సహజీవనం తప్పేమీ కాదు!
ఇంటర్వ్యూ
పరిణీతిని పలకరిస్తే చాలు... మాటలు పరవళ్లు తొక్కుతాయి. సినిమా గురించైనా, షాపింగ్ గురించైనా...
అలవాట్ల గురించైనా, ఇష్టాల గురించైనా...
ప్రేమ గురించైనా, సహజీవనం గురించైనా...
విషయం ఏదైనా కుండ బద్దలు కొట్టేయడం పరిణీతి స్టయిల్. కావాలంటే మీరే చూడండి...
ఎన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పేసిందో!
* వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ నిజం చెప్పండి... మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా?
లేదు. నేనింకా సింగిలే.
* కానీ ఆ మధ్య మీ పేరు కొందరితో ముడిపడిందే?
అవన్నీ ఎవరో సృష్టించారు. నిజం కాని విషయాల గురించి ఆలోచించేంత ఓపిక, తీరిక రెండూ నాకు లేవు.
* నిప్పు లేనిదే పొగ వస్తుందా?
నిప్పు లేకుండా పొగ రప్పించే టాలెంట్ కొందరికి ఉంటుంది. ఓ మగాడు ఎన్నిసార్లు ప్రేమలో పడినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఓ ఆడపిల్ల ఎవరినైనా చూసి నవ్విందంటే చాలు... ప్రేమలో పడిపోయింది, సిగ్నల్ ఇచ్చేసింది అనేస్తూ ఉంటారు. అసలు నవ్వినంత మాత్రాన సిగ్నల్ ఇచ్చేసినట్టేనా? ప్రతి నవ్వూ సిగ్నలే అవుతుందా?
* మరి ఏ నవ్వు సిగ్నల్ అవుతుంది?
పలక రింపుగా నవ్వే నవ్వు ఉంటుంది. ఇబ్బందిగా నవ్వే నవ్వు ఉంటుంది. నటనతో కూడిన నవ్వు ఉంటుంది. స్నేహంగా నవ్వే నవ్వు ఉంటుంది. హాస్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఓపెన్‌గా నవ్వే నవ్వు ఉంటుంది. ఇన్ని రకాల నవ్వులు ఉంటే, ప్రతి నవ్వుకూ ఒకే అర్థం చెబితే ఎలా? అయినా ప్రేమకు ఆహ్వానం నవ్వు ద్వారా కాదు, కళ్ల ద్వారా అందుతుంది.
* ప్రేమ గురించి బాగా తెలిసినట్టుందే?
ప్రేమ గురించి తెలియడం వేరు, ప్రేమను అనుభవించి తెలుసుకోవడం వేరు. నాకు ప్రేమ గురించి తెలుసు. కానీ దాన్ని ఇంకా అనుభవించలేదు. ఎందుకంటే నేనింకా ప్రేమలో పడలేదు.
* ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తారు?
సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన కలవాడై ఉండాలి. విధి నిర్వహణ దగ్గర్నుంచి వైవాహిక జీవితం వరకూ ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. మీకు నవ్వొచ్చినా సరే, ఒకటి చెప్తాను. మొదటి మూడు విషయాల్లోనూ కాంప్రమైజ్ అవుతాను. ఆ క్వాలిటీస్ లేకపోయినా ప్రేమిస్తాను. కానీ మూడో విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం నావల్ల కాదు. (నవ్వుతూ) ముక్కు మూసుకుని కాపురం చేయలేం కదా!
* అసలు ఎలాంటి భర్త దొరికితే ఆడపిల్ల సుఖపడుతుంది?
భర్త తనని గౌరవించేవాడు, తనని తనలా ప్రేమించేవాడు అయితే ఏ ఆడపిల్లకీ కష్టాలుండవు. కొందరు భర్తల్లో భార్య మీద చీప్ అభిప్రాయం ఉంటుంది. తనకేం తెలుసు, ఏం చేయగలదు అనుకుంటూ ఉంటారు. అలాంటివాణ్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. అలాగే కొందరు మనల్ని మనలా ఉండనివ్వరు. మనం వాళ్లకోసం చాలా మారిపోవాలి. మన అలవాట్లు, ఇష్టాయిష్టాలు మార్చేసుకోవాలి. నేనయితే అలాంటివాడిని అస్సలు భరించను. ఎలా కూర్చోవాలో, ఎలాంటి బట్టలేసుకోవాలో కూడా తనే చెప్పాలని చూస్తే లాగి ఒక్కటిస్తాను.
* మరి రొమాన్స్ సంగతి?
అది లేకపోతే ఎలా! దంపతులు ఎప్పుడూ రొమాంటిక్‌గా ఉండాలి. అయితే ప్రతి చిన్నదానికీ గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడం, పొగడ్తల్లో ముంచెత్తడం లాంటివి నాకు నచ్చవు. ప్రేమగా కాసిన్ని కబుర్లు చెప్పుకోవడం, ఇద్దరూ కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేయడం లాంటి చిన్న విషయాలు కూడా చాలా రొమాంటిక్‌గా అనిపిస్తాయి.
* సహజీవనంపై మీ అభిప్రాయం?
సహజీవనం తప్పేమీ కాదు. అయితే సహజీవనానికి నేనిచ్చే డెఫినిషన్ వేరు. ఓ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే... సూట్‌కేస్ పట్టుకుని అతనింటికి వెళ్లిపోయి, అతడితోనే కలిసి జీవిస్తూ, అతనితో కాపురం చేయడం కాదు సహజీవనం అంటే. దూరదూరంగా ఉన్నా... వారంలో నాలుగైదు గంటలే కలిసి గడిపినా... తృప్తిగా, సంతోషంగా, ప్రేమగా గడపాలి. ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. ఒకరి సంతోషం కోసం ఒకరు అన్నట్టుగా జీవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే... ఒకరి జీవితంలో ఒకరు, ఒకరి మనసులో ఒకరు ఉండాలి తప్ప ఒకే ఇంట్లో ఇద్దరూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు.