీ ఈసారి అక్కడ ప్రచారం చేయలేదు. దాంతోపాటు.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చేదుగుళికలు వేయడం మొదలుపెట్టింది. దీర్ఘకాలంలో దేశం బాగుపడాలంటే ముందు కొన్ని చేదు మందులు మింగక తప్పదని మోడీ ముందుగానే చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రజాకర్షక విధానాలకే పెద్దపీట వేస్తారు. ఇదే ఈసారి అక్కడ సమాజ్వాదీ విజయానికి పూలబాటలు పరిచిందని అంటున్నారు. పైగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఇంకా తాము సాధించిన విజయాలను ప్రచారం చేసుకునే అవకాశం కూడా కమలనాథులకు రాలేదు.
అయితే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని, అఖిలేశ్ యాదవ్ సర్కారు పనితీరుకు ఆ ఎన్నికలే గీటురాయిలా ఉంటాయి తప్ప ఈ ఉప ఎన్నికలు కావని బీజేపీ నేతలు అంటున్నారు. వాళ్ల కలలు ఫలిస్తాయో.. లేదో చూడాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే.