మకర సంక్రాంతి మనకు ముగ్గుల పండుగ...మునివాకిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దే ముదితల పండుగ...ధాన్యరాశులు ఇళ్లకు చేరాక వచ్చే రైతుల పండుగ...మకర సంక్రాంతితో మొదలవుతుంది ఉత్తరాయణం. భక్తితత్పరులందరికీ ఇది ఉత్తమాయణం.
మనకు ఏటా పన్నెండు సంక్రాంతులు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల పేరిట సూర్యడు రాశి మారినప్పుడల్లా ఇవి వస్తుంటాయి. ఎన్ని సంక్రాంతులు ఉన్నా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది. మకర సంక్రాంతి నాటితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పూజాదికాలకు, ఆధ్యాత్మిక సాధనకు, శారీరక పరిశ్రమకు, కృషికి అనువైనది ఉత్తరాయణం. మకర సంక్రాంతికి సంబంధించి పెద్దలు చెప్పే ఆధ్యాత్మిక విశేషం ఇది.
మకర సంక్రాంతి సాధారణంగా పుష్యమాసంలో వస్తుంది. పంటల కోతలు పూర్తయి పల్లెల్లోని రైతుల ఇళ్లన్నీ ధాన్యరాశులతో కళకళలాడే కాలంలో వస్తుంది. మకర సంక్రాంతి నాటికి ఆరుగాలం చేసిన కృషికి తగిన ఫలితం కళ్ల ముందు కనిపించడంతో కర్షకులందరూ సంక్రాంతి రోజున సంతోషంగా పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.
ముగ్గు ముచ్చట్లు
మన దేశంలో ముగ్గులు లేని ముంగిళ్లను ఊహించలేం. ముగ్గులు మన సాంస్కృతిక వారసత్వ సంతకాలు. మన అతివల అనాది కళాచాతుర్యానికి సంకేతాలు. ముంగిళ్ల ముందు ముగ్గులు వేసే ఆచారం ఎప్పుడు మొదలైందో చరిత్రలో ఇదమిత్థంగా నమోదు కాలేదు. ప్రాచీన భారతీయ చిత్రలేఖన గ్రంథాలు ‘చిత్రలక్షణ’, ‘చిత్రసూత్ర’ వంటి వాటిలో ముగ్గుల ప్రస్తావన ఉంది. అందువల్ల ముగ్గులను అనాది కళగా అనుకోవచ్చు. చిత్రకళలో చేయితిరిగిన చిత్రకారుల్లో పురుషపుంగవుల సంఖ్యే ఎక్కువ. అయితే, వాళ్లెవరూ ముంగిళ్లలో ముగ్గులు వేసిన దాఖలాల్లేవు. ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దడం పూర్తిగా మగువల కళ.
కోడికూతతోనే నిద్రలేచి, వాకిలి చిమ్మి, పేడనీటితో కళ్లాపి చల్లి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దడం తెలుగిళ్లలోనే కాదు, దేశవ్యాప్తంగా భారతీయుల ఇళ్లలో ఇదొక అనుదినచర్య. అభివృద్ధి వేగానికి పట్టణీకరణ పెరిగాక, వాకిళ్లు కుంచించుకుపోయాయి. కళ్లాపి చల్లడానికి వీల్లేని సిమెంటు గచ్చులు వచ్చిపడ్డాయి. నయా జమానాలో నగరాల దుస్థితి చెప్పనే అక్కర్లేదు... మనుషుల్లో అనివార్యంగా అపార్ట్‌మెంటాలిటీ పెరిగింది. అపార్ట్‌మెంట్లలో ఎవరి గూడు వాళ్లదే! ఎవరి గుమ్మం వాళ్లదే! గుమ్మం ముందు ఉండే ఖాళీ జాగా దోసెడంతే! అనివార్య అధునాతన పరిణామాల ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కళ్లాపి కనుమరుగైనా, ముగ్గులింకా కనిపిస్తూనే ఉన్నాయి.
ఇదివరకు చాలామంది రాతిపిండితో రంగవల్లికలను తీర్చిదిద్దేవాళ్లు. కొందరు నేరుగా ముగ్గురాతితోనూ , ఇంకొందరు చీమల వంటి చిరుజీవులకు ఆహారంగా కూడా ఉపయోగపడాలనే భూతదయతో వరిపిండితోనూ ముగ్గులు వేసేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది! పండుగల సీజన్‌లలో తప్ప మిగిలిన రోజుల్లో చాక్‌పీసులతో హడావుడి ముగ్గులు గీసి పారేస్తున్నారు. ఎలా గీసినా, వేటితో గీసినా వాకిళ్లలో ముగ్గులు గీయడాన్ని ముదితలింకా మరచిపోలేదు.
పురాణాల కంటే ప్రాచీనమైనవి...
ముగ్గూ– దాని పుట్టుపూర్వోత్తరాలు అంటూ తలపండితులెవరూ గ్రంథం రాయలేదు గానీ, ముగ్గులు పురాణాల కంటే ముందే పుట్టి ఉంటాయనే అంచనా ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన ఉంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణగాథ ఉంది. ఎప్పుడో సత్యకాలంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక రాజగురువు ఉండేవాడు. విధివశాన ఆ రాజగురువు కొడుకు అకాల మరణం చెందాడు. అనుకోని ఈ సంఘటనతో రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.
పుత్రశోకంతో ఆ రాజగురువు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమంటే, చనిపోయిన తన కొడుకును బతికించమంటాడు రాజగురువు. అప్పుడు బ్రహ్మదేవుడు... నేలను శుభ్రం చేసి, అక్కడ మనిషి ఆకారంలో ముగ్గు వేయించమని రాజును ఆదేశిస్తారు. అలాగే ముగ్గు వేయడంతో, చనిపోయిన రాజగురువు కొడుకును బతికిస్తాడు. అప్పటి నుంచి ముంగిళ్లలో ముగ్గులు వేయడం ఆచారంగా మారిందని చెబుతారు.
ముగ్గులు ఎందుకు వేస్తారంటే, కారణాలను కచ్చితంగా చెప్పలేం. అష్టలక్ష్ములను ఆహ్వానించడానికే కాదు, అతిథులను స్వాగతించడానికి కూడా ముంగిళ్లను ముగ్గులతో అలంకరించడం మన సంప్రదాయం. అతిథులను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా గౌరవించే సంప్రదాయం మన దేశంలోనే ఉంది. అందుకే ‘అతిథి దేవో భవ’ అంటారు. తిథి వారాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా వచ్చేవాళ్లే అతిథులు. అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి, అప్పుడు స్వాగత సన్నాహాల కోసం తత్తరపడటం సరికాదు. బహుశ ఆ ఉద్దేశంతోనే మనవాళ్లు ముంగిళ్లలో ముగ్గులు వేయడాన్ని దినచర్యగా మార్చుకొని ఉంటారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా, మకర సంక్రమణంగా ఈ వేడుకలను జరుపుకొంటారు. కర్ణాటకలో మకర సంక్రాంతిగా లేదా సుగ్గి హబ్బగా, ఒడిశాలో మకర సంక్రాంతి లేదా మకర చవుళొగా, తమిళనాడు, శ్రీలంక, మలేసియాలలో తాయి పొంగల్‌గా, ఉళవర్ తిరునాళ్‌గా జరుపుకొంటారు. హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాఘిగా, లోహ్రీగా, అస్సాంలో మాఘ బిహు లేదా భోగాలి బిహుగా జరుపుకొంటారు. పాకిస్తాన్‌లోని సింద్ ప్రాంతంలో తిర్మూరిగా ఈ వేడుకలను జరుపుకొంటారు.
కశ్మీర్‌లో శిశిర సంక్రాంతిగా, ఉత్తరప్రదేశ్‌లోను, బీహార్‌లోని పశ్చిమ ప్రాంతంలోను, నేపాల్‌లోను కిచిడీ పండుగగా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో పౌష సంక్రాంతిగా, మిథిల ప్రాంతంలో తిల సంక్రాంతిగా జరుపుకొంటారు. ఏయే ప్రాంతాల్లో వేడుకలను ఎలా జరుపుకొన్నా, ఈ వేడుకల్లో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. పంటలు చేతికి అందిన తర్వాత జరుపుకొనే ఈ వేడుకల్లో తయారు చేసుకునే పిండివంటల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ తప్పనిసరిగా కొత్తబియ్యం, నువ్వులు ఉపయోగిస్తారు. ఇళ్ల ముంగిళ్లలో తమ తమ పద్ధతుల్లో ముగ్గులను తీర్చిదిద్దుతారు. కొత్తబియ్యంతో పరవాన్నం, పొంగలి, కిచిడీ వంటి వంటకాలను, నువ్వులు బెల్లం కలిపి తయారు చేసే పిండి వంటలను ఇష్ట దైవాలకు, పితృదేవతలకు నివేదిస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు.
పెసర సున్నుండలు
కావలసినవి: పెసర పిండి – 1 కప్పు, మినప్పిండి – పావు కప్పు, బెల్లం – 1 కప్పు, నెయ్యి – అర కప్పు
తయారీ: ఓ బౌల్‌లో పెసర పిండి, మినప్పిండి వేసి కలపాలి. బెల్లాన్ని బాగా మెత్తగా తురమాలి. దీన్ని కూడా పిండిలో వేసి బాగా కలపాలి. తర్వాత కరిగించిన నేతిని కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో పోసి కలుపుతూ ఉండలు చుట్టుకోవాలి.
రవ్వలడ్డు
కావలసినవి: బొంబాయి రవ్వ – అర కిలో, చక్కెర – అర కిలో, ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు, పాలు – 1 కప్పు, యాలకుల పొడి – 1 చెంచా, డ్రై ఫ్రూట్స్ – కావలసినన్ని, నెయ్యి – తగినంత
తయారీ: డ్రై ఫ్రూట్స్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వను ఎక్కువ రంగు మారనీకుండా కొద్దిగా వేయించుకోవాలి. కొబ్బరిని కూడా వేయించి పెట్టుకోవాలి. చక్కెరను మిక్సీలో వేసి పొడి చేయాలి. పాలు వేడి చేసుకోవాలి. ఓ గిన్నెలో బొంబాయి రవ్వ, చక్కెర పొడి, కొబ్బరి, యాలకుల పొడి వేయాలి. వేడి పాలను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండ కట్టకుండా కలుపుకోవాలి. చివరగా చేతులకు నెయ్యి రాసుకుని, లడ్డూలు ఒత్తుకుని, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి..
సంపెంగ మొగ్గలు
కావలసినవి: గోధుమ పిండి – 1 కప్పు, మైదా – 1 కప్పు, చక్కెర – 200 గ్రా., బొంబాయి రవ్వ – అర కప్పు, డాల్డా – 25 గ్రా., ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ: ఓ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, డాల్డా వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, వాటిని చపాతీల్లా ఒత్తి, చాకుతో గాట్లు పెట్టాలి. తర్వాత వాటిని చుట్టి, రెండు చివరలూ గట్టిగా ఒత్తి కాస్త ముడిస్తే, ఇలా మొగ్గల్లా తయారవుతాయి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక, దాన్ని వేయించి పెట్టుకున్న సంపెంగ మొగ్గల మీద పోయాలి.
కొబ్బరి బూరెలు
కావలసినవి: బియ్యం – 1 కిలో, బెల్లం – అర కిలో, కొబ్బరి చిప్పలు – 2, నెయ్యి – 2 చెంచాలు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ: బియ్యాన్ని ఓ రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి, తడి పోయేదాకా ఆరబెట్టి పిండి చేసుకోవాలి. కొబ్బరి తీసి సన్నగా తురుముకోవాలి. బెల్లంలో నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. ఇందులో నెయ్యి వేసి, కరిగాక కొబ్బరి, పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫొటోలో చూపినట్టుగా ఒత్తుకుని నూనెలో వేయించాలి.
బూందీ అచ్చు
కావలసినవి: శనగపిండి – 1 కప్పు, బియ్యపు పిండి – అర కప్పు, బెల్లం – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి – చిటికెడు, నెయ్యి – 1 చెంచా, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ: శనగపిండి, బియ్యపు పిండులను ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఇందులో నీళ్లు పోసి, జారుడుగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. చిల్లుల గరిటె ద్వారా పిండిని నూనెలో పోస్తే బూందీలా వస్తుంది. దాన్ని బాగా వేయించి తీసేయాలి. ఆపైన బెల్లంలో ఓ కప్పు నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. ఇందులో నెయ్యి వేసి కలిపి, తర్వాత బూందీ, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ప్లేటుకు నెయ్యి కానీ నూనె కానీ రాసి, మొత్తం మిశ్రమాన్ని అందులో పోయాలి. దాన్ని అచ్చులాగా చేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తీపి గవ్వలు
కావలసినవి: మైదా – అరకిలో, నెయ్యి – 25 గ్రా., చక్కెర – పావు కిలో, యాలకుల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ: మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వీటిని గవ్వల్లాగా చేసుకుని, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కెరలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక యాలకుల పొడి చల్లి తీసేయాలి. ఈ పాకాన్ని వేయించి పెట్టుకున్న గవ్వల మీద పోయాలి. (పాకం ఇష్టం లేనివాళ్లు చక్కెరను పొడి చేసి, మైదా పిండిలో వేసి కలిపేసుకోవచ్చు.)
తెలుగునాట మకర సంక్రాంతి వేడుకలను విశేషంగా జరుపుకొంటారు. నిజానికి ఊళ్లల్లో మకర సంక్రాంతి సందడి నెల్లాళ్ల ముందు నుంచే మొదలవుతుంది. మకర సంక్రాంతికి నెల రోజుల ముందుగా వచ్చే ధనుస్సంక్రాంతితో ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం మొదలైన నాటి నుంచి మకర సంక్రాంతి వరకు ఇళ్ల ముంగిట కళ్లాపి చల్లి, అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది, వాటిపై గొబ్బెమ్మలను పేర్చి అమ్మాయిలందరూ ఉత్సాహంగా ఆటపాటలాడతారు. గొబ్బెమ్మల వేడుకలతో ఊరూరా నెల పొడవునా పండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగునాట ఊరూరా గంగిరెద్దుల సందడి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కోడిపందాల కోలాహలం కనిపిస్తుంది. మకర సంక్రాంతి వేడుకలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకొంటారు.వివిధ ప్రాంతాల వారు తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో మకర సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు.
మూడు నాలుగు రోజుల వేడుకలు
కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతి వేడుకలను మూడు రోజులు, మరికొన్ని చోట్ల నాలుగు రోజులు జరుపుకొంటారు. తొలి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ వేడుకలను జరుపుకోవడం తెలుగు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజు నుంచే ఇళ్లకు మామిడి తోరణాల అలంకరణలు ప్రారంభిస్తారు. అంతకు ముందే ఇళ్లకు మరమ్మతులు, సున్నాలు, రంగులు వేయడం పూర్తి చేస్తారు.
భోగి రోజున వేకువ జామునే కూడళ్లలోను, ఇళ్ల ముంగిళ్లలోను చలిమంటలు వేస్తారు. భారీ కలపదుంగలతో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో చాలామంది ఇళ్లలో పనికిమాలిన వస్తువులను కూడా పడేస్తారు. కొన్నిచోట్ల మహిళలు భోగి రోజున ఇళ్లలో బొమ్మల కొలువులు పెడతారు. ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి దృష్టిదోషాలు సోకకుండా ఉండటానికి తలపై రేగిపళ్లను పూలు, చిల్లర నాణేలు, చెరుకుగడల ముక్కలతో కలిపి పోసి, దిష్టి తీస్తారు.
రెండో రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి, కొత్తబియ్యంతో పరవాన్నం వండి పెద్దలకు నివేదిస్తారు. పితృదేవతలకు తిలలతో తర్పణాలు విడుస్తారు. నువ్వులతోనూ పిండివంటలు చేసుకుంటారు. ఈరోజును పెద్దపండుగగా పరిగణించడంతో రకరకాల పిండివంటలు వండుకుని బంధుమిత్రులతో ఆనందం పంచుకుంటారు. గంగిరెద్దుల వారు ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దుల విన్యాసాలను ప్రదర్శించడం సంక్రాంతి వేడుకల్లో కనువిందు చేసే దృశ్యం. అలాగే తలపై అక్షయపాత్రతో తిరిగే హరిదాసులు హరినామ సంకీర్తన చేస్తూ ఊరూరా తిరుగుతారు. గంగిరెద్దుల వారికి, హరిదాసులకు గృహస్థులు తమ శక్తికొద్దీ కానుకలను సమర్పించుకుంటారు.
మూడో రోజైన కనుమ పూర్తిగా వ్యవసాయదారుల పండుగ. పొలాల్లో తమతో పాటు ఎండనక వాననక శ్రమించిన మూగ పశువులకు కృతజ్ఞతలు తెలుపుకొనే వేడుక. కనుమ నాడు పశువులను పసుపు కుంకుమలతో అలంకరించి, వాటిని పూజిస్తారు. కనుమ రోజున చాలాచోట్ల కోడి పందాలు జరుగుతాయి. కొన్నిచోట్ల కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుముతో తయారు చేసిన గారెలు, ఆవడలు వంటి పదార్థాలను తింటారు. కొన్ని ప్రాంతాల్లో కనుమ రోజున కూడా మాంసాహారం ముట్టకుండా, ముక్కనుమ రోజున మాంసాహారం తింటారు.
పతంగుల పండుగ
మకర సంక్రాంతి రోజుల్లో చాలాచోట్ల గాలిపటాలను ఎగురవేయడం ఆనవాయితీ. చలికాలం కావడం, వాతావరణం పొడిగా ఆహ్లాదభరితంగా ఉండటం, గాలి అనుకూలంగా ఉండటంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో జనాలు ఆరుబయటకు చేరుకుని రంగు రంగుల పతంగులను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది.
గుజరాత్‌లో ఊరూ వాడా పతంగుల పోటీలు కూడా జరుగుతాయి. ఇదివరకటి కాలంలో దక్షిణాది ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా పతంగులను ప్రత్యేకంగా ఎగురవేసే ఆనవాయితీ లేకపోయినా, గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది ప్రాంతాల్లోనూ పతంగుల సందడి విరివిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, యువకులు పతంగులను ఎగురవేయడానికి ఉత్సాహం చూపుతారు.
Comments
Please login to add a commentAdd a comment