నలుదిశలా కైలాసం | Naludisala Kailasam | Sakshi
Sakshi News home page

నలుదిశలా కైలాసం

Published Tue, Feb 17 2015 1:00 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM

Naludisala Kailasam

పండుగ అనగానే పొద్దున్నే తలంటు పోసుకుని.. దగ్గర్లోని గుడికి వెళ్లేసి.. ఇంటికొచ్చేసి.. రిలాక్స్ అయిపోతాం.రొటీన్‌లైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న సిటీవాసులం ఇంతకన్నా ఏం చేస్తాం అంటారా..?  పండుగ సెలవును.. టీవీ చూస్తూనో.. సినిమాలతోనో కాల క్షేపం చేయకుండా..  మహా శివరాత్రిని మహదానందంగా జరుపుకోవాలంటే.. సకుటుంబ సపరివార సమేతంగా ఏదైనా శైవక్షేత్రానికి వెళ్లండి. ఒక్కరోజులో.. ఎలా అంటారా..! సిటీ నుంచి ఒక్కరోజులో హాయిగా వెళ్లొచ్చే దూరంలో శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం..
 ..:: త్రిగుళ్ల నాగరాజు
 
జాతరో జాతర..


వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ అని ప్రతీతి. క్రీస్తుశకం 750 నుంచి 973 వరకు ఈ ప్రాంతం చాళుక్య రాజుల ఏలుబడిలో ఉండేది. ఆ సమయంలోనే ఆలయం నిర్మించినట్టు తెలుస్తోంది. దేవర్షి నారదుడి ప్రార్థనతో.. ఆశ్రీత జన రక్షకుడిగా కాశీలో విశ్వేశ్వరుడిగా కొలువుదీరిన పరమేశ్వరుడు అక్కడ సంతృప్తి చెందక వేములవాడలో రాజరాజేశ్వరుడిగా వెలిశాడని స్థలపురాణం. గర్భగుడిలోని మహాలింగం సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. రాజరాజేశ్వరుడితోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కోటిలింగాల మంటపం ఆలయంలో కనిపిస్తాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడ జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కాగా, రాజన్నను దర్శించుకున్న భక్తులు ప్రధానాలయానికి వెలుపల ఉన్న హజ్రత్‌బాబా ఖాజాభాగ్ సావర్ దర్గానూ దర్శించుకుంటారు. కోడె మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ మరో విశేషం.

దూరం: హైదరాబాద్‌కు 127 కిలోమీటర్లు
రవాణా సౌకర్యం: ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి బస్సులు నడుస్తాయి.
 
సల్లంగ జూడన్న మల్లన్న


చారడేసి కన్నులవాడు.. బారడేసి మీసాలవాడు.. కొమురవె ల్లిలో కొలువు దీరాడు. జానపదుల కొంగు బంగారమై పూజలందుకుంటున్న మల్లికార్జునుడిని కాకతీయుల వీరశైవానికి ప్రతీకగా భావిస్తారు. ‘పోదాం పద యాతరో.. కొమురెల్లి జాతర..’ అంటూ శివరాత్రి ఉత్సవాలకు భక్తులు కొమురవెల్లికి బారులు తీరుతారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ఉన్న ఖండోభా దేవుడు ఇక్కడ మల్లన్నగా వెలిశాడని స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రానికి మరో విశేషం ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు.. ఎలా వచ్చారో అలా ముందుగా స్వామిని దర్శించుకుంటారు. స్నానం ఆచరించడం కాదు కదా.. కనీసం కాళ్లు కూడా కడుక్కోరు. దీన్నే ధూళి దర్శనం అంటారు. శివరాత్రి సంబరాలు ఇక్కడ అంబరాన్నంటుతాయి.

దూరం: హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు
మార్గం: హైదరాబాద్-కరీంనగర్ హైవేలో తిమ్మారెడ్డిపల్లి దగ్గర కుడివైపు తీసుకుంటే అక్కడికి 10 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది.
రవాణా సౌకర్యం: జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
 
భక్తి, ముక్తి సంగమం

మహాదేవుడి ఆగ్రహానికి గురై, పూజకు నోచుకోని బ్రహ్మ, కేతకి (మొగలిపువ్వు) సాక్షిగా వెలిసిన దివ్యక్షేత్రమే ఝరాసంగం. శాపవిమోచనానికి శివుడి ఆనతి మేరకు బ్రహ్మదేవుడు ఝరాసంగంలోని కేతకి వనంలో ఘోర తపస్సు ఆచరించాడట. అందుకు మెచ్చి శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని స్థలపురాణం. బ్రహ్మకు దర్శనమిచ్చిన మహాలింగమే నేడు సంగమేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటోంది. ఆనాడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని అభిషేకించిన జలాలు ఆలయం వెనుక భాగంలో అమృతగుండంగా మారిందని భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పరమేశ్వరుడికి నిత్యం కేతకి పూలతో పూజాదికాలు నిర్వహిస్తారు.

దూరం: నగరానికి 125 కిలోమీటర్లు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు 20 కిలోమీటర్లు
రవాణా సౌకర్యం: బస్సులు అందుబాటులో ఉన్నాయి
 
హరి పూజించిన హరుడు

రంగారెడ్డి జిల్లా కీసరగుట్టపై రామలింగేశ్వరుడు త్రేతాయుగం నాడు కొలువుదీరాడని అంటారు. సీతారాములు ఆంజనేయుడి సమేతంగా వనవిహారం చేస్తూ ఇక్కడికి వచ్చారట. ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్న శ్రీరాముడు.. కాశీకి వెళ్లి లింగం తీసుకురావాలని ఆంజనేయుడిని పంపాడట. ఈలోగా ముహూర్తం మించిపోతుండటంతో శ్రీరాముడు పరమేశ్వరుడిని ప్రార్థించగా.. లింగ రూపంలో వెలిశాడట. కాశీ నుంచి కేసరీ నందనుడు 101 లింగాలను తీసుకొచ్చేసరికే రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించేశాడట. దీంతో కలత చెందిన హనుమ తన తోకతో ఆ 101 లింగాలను తోసివేశాడని.. అవన్నీ తలోదిక్కూ పడ్డాయని కథ. ఆంజనేయుడిని శాంతింపజేసిన రాముడు ఇకపై ఈ ప్రాంతం కేసరి నామంతో వర్ధిల్లుతుందని వరమిచ్చాడట. ఆనాటి నుంచి కేసరిగిరిగా, ప్రస్తుతం కీసరగుట్టగా మారింది. ఇక చారిత్రక నేపథ్యంలోకి వెళ్తే.. క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల సైనిక స్థావరం ఈ గుట్టమీదే ఉండేది. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు దగ్గర మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్న.. తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకునేవారట. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వారే నిర్మించారు.

దూరం: హైదరాబాద్‌కు 35 కిలోమీటర్లు
రవాణా సౌకర్యం: ఈసీఐఎల్, సికింద్రాబాద్ నుంచి బస్సు సౌకర్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement