గోదావరి పుష్కరాలు - మహాత్మ్యం | Godavari Pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలు - మహాత్మ్యం

Published Sun, Jul 12 2015 12:39 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కరాలు - మహాత్మ్యం - Sakshi

గోదావరి పుష్కరాలు - మహాత్మ్యం

బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుపుకోవలసిందిగా పుష్కర శాస్త్రంలో వివరణ ఉంది. పుష్కర సమయంలో భూమండలంలోని సమస్త తీర్థాలే గాక, ఇతర లోకాల్లోని పవిత్ర తీర్థాలన్నీ గోదావరి నదిలో కలసి వుంటాయని ప్రగాఢమైన విశ్వాసం. ఈ పవిత్ర సమయంలో గోదావరి సమీపానికి త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, సప్తరుషులు, పితృదేవతలు, సర్వదేవతలూ ఒక పర్వకాలం దాటేవరకు అక్కడే నివాసాలు ఏర్పరచుకుంటారని ఐతిహ్యం.
 
పుష్కర మహాత్మ్యం...
పంచభూతాలలో ఒకటైన జలాన్ని ‘పుష్కరం’ అని పిలుస్తారు. ‘పోషయతీతి పుష్కరం’ అంటే పోషించేది పుష్కరం అని అర్థం. ఈ పదానికే మరొక వ్యుత్పత్తి అర్థం ‘పోషయతీతి, పుష్ణాతీతి పుష్కరం’ అంటే... పోషించేది, పుష్టినిచ్చేది అని పుష్కరానికి మరొక అర్థం కూడా ఉంది. పుష్కరకాలం ముగిసేవరకు ప్రకృతిలోని వివిధ జీవరాశులు వివిధ రకాలుగా తమ ధ్యానాలు, వ్రతాలు కొనసాగిస్తాయని ఒక విశ్వాసం.

ఇదే సమయంలో చేపలు త్రిషవణ స్నానాన్ని ఆచరిస్తాయని, చాతక పక్షి ఆహారం ముట్టుకోకుండా కఠోర ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందని, కొండ గుహల్లోని వివిధ మృగ జీవులు సైతం వ్రత కర్మలను పాటిస్తాయని, కొంగలు నిత్య ధ్యానాన్ని కొనసాగిస్తాయని పుష్కర శాస్త్రాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, నర్మద, కావేరి నదులు ప్రసిద్ధమైన నదులు. అవి మనకు ఐహికాముష్మిక సుఖాలను ప్రసాదిస్తాయని లోకోక్తి.
 
ఏ నదికి ఎప్పుడు?
ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులు అని పిలుస్తారు. నవగ్రహాలలో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశులలో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు, తొమ్మిది పాదాలు కలసి ఒక రాశిగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం గురువు ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు, అంటే గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చికరాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనూరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని (తపతి) నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధూనదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రణీతా (పరిణీత, ప్రాణహిత) నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా గంగా, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రణీత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు. ఈ విధంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పుణ్యనది అధిష్టానమై ఉంటుంది. ఆ పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు వచ్చి ఉంటారు. అందుకే ఆ సమయంలో ఆ నదిని చేరుకోవడం వల్ల ఆ దేవతలందరి సాన్నిధ్యం మనకు కలుగుతుందని విశ్వాసం.
 
పుష్కరాల ఐతిహ్యం...
పూర్వం ముద్గలుడు అనే ముని శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ఏమి కావాలని అడిగితే... ‘నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామీ!’ అని కోరుకున్నాడు ముద్గలుడు. అందుకు శివుడు తనలో ఉన్న అష్టవిధ శక్తులలో ఒకటైన జలంలో ముద్గలుని కలుపుకున్నాడు. ఆ తరువాత బ్రహ్మ కూడా శివుని గూర్చి తపస్సు చేస్తాడు. శివుడిలో ఉన్న జలతత్వాన్ని (ముద్గలుని) వరంగా ఇవ్వమని కోరతాడు. భూమండలాన్ని కమండలంగా మార్చి, అందులో జలతత్వాన్ని నింపి బ్రహ్మకు ఇచ్చాడు శివుడు. అది చాలా శక్తివంతమైన జలం కావున ఉత్తర దేశంలో ఒక మడుగును సృష్టించి అందులో ఈ జలాన్ని పోశాడు బ్రహ్మ. ఆ జలమే ‘పుష్కరం’ అయింది. ఆ పుష్కర ప్రదేశమే తరువాత వ్యవహారంలో ‘పోఖ్రాన్’గా మారింది.
 
మరో కథనమూ ఉంది...
బృహస్పతి మహర్షి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మెప్పించి దైవగురుత్వంతో పాటు పుష్కరుని తన వశం చేయమన్నాడు. కానీ పుష్కరుడు అందుకు అంగీకరించలేదు. ఇద్దరి మధ్య రాజీని చేశాడు బ్రహ్మ. అప్పుడు బృహస్పతి ప్రభావం ఉండే నదిలో పుష్కరుడు ఆ సంవత్సరం ఉండాలి. సంవత్సరం మొదట్లో 12 రోజులు చివరిలో 12 రోజులు మిగతా రోజులలో మధ్యాహ్నం కేవలం ఒకటిన్నర గంట పాటు ఆ నదిలో పుష్కరుడు ఉంటాడు. పై కారణంతోనే 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజులు పూర్తిగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే 12 సంవత్సరాల సమయాన్ని ‘ఒక పుష్కర కాలం’ అని పిలుచుకుంటుంటారు.
 
పుష్కర స్నానం ఎందుకు చేయాలి?
అన్ని స్నానాలలోకెల్లా నదీస్నానాలు ఉత్తమమైనవి అని పెద్దలు చెబుతారు. నీరు నది రూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మాతృమూర్తిగా భావించే సంప్రదాయం మనది. అటువంటి నదీమ తల్లికి పుష్కరకాలం వచ్చిందంటే ఆ 12 రోజులు కూడా 12 పర్వదినాలతో సమానమే. ‘పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకం’ అని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.

తెలుగులో ఒకే అక్షర భేదంతో పుష్కరము, ముష్కరము అనే రెండు వ్యతిరేక అర్థాలనిచ్చే పదాలున్నాయి. పుష్కరం అంటే ‘పునీతమైన కర్మ’ అయితే, ముష్కరం అంటే ‘దుర్నీతితో చేసే చెడ్డ కర్మ’. అయితే చెడ్డ కర్మలు చేసి జీవితకాలంలో మలినపడిన ముష్కరుల్ని సైతం ఒకే ఒక్క నదీస్నానంతో పుష్కరం పునీతుల్ని చేస్తుంది. అందుకే స్నానం, దానం, పితృతర్పణలు, శ్రాద్ధకర్మలు ఈ పుష్కరాల్లో చేయడం చేత పితృకర్మల పుణ్యం కోటిరెట్లు పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
 
శ్లో: జ్ఞాన హ్రదే ధ్యానజతే రాగద్వేష మలాపహే
యఃస్నాతి మానసేతీర్థం స యాతి పరమాం గతిమ్ జ్ఞానం అనే మడుగులో ధ్యానం అనే నీటితో రాగద్వేషాలు అనే మాలిన్యాలు పోయేటట్లు మానస తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని అర్థం.
 
శ్లో: ఉత్తమంచ నదీస్నానం మధ్యమం చ తటాకతే
అధమం కూప స్నానంచ ఖాండ స్నానేన కిం ఫలమ్ నదీస్నానం ఉత్తమమైనది. చెరువులో స్నానం చేయడం మధ్యమమైంది. బావిలో స్నానం చేయడం అధమమైంది. ఇక చిన్న తొట్టిలో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం ఉండదు అని దీని భావం.

పుష్కరిణిలో స్నానం చేసే ముందు...
శ్లో: జన్మ ప్రభృతి యత్‌పాపం స్త్రీయా వా పురుషేణ వా
 పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి
 అనే సంకల్ప మంత్రాన్ని చదివి నదిలో మునిగితే సర్వపాపాలు పోతాయనేది పురాణోక్తి.

పుష్కరాల్లో శ్రాద్ధకర్మలు...
పుష్కర కాలానికి గల మరో విశిష్టత పితరుల సంస్మరణార్థం చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయాల్లో దేవతలు, రుషులు వారితో పాటు పితరులు కూడా వస్తారనే ప్రమాణవాక్యం పుష్కర శాస్త్రాలలో పేర్కొనబడినది. ఇక్కడ చేసే శ్రాద్ధం వారికి తిండి పెడుతుందా? అనేది చాలామందిలో మెలిగే ధర్మసందేహం. కానీ మన కంటికి కనపడని కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు ఇక్కడ మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవంలోని ఆహార రసాన్ని మన పితరులకు అందిస్తుందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసంతో చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు.
 
పుష్కర శ్రాద్ధ ప్రమాణ శ్లోకాలు
శ్లో: ఆదౌ పితా తథా మాతా సాపత్నీ జననీ తథా
 మాతామహాస్సపత్నీకా ఆత్మపత్నీస్త్వనంతరం
 సుతభ్రాతృ పితృవ్యాశ్చ మాతులాస్సహ భార్యకాః
 దుహితా భగినీ చైవ దౌహిత్రోభాగినేయకః
 పితృష్వసా మాతృష్వసా సాజామాతాభావకస్స్ను సా
 శ్వశురౌ స్యాలకశ్చైవస్యామినో గురురిక్ధిభిః
 పితృ, మాతృ వర్గాలకీ, మాతామహి మాతామహ వర్గాలకీ, అన్నదమ్ములకూ, పినతండ్రి పెదతండ్రులకు, అక్కచెల్లెళ్లకూ, బావమరుదులకు, బావగార్లకు, మామగారికి, అత్తగారికి, గురువులకు, శిష్యులకు, పినతల్లి, పెదతల్లులకు, మేనత్తలకు, తన సంతానానికి, వారి సంతానానికి, అల్లుళ్లకూ కోడళ్లకూ ఇలా తనకు సంబంధించిన పైన చెప్పిన చనిపోయినవారందరికీ శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం, తర్పణం వదలటం వంటి కార్యక్రమాలను జరపడం పుష్కర సమయంలో అనాదిగా వస్తూవున్న ఆచారం.
 
ఔషధదానం వల్ల ఆరోగ్యం, సాలగ్రామాల దానం వల్ల వైకుంఠ ప్రాప్తి, గోదానం వల్ల కైలాస ప్రాప్తి, నువ్వుల దానం వల్ల దుఃఖాలు తొలగిపోవటం, నేతిని దానం చేయడం వల్ల ఆయుర్దాయం, గృహదానం వల్ల శాశ్వత సుఖం, భూదానం వల్ల అధికారం, బంగారు, వెండి దానాల ద్వారా ఇహపర సౌఖ్యాలు పుణ్యలోక ప్రాప్తి, మంచం, సేవకులను దానం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి, వస్త్రదానం వల్ల వసులోక ప్రాప్తి. పై వస్తువుల్ని ఇవ్వలేనివారు యథాశక్తి కొంత ధనాన్ని కూడా దానం చేయవచ్చు. సాలగ్రామం దానం అన్నిటికన్నా శ్రేష్టమైనది.
 - సి.శివారెడ్డి
సహాయ పరిశోధకుడు
సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప

 
పుష్కర దానాలు...
పుష్కర శాస్త్రంలో పుష్కరాలు జరిగే 12 రోజులలో ఏ రోజు ఏవేవి దానం చేయాలో వివరించి ఉంది.
మొదటి రోజు: భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజత దానం, అన్నదానం
రెండోరోజు: రత్నదానం, గోదానం, వస్త్రదానం, లవణదానం
మూడవరోజు: అశ్వదానం, ఫలదానం (నాలుగు రకాల పండ్లు), గుడ (బెల్ల) దానం, శాక (గుమ్మడి, ఆనప మొదలైనవి) దానం.
నాల్గవరోజు: తేనె, నెయ్యి, పాలు, నూనె, మధుర పదార్థాలు
ఐదవరోజు: ధాన్యం, బండి, ఎద్దులు, నాగలి, దున్నపోతులు మొదలైనవి దానం చేయాలి
ఆరవరోజు: ఔషధాలు (వట్టివేరు, జాజికాయ, జాపత్రి, కరక్కాయ), కస్తూరి, కర్పూరం, చందనం, సుగంధ ద్రవ్యాలు
ఏడవరోజు: పల్లకి, మంచం, పీట మొదలైనవి
ఎనిమిదవరోజు: అల్లం, దుంపలు, పూలదండలు, చందనం మొదలైనవి దానం చేయాలి
తొమ్మిదవరోజు: దుప్పటి, కంబళి సేవకులను దానం చేయాలి, పిండ ప్రదానాలు ఈ రోజునే చేస్తారు
పదవరోజు: పుస్తకదానం, సాలగ్రామ దానం, శాకదానం, రజిత (వెండి), ముత్యాలు దానం చేయాలి
పన్నెండవరోజు: మేక, నువ్వులు వంటివి దానం చేయాలి
 
గోదావరి సౌరభం...
 
 ఉరకలు వేసే పరుగులు తీసే
 చెంగూ చెంగున పొంగుతు వచ్చే గోదావరి
 
 వంతెన కాడా పంతా లాడక
 వంతూలేసుకు వంకరదారీ గోదారీ
 
 కండియా లందెలు గాజుల సందడి
 కడవల నీళ్లా గలగలగల ఒయ్యారీ
 
 పడమటింటిలోన బుట్టి పల్లాల అడుగు బెట్టీ
 పాపికొండల లోయగొట్టి, బద్రాద్రి దాపులో
 పట్టీసం సుట్టబెట్టి, కోనసీమతోపులో
 పాయపాయలైనావా! పాడి పంటలిచ్చావా
 పైడి పంటలిచ్చావా, గోదారీ జోతలూ, పాదాల జోతలో
 మా తల్లీ గోదారీ మా లచ్చీ జోతలో
 
 గోదారి గంగమ్మ గొప్ప యిల్లాలు
 ఆ దేవి సలవుంటే అదే మాకు సాలు
 నిండు చూలాలల్లే పిండి ఒంగే సేలు
 దండిగా రాలు బంగారు ధాన్యాలు
 గరిశెల్లు పండగా గాదెల్లు నిండగా
 
- దేవులపల్లి కృష్ణశాస్త్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement